సాక్షి, సిటీబ్యూరో: బాలాపూర్ సమీపంలోని బడంగ్‌పేట్‌లో ఓ ఇంటి పెద్దకు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. ఇల్లు చిన్నది కావడంతో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కచోటే ఉన్నారు. వ్యాధి తీవ్రం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే అతని తల్లితో పాటు, భార్య, ఇద్దరు పిల్లలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. మొదట్లోనే అతన్ని ఏదైనా ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తే మిగతా వాళ్లకు వైరస్ ముప్పు తప్పేది. గ్రేటర్‌లో చాలా వరకు మహమ్మారి ఇదే విధంగా విస్తరిస్తోంది.
తగినన్ని సెంటర్లు లేకపోవడంతో..
గతేడాది కోవిడ్ బాధితులను కుటుంబ సభ్యుల నుంచి వేరు చేసి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో ఉద్ధృతి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. కానీ ఈసారి కోవిడ్ విజృంభణకు తగిన విధంగా ఐసోలేషన్ కేంద్రాలు లేకపోవడంతో వైరస్ బారిన పడిన వాళ్లంతా ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఇళ్లలో ప్రత్యేక గదులు ఉన్నవాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉండి స్వస్థత పొందుతున్నారు. రెండు గదుల ఇళ్లు, సింగిల్ బెడ్రూం ఇళ్లలో నివసించే కుటుంబాల్లో ఏ ఒక్కరికి వైరస్ సోకినా ఇంటిల్లిపాదికీ వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా పెరగడానికి తగినన్ని ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే కారణమని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు.
బస్తీల్లో మహమ్మారి..
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మురికివాడలు, బస్తీల్లో మహమ్మారి ఆక్టోపస్‌లా విస్తరిస్తోంది. బస్తీల్లో నివసించే పేద ప్రజలంతా చిన్న చిన్న ఇళ్లలో ఉండడం, కోవిడ్ సోకిన వారిని విడిగా ఉంచేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడమే కారణమని స్వచ్ఛంద సంస్థలు విశ్లేషిస్తున్నాయి. మలక్‌పేట్, చాదర్‌ఘాట్, నల్లకుంట, టోలిచౌకి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని వందలాది బస్తీల్లో జనం సరైన గాలి, వెలుతురు లేని ఇళ్లలో నివసిస్తున్నారు. ఇవే కోవిడ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. సుమారు 1,450కి పైగా బస్తీల్లో నివసిస్తున్న 60 శాతం ఇళ్లలో కోవిడ్ బాధితులు ఉన్నట్లు మానవ హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘వాళ్లంతా పేద ప్రజలు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకొని బతికేవాళ్లు. వైరస్ సోకితే ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో కూడా తెలియదు’ అని మానవ హక్కుల వేదిక ప్రతినిధి ఎస్.జీవన్‌కుమార్ విస్మయం వ్యక్తం చేశారు.
డిమాండ్ అనూహ్యం..
కోవిడ్ బాధితులకు ప్రత్యేక గదులు అందుబాటులో లేనప్పుడు వారిని వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో ఇంటిల్లిపాదికీ వైరస్ సోకకుండా చూడవచ్చు. ప్రస్తుతం రామంతాపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, బల్కంపేట్ నేచర్‌క్యూర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు నిండిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు రోజు రోజుకూ ఐసోలేషన్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.
స్థానికంగా ఉంటేనే మేలు...
ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల కోవిడ్ బాధితులు తమకు సమీపంలోని ఐసోలేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స పొందవచ్చు. అదే సమయంలో అతని నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధించినట్లవుతుంది. పైగా ఇంటికి కొద్ది దూరంలోనే ఐసోలేషన్ సదుపాయం ఉండడంతో ఎక్కడో దూరంగా ఉన్నామనే భయాందోళనలు ఉండవు.
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..
కోవిడ్ బాధితుల అవసరాలకు సరిపడా ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఉన్న స్కూళ్లు, హాస్టళ్లలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం చర్యలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా మహమ్మారి అంతంతకు విజృంభిస్తూనే ఉంటుంది.
– ఎస్.జీవన్‌కుమార్, హెచ్‌ఆర్‌ఎఫ్
సేవలు సులభతరం..
కోవిడ్ బాధితులకు ఆహారం, మందులు అందజేసేందుకు ఇంటింటికీ వెళ్లడం కష్టంగా ఉంది. ఎక్కడికక్కడ స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలు ఉంటే నేరుగా అక్కడికే వెళ్లి వాళ్లకు కావాల్సినవి అందజేయవచ్చు.
– ప్రశాంత్ మామిడాల, ఫీడ్ ద నీడ్
పర్యవేక్షణ బాగుంటుంది..
స్వచ్ఛంద సంస్థల సేవలతో పాటు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఒకేచోట ఎక్కువ మందిని పర్యవేక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పేషెంట్లు త్వరగా కోలుకొని ఇళ్లకు వెళ్లగలుగుతారు.
– వినయ్ వంగాల
హైదరాబాద్‌లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్ కేంద్రాలు
Published Sun, May 9 2021 8:18 AM | Last Updated on Sun, May 9 2021 9:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment