ఇప్పుడు ఎకరాకు 30–35 బస్తాల ధాన్యం దిగుబడి.. ఆదర్శంగా జొన్నలగడ్డ | Sagubadi Veda Vari Cultivation In Jonnalagadda Guntur District Happy Farmers | Sakshi
Sakshi News home page

Veda Paddathilo Vari Sagu: ఇప్పుడు ఎకరాకు 30–35 బస్తాల ధాన్యం దిగుబడి

Published Tue, Jan 18 2022 5:02 PM | Last Updated on Wed, Jan 19 2022 8:25 AM

Sagubadi Veda Vari Cultivation In Jonnalagadda Guntur District Happy Farmers - Sakshi

ఎలాగైనా తమ గ్రామంలోని తన మెట్ట పొలంలోనే పుట్టెడు వడ్లు పండించుకోవాలన్న రైతన్నల తపనే ఆ గ్రామ రైతులను మూడు దశాబ్దాల క్రితం కొత్త దారిలో నడిపించింది. కాలువ సౌకర్యం లేనందున ఆరు తడులతోనైనా వరి పండించాలనే వారి ఆకాంక్ష వర్షాధారంగా వెద వరి సాగుకు పురికొల్పింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో రైతులకు వారి కృషి ఆదర్శంగా మారింది. 

గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డ నుంచి ప్రారంభమైన వెద పద్ధతిలో వరి సాగు పద్ధతి రైతులకు అనేక విధాలుగా ఉపయోగంగా ఉంది. పొలంలో నీరు నిల్వకట్టకుండా, దమ్ము చేయకుండా, నారు పోయకుండా వరి సాగు చేస్తున్నారు. ఆరు తడులతోనే డెల్టాతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రారంభమైన ఈ పద్ధతి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తోడ్పాటుతో నేడు అనేక రాష్ట్రాలకు విస్తరించింది.

జొన్నలగడ్డ గ్రామానికి నీటి పారుదల కాలువ సౌకర్యం లేదు. గ్రామంలో ఉన్న చిన్నపాటి చెరువులోని నీటిని తాగునీరు, సాగు నీరుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఐనప్పటికీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రైతులు ముందుగానే వరి నాట్లు వేసుకునేవారు. వర్షాభావ పరిస్థితుల్లో వరి పంట ఎండిపోయి పశువుల మేతగా మారేది. దీన్ని అధిగమించేందుకు ఆ గ్రామ రైతుల ఆలోచనల్లో నుంచి పుట్టిన వెద పద్ధతిలో వరి సాగు శాస్త్రవేత్తల మెప్పు పొంది సర్వవ్యాప్తమవటం విశేషం.

గ్రామంలో రైతులు వెద పద్ధతిలో వరి సాగుచేస్తూ వర్షాలు కురిసిన సమయంలో పడిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని ఎకరాకు సుమారు 35 బస్తాల ధాన్యం పండిస్తున్నారు. మొదట్లో ఎద్దుల అరకలతో మొదలైన వెద పద్ధతిలో రైతులే అరకలతో వెద పద్ధతిని పాటించేవారు. అప్పట్లో ఎకరాకు 20 కిలోల వడ్లు విత్తుకునేవారు. కాల క్రమేణా ఆధునిక యాజమాన్య పద్దతులను అలవాటు చేసుకోవటం విశేషం.  ట్రాక్టర్లకు అనుసంధానం చేసిన విత్తన గొర్రులతో వెద పద్ధతిలో ఎకరాకు 12–15 కిలోల వరి విత్తనాలు విత్తుకుంటున్నారు.

నారు నాటే విధానంలో కంటే వెద పద్ధతిలో సాగు చేయటం ద్వారా కూలీల ఖర్చులు, నారు ఖర్చులు, దమ్ము ఖర్చులు మొత్తం రూ. 10 వేల వరకూ పెట్టుబడి తగ్గుతుందని తెలిపారు. ఎరువులు, పురుగుమందుల ఖర్చు కూడా చాలా వరకూ తగ్గుతోంది. మరోవైపు నీరు ఎక్కువ అందుబాటులో లేకపోయినా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మిగిలిన యాజమాన్య పద్ధతులు నాట్ల పద్ధతిలో మాదిరిగానే ఉంటాయని తెలిపారు. వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు పదేళ్ళ క్రితం జొన్నలగడ్డ గ్రామానికి వచ్చి ఇక్కడ రైతులు సాగు చేస్తున్న వెద పద్ధతిని చూసి మెచ్చుకున్నారు.

ఒకటికి నాలుగు సార్లు పరిశోధించి, మెరుగుదలకు సూచనలిచ్చారు. ఈ పద్ధతి వర్షాధారంగా సాగు చేసే రైతులకే కాకుండా, సాగు నీరు ఉన్న డెల్టా ప్రాంతాల రైతులకూ ప్రయోజనకరమని గుర్తించడమే కాదు, ఇక్కడి రైతులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి వెద పద్ధతిలో సాగు చేయాలో అక్కడి రైతులకు శిక్షణ ఇప్పించారు. ఆ విధంగా జొన్నలగడ్డ రైతులు వెద వరి సాగుకు మార్గదర్శకులయ్యారు. సాధారణంగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల మిథేన్‌ వాయువు విడుదలై పర్యావరణానికి హాని జరుగుతోంది. వెద వరి పద్ధతి వల్ల ఆ సమస్య ఉండదు. 

3 ట్రాక్టర్లు.. రోజుకు 30 ఎకరాలు.. 
జొన్నలగడ్డ రైతులు సుమారు 15 ఏళ్లుగా సీడ్‌ డ్రిల్‌ను ట్రాక్టర్‌కు జోడించి వెద వరి విత్తుకుంటున్నారు. సీజన్‌లో మా వూరి నుంచి ట్రాక్టర్లు వెళ్లి ఇతర ప్రాంతాల్లో వెద వరి విత్తి వస్తూ వుంటాయి. మూడు ట్రాక్టర్లను ఒక దాని వెంట మరొకటి నడుపుతూ పొలాల్లో వరి, తదితర పంటలు విత్తుతారు. మొదటి ట్రాక్టర్‌ సీడ్‌ డ్రిల్‌తో సాళ్ల మధ్య 9 అంగుళాల దూరంలో వరి విత్తనాలు వేస్తుంది.

రెండో ట్రాక్టర్‌ గుంటకతో లెవల్‌ చేస్తుంది. మూడో ట్రాక్టర్‌ కలుపు మందును పిచికారీ చేస్తుంది. మొత్తంగా ఎకరానికి రూ. వెయ్యి ఖర్చు. రోజులో 25–30 ఎకరాల్లో పని పూర్తవుతుంది. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు వెద వరి విత్తక ముందే పిలిపెసర, జనుము తదితర రకాల విత్తనాలు 10 కిలోలు ఎకరానికి చల్లి, కొద్ది రోజులు పెరిగాక కలియ దున్నేస్తారు. ఆ తర్వాత వెద వరి విత్తుకుంటారు. 

30–35 బస్తాల ధాన్యం దిగుబడి
పండిన తర్వాత చేతి మిషన్లు (పాడీ రీపర్ల) తో పంట కోసి కుప్ప వేసి.. రెండు నెలలు మాగిన తర్వాత కుప్పలు కొడతారు. ఈ ఏడాది ఎకరానికి 30 బస్తాల వరకు ధాన్యం పండిందని జొన్నలగడ్డ కౌలు రైతు నవీన్‌రెడ్డి వివరించారు. హార్వెస్టర్లతో కోసి వెంటనే కాటా వేస్తే తేమ ఉంటుంది కాబట్టి ఎకరానికి 35 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. 

గ్రామంలోని రైతులంతా వెద పద్ధతిలోనే వరి సాగు చేసుకుంటున్నారు. సొంత పొలం ఉన్న రైతులు కొందరు ఒక్కో ఎకరం వాళ్లు తినటానికి వెద వరిని సేంద్రియ విధానంలో సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే చాలా గ్రామాల్లో రైతులు తమ పద్ధతి నేర్చుకొని ఇప్పుడు వాళ్లే చేసుకుంటున్నారని జొన్నలగడ్డ రైతులు సంతోషంగా చెబుతున్నారు. కాలువ నీరు ఉన్న ప్రాంతాల్లో రైతులు కూడా నీటిని నిల్వగట్ట కుండా వెద ప్ధతిలోనే వరి సాగు చేసుకుంటున్నారు. బెట్ట తగిలినప్పుడు నీళ్లు కట్టుకుంటూ ఉంటే తెగుళ్ల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. 
– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఫొటోలు : గజ్జల రామ్‌గోపాల్, మల్లి

చిన్నప్పటి నుంచే వెద వరి సాగు
నాకు ఊహ తెలిసిన నాటి నుంచి మా గ్రామంలో వెద పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల కౌలు పొలంలో వర్షాధారంగానే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్నాను. ఈ విధానంలో  దమ్ము, నాటు కూలీల ఖర్చులు తగ్గుతున్నాయి. ఎకరానికి రూ. పది వేల వరకు ఖర్చు తగ్గుతుంది. నాట్లు వేసి పండించిన పంటతో పాటుగా దిగుబడి వస్తుంది. కోతలు అవ్వగానే అదే తేమ మీద రెండో పంటగా గడ్డి జొన్న/ తెల్లజొన్న/ పెసర/ మినుము.. ఎవరికి వీలైన పంట వాళ్లు విత్తుకుంటాం. ఏ పంటైనా సరే విత్తుకునేది సీడ్‌ డ్రిల్‌తోనే. – వంగా నవీన్‌రెడ్డి (99631 81999), వెద వరి రైతు, జొన్నలగడ్డ, 

గుంటూరు జిల్లా సాళ్ల మధ్య 9 అంగుళాలు
వెద పద్ధతిలో సాగు ద్వారా దుక్కి దున్నుకుని విత్తనం విత్తుకుంటే కలుపు రాకుండా చూసుకోవటమే పని. ఎరువుల యాజమాన్యం, పురుగు మందులు సకాలంలో తక్కువ స్థాయిలో పిచికారీ చేసినా సరిపోతుంది. నేను 10 ఎకరాలు సాగు చేస్తాను. ఈ విధానంలో ఒకవేళ వరదలు ముంపులు వచ్చినపుడు వరి దుబ్బులు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల పంట పడిపోకుండా ఉంటుంది. పైనాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. విత్తనం విత్తుకునే సమయంలో రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలుకు సాలుకు 9 అంగుళాల దూరం ఉండాలి. మిగిలిన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడి సాధించవచ్చు.
– వింతా కోటిరెడ్డి (73826 07210), వెద వరి రైతు, జొన్నలగడ్డ, 

గుంటూరు జిల్లా ఏటా పది గ్రామాల రైతులకు నేర్పిస్తున్నా
వెద పద్ధతిలో సాగు చేయటం వల్ల అరకలతో కలుపు నివారణ చేసుకోవచ్చు. సాలు సాలుకు గ్యాప్‌ తక్కువగా ఉండటంతో కలుపు తక్కువగా ఉంటుంది. విత్తుకున్న తర్వాత ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించగలిగితే చాలు. నేను సాగు చేస్తున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏడాది కొత్తగా పది గ్రామాల్లో వెద పద్ధతిలో వరి వేసేందుకు రైతులు నన్ను తీసుకెళుతుంటారు. ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతులకు సాగు విధానం తెలిపి వస్తుంటాం.
– పులగం కృష్ణా రెడ్డి (97011 32691), సీనియర్‌ రైతు, వెద వరి రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా

అధునాతన యంత్రాలతో పని సులువు
లాం ఫాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు, రైతుల సొంత ఆలోచనలతో మొదటి నుంచి వెద పద్దతిలోనే సాగు చేస్తున్నాం. శాస్త్రవేత్తల సలహాలు ఎంతో మేలు చేశాయి. ఈ విధానం చూసి రైతులకు అవసరమైన అధునాతన ట్రక్టర్‌లు, గొర్రులు, విత్తనాలు విత్తుకునే యంత్రాలు శాస్త్రవేత్తలు తెలియజేశారు. వాటితో ప్రస్తుతం సులువుగా తక్కువ ఖర్చుతో, సులువుగా విత్తుకొని సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. 
– లంకిరెడ్డి రంగారెడ్డి (99086 62386), సీనియర్‌ రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా

అంతా ఆరుతడులతోనే..   
నెలకు ఒకసారి వర్షం కురిసినా వెద పద్దతిలో వరి సాగుకు అనుకూలంగానే ఉంటుంది. ఎక్కువ వర్షం కురిసినా పంటలోని నీరును బయటకు వెళ్ళబెట్టుకోవాల్సిందే. ఆరుతడులతో పంట మంచి దిగుబడి వస్తుంది. యాజమాన్య పద్దతులు సక్రమంగా పాటించినట్టయితే చీడపీడలు తక్కువగానే ఉంటాయి. ఎరువులు, పురుగు మందులుసైతం రెండు మూడు సార్లు మాత్రమే వినియోగిస్తుంటాం. మామూలుగా నాట్లు వేసిన పంటలతోపాటుగానే కోతకు వస్తుంది. అదేవిధంగా దిగుబడి ఉంటుంది.
– ఆళ్ళ కృష్ణారెడ్డి (99489 27692), సీనియర్‌ రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement