విధి ద్రోణాచార్యుడే! ఆమె ఏకలవ్య కాదు!! | Sakshi Special Story Doctor Maria Biju inspirational | Sakshi
Sakshi News home page

విధి ద్రోణాచార్యుడే! ఆమె ఏకలవ్య కాదు!!

Published Thu, Mar 4 2021 12:28 AM | Last Updated on Thu, Mar 4 2021 4:11 AM

Sakshi Special Story Doctor Maria Biju inspirational

మేరియా ముందు లేడిపిల్ల దిగదుడుపు. ఎం.బి.బి.ఎస్‌ జాయిన్‌ అయితే కాలేజీ అంతా తూనీగ ఎగిరినట్టే. ఫస్ట్‌ ఇయర్‌ అయ్యింది. హాస్టల్‌లో బట్టలు ఆరేస్తూ సెకండ్‌ ఫ్లోర్‌ నుంచి కింద పడింది. విధి వచ్చి నీ మొత్తం శరీరాన్ని చలన రహితం చేస్తాను అంది. ఆమె అంగీకరించిందా? తల వొంచితే ఈ కథే ఉంటుందా?

మొన్నటి అంటే 2021 ఫిబ్రవరి 1న కేరళలోని తొడుపూజ మెడికల్‌ కాలేజీలో 25 ఏళ్ల మేరియా బిజు హౌస్‌ సర్జన్‌గా చేరింది. ఆమె ఆ కాలేజీ విద్యార్థినే. ఇప్పుడే అదే కాలేజీలో హౌస్‌ సర్జన్‌. అయితే ఈ రెంటికీ నడుమ ఒక పెద్ద పోరాటం ఉంది. సంఘర్షణ ఉంది. గెలుపూ ఉంది. ఎందుకంటే 2015లో అదే కాలేజీలో మెడిసిన్‌ స్టూడెంట్‌గా చేరిన మేరియా వేరు. మొన్న హౌస్‌ సర్జన్‌గా డ్యూటీ తీసుకున్న మేరియా వేరు. నాటి మేరియా మోటర్‌ సైకిల్‌ మీద తుర్రున దూసుకెళ్లే మేరియా. నేటి మేరియా వీల్‌చైర్‌లో స్థయిర్యంగా చిరునవ్వు నవ్వే మేరియా.

ప్రమాదాన్ని ఎదుర్కొని...
మేరియాకు డాక్టర్‌ కావాలని కోరిక. ఇంకా చెప్పాలంటే మంచి సర్జన్‌ కావాలని కోరిక. అందుకే మెడిసిన్‌లో చేరింది. కొట్టాయంకు దగ్గరగా ఉండే తొడుపూజ మెడికల్‌ కాలేజీలో ఎన్నో కలలతో అడుగుపెట్టింది. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్‌ అయ్యింది. రెండో సంవత్సరంలో ఉండగా 2016లో జూన్‌ 5న ఆమెకు ప్రమాదం జరిగింది. హాస్టల్‌లో బట్టలు ఆరేస్తుండగా కాలు జారి రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయింది. ‘నా మెడ, తొడ ఎముక విరిగి పోయాయి’ అని చెబుతుంది మేరియా. వెంటనే ఆమెను దగ్గరిలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. స్థానికంగా ఒక సర్జరీ అయ్యాక వెల్లూరు సి.ఎం.సిలో ఆమె నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. ‘నా మెడ కింది భాగమంతా చచ్చుబడింది’ అని చెబుతుంది మేరియా. ఆ సమయంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద మద్దతుగా నిలిచారు. కాలేజీ యాజమాన్యం కూడా ధైర్యం చెప్పింది. ‘మెడికల్‌ సీటు అలాగే ఉంటుందని... ఎప్పుడు కోలుకుంటే అప్పుడు తిరిగి వచ్చి చదువుకోవచ్చని’.

స్నేహితులే తోడుగా
ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత మేరియా కాలేజీకి వీల్‌చైర్‌ మీద తిరిగి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న స్నేహితులకు ధైర్యం చెప్పింది. తాను ధైర్యం తెచ్చుకుంది. ‘అయితే నేను ఎగ్జామ్స్‌ రాయడమే పెద్ద సమస్య అయ్యింది. నా వేళ్ల మీద కూడా నాకు పట్టు లేదు’ అని చెప్పిందామె. ‘ఎగ్జామ్స్‌ రాయడానికి లేఖకుణ్ణి పెట్టుకోవచ్చని కాలేజీ వారు చెప్పారు. అయితే మెడికల్‌ విషయాలుండే పేపర్లు రాయాలంటే సాధారణ వ్యక్తులు సరిపోరు. మరో మెడికోనే తీసుకోవాలి. అందుకు నిబంధనలు ఒప్పుకోవు. కనుక నా వేళ్లను కదిలించి నేనే ఎగ్జామ్‌ రాయాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది మేరియా. అయితే అది అంత సులువు కాలేదు. ఎంతో శ్రమ పడి, ఫిజియో థెరపీ తీసుకుని ఆమె తను కుడిచేతి వేళ్లను కదిలించగలింది. ‘పెన్ను పట్టుకోగలిగితే చాలు అనుకున్నాను’ అంటుంది మేరియా.

64 శాతం మార్కులతో పాసయ్యి...
మేరియా చక్రాల కుర్చీలో కూచునే క్లాసులకు అటెండ్‌ అయ్యి 64 శాతం మార్కులతో పాస్‌ అయ్యింది. ఇది  ఘన విజయం కింద లెక్క. ఇప్పుడు చదివిన కాలేజీలోనే హౌస్‌ సర్జన్‌ చేస్తోంది. ‘నాకు గొప్ప సర్జన్‌ కావాలని కోరిక ఉండేది. అయితే సర్జరీలు చేయాలంటే వేళ్ల కదలికల మీద మంచి పట్టు ఉండాలి. అది నాకు లేదు. అంతే! ఎం.డి చేద్దామనుకుంటున్నాను’ అంటుంది మేరియా. ఆమె మంచి బొమ్మలు వేస్తుంది. వాటిని కొనేవారు కూడా ఉన్నారు. ‘నాకు ఒక్కదాన్నే కొత్త ప్రదేశాలు తిరగాలని ఉంది. అయితే వీల్‌చైర్‌ ఫ్రెండ్లీగా మన ప్రదేశాలు ఉండవు’ అంటుందామె. కేరళ ఆర్‌టిసి వారిని బస్టాండ్‌లలో వీల్‌చైర్‌ ర్యాంప్‌ల ఏర్పాటు కోసం కోరింది మేరియా. ఆ సంస్థ అందుకు స్పందించింది. జీవాన్ని, ఆశను కాపాడుకోవడమే మనిషి పని అని మేరియా సందేశం.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement