ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం.
పొటాటో లాలీపాప్
కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని
తయారీ:
► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి
► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్‌ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి.
వెజ్ స్ప్రింగ్ రోల్స్
కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు
తయారీ:
► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి
► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్‌కేక్‌లా అయ్యేలా పాన్‌ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి
► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి)
► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి
► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, చల్లారబెట్టాలి
► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి
► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్‌ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి
► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో రుచిగా ఉంటాయి.
స్టఫ్‌డ్ పనీర్ ఢోక్లా
కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు
తయారీ:
► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి
► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి
► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి
► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్‌లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి
► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి
► రెండవ ప్లేట్‌లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది)
► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి
► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment