చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..?
రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్‌జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది.
ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్‌గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్‌గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్‌గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ.
ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది.
అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది.
ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్‌లోని ఏడు గ్రామాలకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ.
(చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!)
Comments
Please login to add a commentAdd a comment