ఒక ఆలోచన ‘ఆట’ను మార్చేసింది | Pooja Rai turns discarded tires into colorful Playgrounds | Sakshi
Sakshi News home page

ఒక ఆలోచన ‘ఆట’ను మార్చేసింది

Published Sun, Jun 27 2021 12:30 AM | Last Updated on Sun, Jun 27 2021 12:30 AM

Pooja Rai turns discarded tires into colorful Playgrounds - Sakshi

స్కూలు పిల్లలతో పూజారాయ్‌

పిల్లలకు ఆటలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ, చాలా స్కూళ్లకు ఇది పెద్ద లోపంగానే కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలకు ఖాళీ స్థలం ఉన్నప్పటికీ తగిన క్రీడా వస్తువులు ఉండవు. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ ఎంపికలన్నీ చూసే పట్టింపు ఎలాగూ ఉండదు. కానీ, బెంగళూరుకు చెందిన పూజారాయ్‌ ప్రభుత్వ పాఠశాలల ఆట స్థలాలను అందమైన క్రీడా వస్తువులతో అక్కడి రూపురేఖలే మార్చేస్తోంది అదీ పాత టైర్లతో. ఆ వివరాల గురించి తెలుసుకోవాలంటే ఇటీవల ఆమె రూపొందించిన ప్లేస్కేప్‌కి మనమూ వెళ్లాల్సిందే!

బెంగళూరుకు 250 మైళ్ల దూరంలో ముల్లిపల్లం గ్రామంలో ఉన్న ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల అది. కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి స్కూల్‌ మూసేసే ఉంది. కిందటేడాది అక్టోబర్‌ నుంచి ఈ స్కూల్‌ ఆటస్థలాన్ని అందంగా మార్చడంలో విజయవంతమయ్యారు పూజారాయ్‌. పాత టైర్లకు మంచి రంగు రంగుల పెయింట్లు వేసి, వాటితో టైర్‌ స్వింగ్‌లు, మోడల్‌ మోటార్‌ సైకిల్‌ వంటివి ఏర్పాటు చేసింది. స్కూళ్లు ఇంకా తెరవకపోయినా పిల్లలు వచ్చి ఇక్కడ ఆటలతో కేరింతలు కొడుతున్నారు.

పాత టైర్లకు కొత్త రూపు
పూజా రాయ్‌ ఒక యువ ఆర్కిటెక్చర్‌. ఐఐటి ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా ఆమె తన క్లాస్‌మేట్‌తో కలిసి స్థానిక అనాథాశ్రమ పిల్లలకు ఆహారాన్ని ఇవ్వడానికి వెళ్లింది. ఆ సమయంలో కొంతమంది పిల్లలు ప్లేట్లతోనూ, విరిగిన పైపులతోనూ బ్యాడ్మింటన్‌ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యం ఆమెను కలవరపరిచింది. ‘పిల్లలందరికీ తమ బాల్యాన్ని ఆస్వాదించడానికి హక్కు ఉంది. ఆట ధనికులైన పిల్లలకే సొంతం కాదు’ అనుకుంది. తరువాత కొద్ది వారాల్లో, ఆమె తక్కువ ఖర్చుతో ఆట వస్తువుల ఏర్పాటు కోసం నిధుల గురించి స్నేహితులతో చర్చించింది.

అప్పుడే పాత టైర్ల గురించి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ప్రతి యేటా దాదాపు 100 మిలియన్‌ టైర్లు వృథాగా పడేస్తారు. వాటిని ఆట స్థలానికి కావల్సిన ఉపకరణాలుగా మార్చేస్తే, పర్యావరణానికి కూడా సహాయం చేయవచ్చు. ఈ ఆలోచనే 2015లో కార్యరూపం దాల్చింది. డజన్ల కొద్దీ పడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రపరిచి, గట్టిదనాన్ని పరిశీలించి, ఆట వస్తువులుగా మలిచి, రంగులతో పెయింట్‌ చేయించింది. ఆ మరుసటి ఏడాది ఆంథిల్‌ అనే పేరుతో ఎన్‌జీవోను స్థాపించింది. దేశమంతటా 800 మంది వాలంటీర్లతో 275 ప్లేస్కేప్‌లను కొత్తగా నిర్మించింది. ఇప్పుడు ఆరుబయట ప్రదేశాలు, అనాథ పిల్లల హోమ్‌లు, స్కూళ్లు కొత్తగా క్రీడా శక్తితో సంబరం చేసుకుంటున్నాయి.

అమ్మాయిల శక్తి..
‘మా పని ఎప్పుడూ అక్కడ ఉన్న స్థలం నుంచి పిల్లలకు ఏం కావాలి.. అనే దాని గురించే ప్రారంభమవుతుంది’ అంటున్న పూజ వాస్తు శిల్పిగా కూడా తన అనుభవాన్ని తెలియజేస్తుంది. ‘నాకు భవనాలు, గోడలపై ఆసక్తి లేదు. ప్రజలకు ఉపయోగపడేలా ఉన్న ఖాళీ స్థలాలను శక్తిమంతంగా మార్చాలనేదే నా తాపత్రయం. ముల్లిపల్లంలో ఉన్న ఆట స్థలానికి 60,000 రూపాయలు ఖర్చు అయ్యింది. పెద్ద ఆట స్థలాలకు అక్కడి ఏర్పాటును బట్టి ఖర్చు ఉంటుంది. స్వింగ్‌ చేసిన టైర్లు, సొరంగాలు, జింగిల్‌ జిమ్స్, స్టెప్సర్, క్యూబ్స్, ఏనుగు, గుర్రాల వంటి జంతువుల నమూనాలను ఇక్కడి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఒక సముద్ర తీర ప్రాంత గ్రామంలో ఆట వస్తువుల కోసం మా బృందం టైర్లతోనే ఓడను రూపొందించింది. నగరాలకు దగ్గరగా నివసించే పిల్లలు కార్లు, వంతెనలు, సొరంగాల వంటి వాటì ని కోరుకుంటారు.

బెంగళూరులోని ఒక బాలికల పాఠశాలలో అయితే పిల్లలు తమ ప్లే స్కేప్‌లో బాక్సింగ్‌ రింగ్‌ కావాలనుకున్నారు. వారి టీచర్‌కు దాని గురించి తెలియదు. అమ్మాయిలు ఇలాంటి ఆట స్థలాలనే కోరుకోవాలనే నియమం ఏమీ లేదు. ఇప్పుడు తమకేం కావాలో అమ్మాయిలు స్పష్టంగా ఉన్నారు. బలహీనంగా జీవించాలని వారు కోరుకోవడం లేదు. ఆత్మ రక్షణ విద్యలను అభ్యసించాలని, బలంగా ఎదగాలని, ఒత్తిడి తగ్గించే ఆట స్థలాలు కావాలని వారు కోరుకుంటున్నారు’ అని అమ్మాయిల ఆలోచనను వివరిస్తుంది పూజ. ‘చాలా ప్రాంతాలలో పిల్లల ఆటలకు తగినంతగా బయట స్థలం లేకపోవడమే నా ఈ ఆలోచనకు ప్రేరణ అంటుంది’ పూజారాయ్‌. ముల్లిపల్లం గ్రామంలోని పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న శ్రీలేఖా మురళీకృష్ణన్‌ ‘నాకు బ్లూ టైర్‌ స్వింగ్‌లో ఊగడం అంటే చాలా ఇష్టం. రోజూ ఇక్కడకు ఆడుకోవడానికే స్కూల్‌కి వస్తున్నాను. ఎప్పుడెప్పుడు స్కూళ్లు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాను’ అంటూ ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతుంది.
పిల్లల అందమైన బాల్యంలో ఆట ఎప్పుడూ ఒక భాగమే. అది ప్రతి ఒక్కరికీ హక్కుగా అంది తీరవల్సిందే. అందుకు పూజారాయ్‌ చేసిన ఆలోచన ఇప్పుడు బాలల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement