మహిళల అపూర్వ విజయమిది..
జైపూర్: ఆ గ్రామం రాజస్థాన్ రాష్ట్రంలోనే మొదటి మద్య రహిత గ్రామంగా మారింది. మద్యం దుకాణాలను మూసివేయించేందుకు ఆగ్రామ ప్రజలు నడుంకట్టారు. ప్రజల్లో అవగాహన పెంచి మద్యం అమ్మకాల నిషేధంపై ఎక్సైజ్ శాఖ నిర్వహించిన పోలింగ్ కు మద్దతు పలికారు. మహిళల నేతృత్వంలో ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఫలితంగా మద్యం అమ్మకాల నిషేధాన్ని కోరుతూ 94 శాతం మంది ఓటు వేయడంతో రాష్ట్రంలోనే సంపూర్ణ మద్య రహిత గ్రామంగా పేరు తెచ్చుకుంది.
జైపూర్ నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజసమండ్ జిల్లా కచ్చబలి గ్రామం ఇప్పుడు సంపూర్ణ మద్య రహిత గ్రామంగా మారింది. రాజస్థాన్ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయితీల్లోని ప్రజలు కనీసం 50 శాతం కన్నా ఎక్కువమంది మద్య నిషేధాన్ని కోరుకుంటే అక్కడ మద్యం షాపులు పూర్తిగా మూసివేసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో జరిగిన పోలింగ్ లో మొత్తం 2,886 ఓటర్లకు గాను 2,049 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో మద్య నిషేధానికి అనుకూలంగా 1,937 ఓట్లు అంటే 94 శాతం మంది ఓటు వేయడంతో గ్రామంలో సమూలంగా మద్యనిషేధం అమల్లోకి వచ్చింది.
గ్రామాల్లోని దుకాణాలు మూసివేసి మరీ జనం పోలింగ్ లో పాల్గోవాలంటే రాజస్థాన్ ఎక్సైజ్ చట్టం 1975 ప్రకారం పంచాయితీ లేదా మునిసిపల్ వార్డుల్లోని కనీసం 20 శాతంమంది ప్రజలు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. మద్య నిషేధం కోరుతూ జిల్లా కలెక్టర్ అర్చన సింగ్ కు కూడ ఎన్నో ఫిర్యాదులు కూడా అందాయి. ముఖ్యంగా మద్యం ఈ ప్రాంతంలో పెద్ద సమస్యగా మారడం, దాంతో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావడంతో కొంత కాలంగా గ్రామంలో మద్య నిషేధంపై అవగాహన ప్రచారం జరుగుతోంది. గ్రామ సర్పంచ్ గీత ఫిబ్రవరిలో ప్రారంభించిన మద్య వ్యతిరేక ప్రచారం ప్రజల్లో అవగాహన పెంచింది. దీంతో మద్య నిషేధానికి మద్దతు పలుకుతూ ఓటు వేసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపించారు. పాఠశాల పిల్లలనుంచి, కార్యకర్తలవరకు ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొన్నారు. అదే అవగాహన పోలింగ్ ఫలితాలు అనుకూలంగా వచ్చేందుకు సహకరించింది. పోల్ నివేదికను తహసీల్దార్ కలెక్టర్ కు సమర్పించడంతో కచ్చబలి గ్రామంలో మద్యం షాపులను ఏప్రిల్ 1 కల్లా పూర్తిశాతం సీల్ చేసేందుకు నిర్ణయించారు.