మంగళ గౌరీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజ ఎలా చేయాలి? | Shravana Masam Worship Gowri Devi On Tuesdays | Sakshi
Sakshi News home page

Mangala Gowri Vratham :  శ్రావణ మంగళవారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? పెళ్లికాని అమ్మాయిలు చేయొచ్చా?

Published Tue, Aug 22 2023 10:29 AM | Last Updated on Tue, Aug 22 2023 12:16 PM

Shravana Masam Worship Gowri Devi On Tuesdays - Sakshi

శ్రావణ మాసమంటేనే ప్రత్యేకం. మహిళలు ఈ మాసం కోసం ఎదురుచూస్తారు. ఈసారి అధిక శ్రావణం రావడంతో ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్‌ పడింది. ఈ నెల 17వ తేదీ నుంచి నిజ శ్రావణమాసం ఆరంభం కావడంతో వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.

ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని అంతే భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయొచ్చు, నియమాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.


25న వరలక్ష్మీ వ్రతం

తెలుగు మాసాలన్నింటితో పోల్చితే ఈ మాసంలో పండగలు ఎక్కువగా వస్తాయి. జిల్లాలోని అమ్మవార్ల ఆలయాలు విశేష పూజలకు సిద్ధమవుతున్నాయి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ నెల 25న ఈ వ్రతం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 31న రాఖీ పౌర్ణమి. సోదరీ, సోదరుల అనుబంధానికి ఈ పండగ ప్రతీక. వరుణుడికి కొబ్బరి కాయలు సమర్పిస్తూ సముద్రంలోకి విసురుతారు. సెప్టెంబర్‌ 3న శ్రావణ బహుళ చవితి సందర్భంగా సంకష్ట హర చతుర్ధి వ్రతాలు ఆచరిస్తారు. ఈ రోజున గణపతి ఆలయాల్లో వినాయకుడికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. సెప్టెంబర్‌ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్‌ 14న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది.



పెళ్లికాని అమ్మాయిలు వ్రతం చేయొచ్చా?
శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేశాకా.. వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ ఇవ్వరంటా.. ఎందుకో ఇప్పుడు తెలుసకుందాం.నాలుగు మంగళవారాలు.. మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం.. కొత్తగా పెళ్లైయిన మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు.

భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు.వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, ఆ తర్వాత ఏడాది నుంచి అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా, దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు మాత్రమే కాదు, మంగళ గౌరి దేవిని పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చు. ఇలా చేస్తే మంచి వరుడు దొరుకుతాడని, వివాహం త్వరగా జరగాలని కోరుతూ వ్రతాన్ని ఆచరిస్తారు. 


శ్రావణ మంగళవారం 
వ్రతాన్ని ఆచరించే ముందురోజు కూడా నియమ నిబంధనలు పాటించాలి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి.పూజకు గరిక, తంగెడు పూలు కచ్చితంగా ఉపయోగించాలి. వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి కనీసం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని.. ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. వ్రతం పూర్తైన తర్వాత వినాయక చవితి తర్వాత, వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి. 

వ్యాపారుల్లో నూతనోత్సాహం
శ్రావణ మాసం ఆగమనంతో వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అన్ని వ్యాపారాలూ ఊపందుకుంటాయి. ఆషాఢ మాసం తరువాత అధిక శ్రావణ రావడంతో రెండు నెలలుగా వ్యాపారాలు నత్తనడకన సాగాయి. శుక్రవారం నుంచి వ్యాపారాలు జోరందుకుంటాయని వీరంతా ఆశలు పెట్టుకున్నారు. పూలు, పండ్లు, నిత్యావసరాల వినియోగం అధికంగా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజునే కాక ప్రతి శ్రావణ శుక్రవారంతో పాటు మంగళవారాల్లో కూడా మహిళలు ప్రత్యేక పూజలు ఆచరించడంతో ఆయా వస్తువులకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. వస్త్ర దుకాణాలు కళకళలాడతాయి. బంగారు వ్యాపారాలు సరేసరి. బంగారు రూపులు, ఇతర వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు. జిల్లాలోని కొన్ని బంగారు ఆభరణాల వ్యాపారులు పలు ఆఫర్లను ప్రకటించారు.

శుభప్రదమైన మాసం

శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసం. ఈ మాసంలో ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడం పుణ్యప్రదం. తమ కుటుంబాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తారు. దీని ద్వారా లక్ష్మీకటాక్షం, సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. వరలక్ష్మీ వ్రతాలు సామూహికంగా ఆచరించుకోవడం మరింత పుణ్యప్రదం.
– శ్రీమాన్‌ గురుగోవింద్‌ చిన్న వెంకన్నబాబు స్వామీజీ

శివకేశవులకు ప్రీతికరం
ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. మహావిష్ణువు, లక్ష్మీదేవీలకు ఈ మాసంలో వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రత్యేక అభిషేకాలు చేయడం ద్వారా పాపాలు కడతేరతాయని శాస్త్ర వచనం. శ్రావణ శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైనవి. ఈ మాసంలో పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల తగిన ప్రతిఫలం ఉంటుంది.
– టి. శ్రీమన్నారాయణాచార్యులు, గోవింద క్షేత్ర ప్రధాన అర్చకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement