
ఒక తరం వెనక్కి వెళ్లి మన మూలాలను వెతుక్కుంటే రంగస్థలంతో ముడిపడి ఉన్న సమాజం సగర్వంగా కనిపిస్తుంది. నాటకం, నాటక రంగం స్ఫూర్తితోనే ప్రస్తుతం మనం చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు పుట్టుకొచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలానికి టెక్నాలజీ తోడైన పరిణామక్రమమే సినిమా. ఈ నాటక రంగం మన మూలాలను తిరిగి తీసుకువచ్చేందుకు ఉవ్విల్లూరుతోంది. మోడ్రన్‌గా థియేటర్ ఆర్ట్ అని పిలుచుకునే రంగస్థలానికి, నాటకానికి ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామంలో ‘క్రియేటివ్ థియేటర్’ పేరుతో ఒక కళా సంస్థను స్థాపించి పదేళ్లుగా నాటకానికి పూర్వవైభవం కోసం కృషి చేస్తున్నాడు యువ కళాకారుడు అజయ్ మంకెనపల్లి.
గరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ ఆర్ట్ ఔత్సాహికులకు శిక్షణ అందించడంతో పాటు రంగస్థలం వేదికగా అద్భుతమైన నాటకాలకు ప్రాణం పోస్తూ కళా మూలాలతో ప్రయాణం చేస్తున్నారు. థియేటర్ ఆర్ట్‌ను నేటి తరం యువతకు, సినిమాకు వారధిగా మారుస్తున్న అజయ్ ప్రయత్నం గురించి ఆయన మాటల్లోనే..
కళతోనే ప్రయాణం..
కళ ఏదైనా సరే.., వాస్తవ రూపాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే భావోద్వాగాన్ని సృష్టిస్తుంది. ఈ కారణంతోనే లైవ్ యాక్టింగ్ (థియేటర్ ఆర్ట్) స్వచ్ఛమైన అనుభూతులను అందిస్తుంది. ఈ సాంత్వన, సంతృప్తి కోసమే ‘క్రియేటివ్ థియేటర్’ ప్రారంభించి శిక్షణ అందిస్తున్నాను. 3 నెలల పాటు కొనసాగే ఈ కోర్సులో వర్క్‌షాప్స్, లైవ్ యాక్టింగ్ సెషన్స్ నిర్వహించడమే కాకుండా ప్రతి బ్యాచ్‌తో రవీంద్రభారతి, రంగభూమి, తెలుగు యూనివర్సిటీ వంటి కళా వేదికలపైన నాటక ప్రదర్శన చేయిస్తున్నాను. ఇలా ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా థియేటర్ ఆర్ట్‌లో ప్రావీణ్యాన్ని అందించగలిగాను.
ఇందులో భాగంగా ప్రముఖ యువ తెలుగు రచయిత మెర్సీ మార్గరేట్ రచనల ఆధారంగా నాటకీకరణ చేసిన అసమర్థుడు, కో అహం వంటి నాటకాలతో పాటు ఆల్ఫా, విరాట, త్రిపుర శపథం వంటి ఎన్నో నాటకాలు ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన కథను నాటకంగా ప్రదర్శించిన ‘గొల్ల రామవ్వ’ నాటకానికి రఘుబాబు నేషనల్ థియేటర్ ఆర్ట్ అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నాం. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, ఖమ్మం వంటి పలు ప్రాంతాల్లో 60 వరకు ప్రదర్శనలు చేశాం. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు వేసవి శిక్షణలో భాగంగా ఇప్పటి వరకు 1800 మందికి పైగా భాగస్వాములయ్యారు.
భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాం..
అడ్వెంచరస్, జానపదాలు, టైం ట్రావెల్, సోషియో ఫాంటసీ, నవలలు, కథలు, షేక్‌స్పియర్ వంటి ప్రముఖుల రచనల నుంచి నాటకాలకు నాటకీకరణ చేసి దర్శకత్వం వహిస్తా. రంగస్థలం కమర్షియల్‌గా వృద్ధిలోకి రావాల్సిన అవసరముంది. ఈ ప్రయాణంలో రచయితలు, వాయిద్యకారులు, మేకప్ ఆరి్టస్టులు, లైటింగ్, క్యాస్టింగ్ ఇలా ఎంతోమంది కృషి ఉంటుంది. మా విద్యార్థులు 60 మంది వరకు సినిమాల్లో అవకాశాలు పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లోని ఎమ్‌పీఏ కోర్సులకు కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. 3 నెలల కోర్సులో భాగంగా నాతో పాటు ఈ యూనివర్సిటీల థియేటర్ ఆర్ట్స్ నిపుణులను ఆహ్వానించి శిక్షణ అందిస్తాను. ఐటీ మొదలు టీచింగ్, పోలీసు, మార్కెటింగ్ ఉద్యోగుల నుంచి ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు ఈ ఆర్ట్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు.
భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం
మా ప్రయత్నానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న సహకారం ఎనలేనిది. ఈ శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కళల ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా థియేటర్ ఆర్ట్‌కు సైతం ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. శిక్షణ కోసం లలిత కళాతోరణం వేదికగా సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సంస్థకు సరిపడా స్థలం అందిస్తే మరింత మందికి శిక్షణ ఇవ్వగలం.
Comments
Please login to add a commentAdd a comment