Helping Hands: మానవసేవే మాధవ సేవ! | Sister duo in Bihar cook and deliver free food to covid patients | Sakshi
Sakshi News home page

Helping Hands: మానవసేవే మాధవ సేవ!

Apr 29 2021 1:05 AM | Updated on Apr 29 2021 6:00 PM

Sister duo in Bihar cook and deliver free food to covid patients - Sakshi

పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్‌ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్‌ పాజిటివ్‌ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు.

ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్‌’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్‌ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్‌ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్‌ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్‌ పాజిటివ్‌ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్‌  దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్‌ తల్లికి ఫుడ్‌ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్‌ ఫుడ్‌ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది.

ఇటీవలే కుందన్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్‌ లో ఉంచారు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్‌ వచ్చి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్‌ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్‌  దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్‌ చేసి నీలిమ సింగ్‌కు ఇస్తారు.

నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్‌ పేషంట్లకు ఫుడ్‌ ప్యాకెట్స్‌ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్‌ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్‌  దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్‌ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్‌ ప్యాకెట్స్‌ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్‌ అవుతూ ఫుడ్‌ ప్యాకెట్స్‌ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement