‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు సరే... ఏం మాట్లాడుకుంటారు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. తెల్లగా, చల్లగా, నిండుగా ఉన్నాడు. అతన్ని మధ్యవర్తిగా తెచ్చుకుంటే పోదా... పాట మొదలవుతుంది.
‘ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా’...
ప్రేక్షకులూ వారిద్దరితో పాటు చందమామను చూస్తారు. చందమామతో కలిసి పాడతారు. చందమామను గుర్తు పెట్టుకుంటూ ఇంటికెళ్లి తమ డాబా మీద కూడా దానిని దించొచ్చేమోనని చూస్తారు. అది చందమామ మహాత్యమా? కాదు. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే మహత్యం. తెలుగువారికి చంద్రుణ్ణి, పున్నమిని, వెన్నెలను, చల్లదనాన్ని ఇచ్చి మబ్బుల్లోకి చేరిన భావుకుడైన సినిమాటోగ్రాఫర్ ఆయన. ‘విజయా’ సంస్థలో సుదీర్ఘంగా పని చేసి, పని చేసిన ప్రతి సినిమాలోనూ చంద్రుణ్ణి స్టూడియోలోకి దించిన ఘనుడు. అందుకే చందమామను తెలుగువారు విజయావారి చందమామ అని కూడా అంటారు. జగతిలో నిజం చందమామ కంటే ఈ విజయావారి చందమామే బాగుంటాడు.
మార్కస్ బార్ట్‌లే ఆంగ్లో ఇండియన్. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో కెమెరా పట్టుకుని ప్రయోగాలు చేసి పెద్దయ్యాక సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ట్రిక్ ఫొటోగ్రాఫీలో ఆయన జీనియస్. పాతాళభైరవి, మాయాబజార్‌లలో ఆయన విశ్వరూపం భారతదేశంలో మరెవరికీ సాధ్యం కానిది. కాని అవన్నీ ఆబాలగోపాలం వినోదానికి. కాని రస హృదయం కలిగిన స్త్రీ, పురుషులందరికీ ఆయన సేద ప్రసాదించినది తన చందమామతోనే. వీలున్న ప్రతిపాటలో ఆయన నిండు చందమామను చూపించేవాడు. శాంతం కలిగించేవాడు. ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ డ్యూయెట్ చూడండి. రాజమహల్‌లో మాలతి పాడుతూ ఉంటుంది. నిండు చందురూడు వేళ్లాడుతున్న ఉద్యానవనంలో ఎన్.టి.ఆర్. ‘ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా’... అని జాబిల్లితో ఎన్.టి.ఆర్ నివేదించుకోవడం బార్ట్‌లే అందుకు తగ్గట్టుగా
చందమామను సెట్ చేయడం... అద్భుతం.
‘మిస్సమ్మ’ కథంతా చందమామే. ‘ఏమిటో ఈ మాయా’ పాటలో, ‘బృందావనమది అందరిది’ పాటలో చందురుడి అందమే అందం. ఆపై అదే సినిమాలో ‘రావోయి చందమామా’ అనే పాట మార్కస్ బార్టే›్ల చంద్రుడి కోసమే పుట్టింది. అసలు ఈ చంద్రుడే లేకుంటే వీళ్లందరి విరహాలు, వేడుకోళ్లు ఎలా తీరేవా అని.
‘జగదేకవీరుని కథ’లో బి.సరోజా ‘హలా’ అని చంద్రుడికి హలో చెప్పగా ఎన్.టి.ఆర్ పక్కన చేరగా ‘అయినదేదో అయినది ప్రియ గానమేదే ప్రేయసి’ పాట మొదలైతే చూడాలి ఆ పోటీ... ఎన్.టి.ఆర్ అందమా,
సరోజా దేవి చందమా, చంద్రుడి చందనమా.
ఇక ‘మాయాబజార్’దే కదా అసలు కథంతా. ఆ సినిమా అంతా ఎన్నోసార్లు చంద్రుడు కనిపిస్తాడు. ‘నీ కోసమే నే జీవించునది’ పాటలో చందమామలో ఏకంగా శశిరేఖనే చూస్తాడు అభిమన్యుడు. అసలు రెల్లు పొదల చాటు నుంచి ఉదయించిన చంద్రుడు ద్యోతకమవుతుండగా, నీటి అద్దంపై అతగాడి ప్రతిబింబం పడుతూ ఉండగా, నౌకాయానానికి బయలుదేరిన శశిరేఖను, అక్కినేనిని చంద్రుడు ఎంత ప్రేమగా తల నిమిరాడని. ఎంత అక్కరగా లాలించాడని. మార్కస్ బార్ట్‌లే మహిమ వల్ల శ్రీకృష్ణుడు, రుక్మిణి సరే బలరాముడు, రేవతి కూడా ముచ్చటగొలుపు తారు.
మార్కస్ బార్ట్‌లే గొప్పవాడని సినీ అభిమానులకు తెలుసు. ఆయనను చాలా ఇష్టంగా తలుచుకుంటారు. ఎప్పుడు ఆకాశాన పూర్ణ చంద్రుడు కనిపించినా ‘అదిగో విజయావారి చందమామ’ అని ఆయనకు నివాళులు అర్పిస్తారు. మార్కస్ బార్ట్‌లే 1993లో మద్రాసులో మరణించారు.
మార్కస్‌బార్ట్‌లే: చంద్రుడిని చూపినవాడు
Published Thu, Apr 22 2021 1:03 AM | Last Updated on Thu, Apr 22 2021 10:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment