ఎనిమిదేళ్ల కొడుకుచేత వార్తాపత్రిక చదివించాలనుకుంది ఆ తల్లి. పిల్లలకోసమే వార్తాపత్రిక ఏదైనా ఉందా అనే వెతికింది. అలాంటి పత్రికలేవీ కనిపించక తన కొడుకు లాంటి పిల్లల కోసం ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ అనే పేరుతో దిన పత్రిక ప్రారంభించింది.
ఆ తల్లి పేరు నిధి అరోరా. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఉంటుంది. వార్తాపత్రికలు మనోవృద్ధికి ఎంతగా తోడ్పడుతాయో పిల్లవాడికి రోజూ పాఠంలా చెప్పేది. కానీ, కొన్ని రోజులకు పిల్లవాడితో పత్రిక చదివించాలనుకుంది. కానీ, పిల్లల కోసమే ఉన్న దినపత్రిక ఏదీ కనిపించలేదు. అందుకే, 2017లో ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ పేరుతో వార్తాపత్రిక ప్రారంభించింది.
కొడుకుతో సమయం కేటాయించాలని..
నిధి 2015 డిసెంబర్ వరకు మంచి కార్పోరేట్ సంస్థలో ఉద్యోగిని. క్వాలిటీ టైమ్‌ను కొడుకుకి కేటాయించాలనుకుంది. కొడుకులో చదివే అలవాటును పెంచాల్సిన అవసరంతో ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు పత్రికను దానితో పాటు ఓ ఎన్జీవో సంస్థను కూడా నడుపుతుంది. ఓ కన్సల్టింగ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా ఉంది. ఆమె పత్రికా పాఠకులు 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. పేపర్ ద్వారా పిల్లలకు మాట్లాడే గొంతుక అవ్వాలని, ఆ గళాన్ని తల్లిదండ్రులు వినాలని కోరుకుంటుంది.
దేశం నలుమూలలా..
పేపర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ ఉత్సాహం ఆమెను ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది. ‘మాకు భారతదేశం నలుమూలల నుండి, నాగాలాండ్, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్, కేరళ వరకు పాఠకులు ఉన్నారు. ఇప్పుడు దేశ హద్దులు దాటి జింబాబ్వే, యుఎస్, కెనడా, యు.ఎ.ఇ, దోహా, ఒమన్‌ల నుంచీ పాఠకులు కూడా ఉన్నారు. ఇంతగా పాఠకుల సంఖ్య ఎలా పెరిగిందో ఆశ్చర్యంగా ఉంది’ అంటోంది నిధి.
తల్లులతో సంభాషణ
తను రోజూ చేసే పని గురించి వివరిస్తూ –‘మా అబ్బాయి ఇప్పుడు చదివే అలవాటును పెంచుకోకపోతే, అది ఎప్పటికీ జరగదని నేను భయపడ్డాను. గురుగ్రామ్ తల్లులతో (ఫేస్బుక్ పేరెంటింగ్ గ్రూప్) నా ఆందోళనను పంచుకున్నాను. పిల్లల కోసం ఒక వార్తాపత్రికను ప్రారంభించాలనే ఆలోచన గురించి వారితో మాట్లాడాను. నన్ను ప్రోత్సహించారు. దీంతో వార్తాపత్రికను ప్రారంభించే ధైర్యం నాకు వచ్చింది. మొదటి కాపీని మా అబ్బాయికి ఇచ్చినప్పుడు, వచ్చి నన్ను కౌగిలించుకొని ‘అమ్మా, చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అన్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడనవసరం లేకపోయింది. రెండు నెలల్లో ఏడు వేర్వేరు ఎడిషన్లలో ఏడుగురు ఎడిటర్లు (తల్లులు) చేరారు. పిల్లల కోసం వారానికి ఒకరు చొప్పున ఎడిషన్ తీసుకువస్తారు. దీంతో ఆ తల్లుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు. మా పిల్లలు ఈ పత్రికను ఇష్టపడిన తర్వాత, మేం దానిని విస్తృతంగా పాఠకుల వద్దకు తీసుకువెళ్లాం.
కార్టూనిస్ట్‌గా ఎదుగుదల
పత్రికకు మా అబ్బాయి కూడా సాయం అందిస్తున్నాడు. పిల్లలూ పాల్గొంటున్నారు. దాదాపు 40–50 శాతం కంటెంట్ అంతా మా పాఠకుల నుండే వస్తుంది. బాగా, పజిల్స్, కార్టూన్లు (చైల్డ్ కార్టూనిస్టులు చేస్తారు), కవిత్వం, వర్డ్ మ్యాజిక్, ప్రస్తుత వార్తలు ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, ఆర్థిక శాస్త్రం, సాంకేతికత, సమాచార భద్రతకు సంబంధించినవి కూడా ఇస్తాం. మంచి పౌరులుగా పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి తగిన విభాగాలు మా పత్రికలో ఉన్నాయి. హింస, లైంగిక వేధింపులు మినహా అన్నింటినీ కవర్ చేస్తాం. దీని ద్వారా వారు ప్రధాన సమస్యపై మంచి అవగాహన తో ఉంటారు.
ముఖ్యమైన విషయం ఏంటంటే మా అబ్బాయి ఈ పేపర్‌కి కార్టూనిస్ట్ అయ్యాడు. సొంత ఆలోచనతో కార్టూన్లు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి క్రమశిక్షణ, నిబద్ధత, సకాలంలో పనులు చేయడం అలవాటైంది. సృజనాత్మకంగా బాధ్యతగా ఉండటం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. సమాజం పట్ల ఒక అవగాహనతో ఉంటున్నాడు. ప్రక్రియలో తల్లీకొడుకులుగా మేమిద్దరం ఎదిగాం అనిపిస్తుంది’ అని వివరించిన నిధి తమ పత్రికను హోటళ్ళు, ఆసుపత్రులు, పిల్లలలు ఉండే అన్ని చోట్లా వార్తాపత్రిక ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment