నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రపంచ పర్యావరణవేత్తల ఆందోళనను ఆలకించిన నైజీరియా టీనేజర్లు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నడుం బిగించారు. ఒకసారి వాడి పడేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యాషన్ బుల్ డ్రెసులు, బ్యాగులు రూపొందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నైజీరియాకు చెందిన 15 ఏళ్ల ఎసోహి ఒజిగ్బో ‘ట్రాషన్ షో’ ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవచ్చో చెబుతోంది.
వినూత్న అవగాహన కార్యక్రమం
నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పూనుకున్నారు. డస్ట్‌బిన్, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలను జాగ్రత్తలు పాటిస్తూ సేకరించి, ఉపయోగపడే వస్తువులు, ఫ్యాషనబుల్ దుస్తులను తయారు చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల డ్రస్‌లను ‘గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్ షో’ పేరిట ప్రదర్శించారు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫ్యాషన్ షోలో ఫ్యాషన్ డ్రస్సులేగాక ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్‌లు, డస్ట్‌బిన్‌ల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్ మాల్స్ వద్ద విక్రయిస్తున్నారు.
రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు
ఒజిగ్బో మాట్లాడుతూ.. ‘‘ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ.. మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాం. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సేకరించి .. శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాబ్రిక్ తో కలిపి కుట్టి మోడల్ వస్త్రాలు, బ్యాగులు రూపొందిస్తున్నాం. మేము రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్ షో మంచి వేదిక అయింది. మేమంతా టీనేజర్లం.. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి మాలో ఉంది. అందుకే స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్నాము’’ అని చెప్పింది.
గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవప్థాపకులు నినేడు మొగాంబో మాట్లాడుతూ..‘‘ఒజిగ్బో బందం తయారు చేసిన దుస్తులను షాపింగ్ మాల్స్‌లో స్టేజ్ షోలను ఏర్పాటు చేసి ప్రమోట్ చేయడమేగాక, ట్రాషన్ షో నిర్వహించి ప్లాస్టిక్ ఫాషన్‌కు జీవం పోశాం. ఒజిగ్బో బృందంలో అంతా టీనేజర్లే అయినప్పటికీ పర్యావరణంపై వారికున్న అవగాహన, భవిష్యత్తు తరాలకోసం ఆరాటపడడం విశేషం’’ అని మొగాంబో అభినందించారు.
( చదవండి: అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా! )
Comments
Please login to add a commentAdd a comment