కాసేపు లాఠీని పక్కనపెట్టి గరిటను పట్టుకుందాం అనుకుని కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ వారు ఈ వానల్లో వేడివేడిగా వంట చేశారు. వీడియో కూడా తీశారు. వాళ్లు లొట్టలేసుకు తింటుంటే నెటిజన్లు‘ఈ మాత్రం కళాపోషణ’ ఉండాలి అని మెచ్చుకున్నారు. కాని పోలీసు బాసులు మాత్రం వేరొకటి తలచారు. ఏమా వంట? ఏమా వైరల్?
ఆ పోలీసులు ఇంట్లో వంట చేసుకుని ఉంటే బాగుండు. కాని వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందో ఏమో, కొంచెం బోర్‌ను బ్రేక్ చేద్దాం అనుకున్నారో ఏమో ఏకంగా స్టేషన్‌లోనే వంట చేశారు. ఆ చేయడం వీడియోలో షూట్ చేసి ఇన్‌స్టాలో పెట్టారు. చూసిన జనం ఈ మాత్రం సర్దా ఉండాల్లే అని ముచ్చట పడితే పోలీసు బాసులు మాత్రం కయ్యిమన్నారు. అసలేం జరిగిందంటే కేరళలోని ఇలవుంతిట్ట అనే స్టేషన్‌లో పోలీసులు వంట చేసుకు తిన్నారు.
చికెన్‌ని తేవడం, ముక్కలు కొట్టించడం, కూర చేయడం, మటన్ కూర, దాంతో పాటు చిలగడదుంపల సంగటి కెమెరా ముందు అద్భుతంగా వండారు. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చి స్టేషన్ ఎస్.ఐతో పాటు అందరూ ఆరగించారు. దానికి మంచి పాట జత చేశారు. వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది... జనం రకరకాల సరదా కామెంట్‌లు చేశారు.
‘అప్పుడప్పుడు తినండోయ్... ఎప్పుడూ డ్యూటీయేనా’ అన్నారు. కాని ఈ వీడియో పోలీస్ బాస్‌ల కంట పడింది. ఆ ఏరియా ఐ.జి ‘ఈ విధంగా డ్యూటీలో వండుకు తినడం ఏ విధంగా విధులకు భంగకరం కాదో’ వివరణ ఇమ్మని ఆదేశించాడు. మరి ఐ.జి గారికి ఎక్సప్లనేషనే పంపుతారో ఇంకో కూర వండి కూల్ చేస్తారో తెలియదు.
(చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!)
Comments
Please login to add a commentAdd a comment