కొన్ని లైకులు... కాస్త వెలుతురు | Social Media Magic Of Baba ka Dhaba And Ranu Mondal | Sakshi
Sakshi News home page

కొన్ని లైకులు... కాస్త వెలుతురు

Published Mon, Nov 2 2020 3:40 AM | Last Updated on Mon, Nov 2 2020 7:56 AM

Social Media Magic Of Baba ka Dhaba And Ranu Mondal - Sakshi

‘బాబా కా ధాబా’లో వృద్ధ దంపతులు

గత మూడు వారాలుగా  ‘బాబా కా ధాబా’ వార్తల్లో ఉంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడిపే వృద్ధ జంట కరోనా వల్ల బేరాలు లేక కన్నీరు కార్చడం ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. అక్కడి నుంచి దేశమంతా  ఆ వృద్ధజంట పాపులర్‌ అయ్యారు. బాలీవుడ్‌ తారలు ‘బాబా కా ధాబా’  ఫోటోను ట్వీట్‌ చేశారు. జనం ఆ ధాబా దగ్గరకు పోటెత్తారు. 20 రోజుల తర్వాత  ధాబా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కాకపోతే రెండు రోజుల క్రితం ఆ జంటకు ఒక కంటి ఆస్పత్రి ఉచితంగా  కాటరాక్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. సోషల్‌ మీడియా వల్ల జరుగుతున్న మంచిని ఇటీవలి ఘటనలతో తెలిపే కథనం ఇది.

అక్టోబర్‌ మొదటి వారంలో సోషల్‌ మీడియా లో ఆ తర్వాత న్యూస్‌ పేపర్లలో ‘బాబా కా ధాబా’ అనే పేరు మార్మోగిపోయింది. ‘బాబా కా ధాబా’ అనేది దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఫుట్‌ మీద మీద ఉన్న చిన్న టిఫిన్‌ సెంటర్‌. దానిని నడుపుతున్నది 80 ఏళ్ల కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి. గత ముప్పై ఏళ్లుగా వాళ్లు ఆ ధాబా మీదనే జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ధాబా మూత పడింది. అన్‌లాక్‌ మొదలయ్యాక కూడా కరోనా భయంతో జనం ఆ ధాబాకు రావడం బాగా తగ్గించేశారు. తెల్లవారుజామునే లేచి ఆ వృద్ధ దంపతులు రోజూ రోటీ కూరలు చేసి హోటల్‌ లో కూచుంటే అరవై డెబ్బై రూపాయలకు కూడా బేరం జరగడం లేదు. ఇది వారికి ఎంతో వేదన కలిగించింది. ఇది గమనించిన గౌరవ్‌ వాసన్‌ అనే ఫుడ్‌ బ్లాగర్‌ వారితో చిన్నపాటి సంభాషణ రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

రాను మండల్‌, బేబి 
‘బేరం కాక చాలా ఇబ్బందులు పడుతున్నాం’ అని కన్నీరు కారుస్తున్న వృద్ధుడు కాంతాప్రసాద్‌ను, అతని నిస్సహాయ భార్యను చూసి జనం కదలిపోయారు. వెంటనే స్పందించారు. బాలీవుడ్‌ తారలు ఈ ధాబా గురించి ట్వీట్‌ చేసి ‘వెళ్లండి... వెళ్లి అక్కడ ఏదైనా తినండి’ అని కోరారు. అంతే... రెండు రోజుల్లో జనం అంతా అక్కడ పోటెత్తారు. ఆ జంటను ఉత్సాహపరచడానికి వారు అమ్మే మటర్‌ పనీర్, రైస్, రోటీ తిని వెళ్లారు. కాంతా ప్రసాద్‌ పేరున ఇచ్చిన విరాళాలు దాదాపు మూడున్నర లక్షలు ఆ వృద్ధ దంపతులకు చేరాయి. అంతే కాదు రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ‘షార్ప్‌సైట్‌ ఐ హాస్పిటల్‌’ ఆ వృద్ధ దంపతుల కళ్ల పరీక్ష జరిపి, ఇద్దరి కళ్లలోనూ కాటరాక్ట్‌ ఉన్నాయని నిర్థారించి ఉచితంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఇద్దరికీ చెరో కంటికి చేసి, వచ్చే వారం రెండో కంటికి చేయనున్నారు. మెరుగుపడిన చూపుతో ఆ జంట సంతోషంగా ఉంది.

వేగంగా స్పందన... వేగంగా మరుపు
సోషల్‌ మీడియాలో స్పందన ఎంత వేగంగా ఉంటుందో మరుపూ అంతే వేగంగా ఉంటుంది. ‘బాబా కా ధాబా’ గురించి వచ్చిన రెండు మూడు వారాలు జనం అక్కడకు వచ్చారు నిజమే కాని ఇప్పుడు మళ్లీ బేరాలు అతి మామూలు స్థితికి చేరాయి. రకరకాల సంస్థలు ఆ ముసలివారిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి. ఏ బ్లాగర్‌ అయితే వీడియో పోస్ట్‌ చేశాడో ఆ బ్లాగర్‌ వచ్చిన విరాళాలను పూర్తిగా వృద్ధులకు ఇచ్చాడా లేదా అనే సందేహాలు కూడా పుట్టాయి. అయినప్పటికీ ఏ కదలికా లేని చోట సోషల్‌ మీడియా ఏదో ఒక కదలిక తెచ్చి ఆ వృద్ధులకు ఏదో ఒక మేరకు మేలు చేసిందని అనుకోక తప్పదు.

కెమెరా అంచున ప్రతిభ
ఒకప్పుడు సామాన్యులు వెలుగులోకి రావాలంటే చాలా పెద్ద తతంగంగా ఉండేది. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా పట్టించుకుంటేనే వారు తెలిసేవారు. కాని ఇప్పుడు సోషల్‌ మీడియా వల్ల చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ కెమెరాతో ఎవరి ప్రతిభనైనా లోకానికి తెలిపే వీలు చిక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని రనఘాట్‌ రైల్వేస్టేషన్‌లో పాడుకుంటూ బిచ్చమెత్తుకునే రాను మండల్‌ గొంతులోని ప్రావీణ్యాన్ని గమనించిన ఒక వ్యక్తి ఆమె పాడిన ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై’ను రికార్డ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడితే దేశమంతా ఆమె పేరు మార్మోగిపోయింది. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. ఆమె జీవితం పూర్తిగా మెరుగుపడింది. రాజమండ్రికి చెందిన గృహిణి బేబి పాడిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ కూడా ఫేస్‌బుక్‌ ద్వారానే ప్రచారం పొంది ఆమె జీవితంలో మలుపును తెచ్చాయి. ‘పలాస’లో ఎస్‌.పి.బాలుతో పాడే స్థాయికి ఆమె గుర్తింపు పొందారు.

లాక్‌డౌన్‌లో సోషల్‌ మీడియా సేవ
ప్రచారం కోసం కొందరు పని చేయవచ్చు. కాని చాలా సందర్భాలలో సహజమైన మానవత్వంలో సోషల్‌ మీడియాలో సహాయం అవసరమైన వారి గురించిన విన్నపాలు కనిపించడం వాటికి వెంటనే స్పందన రావడం చూస్తున్నాం. మొన్నటి హైదరాబాద్‌ భారీ వర్షాలకు సోషల్‌ మీడియాలో పిలుపును అందుకుని కావలసిన చోట సహాయం అందించడానికి చాలా బృందాలు ముందుకు వచ్చాయి. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అయితే సోషల్‌ మీడియా చేసిన సేవ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హైదరాబాద్‌ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్న వేలాది మంది వలస కూలీలకు ఉప్పల్‌ చౌరాస్తాలో, కొంపల్లిలో, ఆర్మూరు దగ్గర దాదాపు నెల రోజుల పాటు క్యాంపులు నడిచాయి. సోషల్‌ మీడియాలో ఆ ఫోటోలు చూసి ఎందరో వేల రూపాయల విరాళం ఇచ్చి వలస కూలీల ప్రయాణం సాగడానికి సాయపడ్డారు. లక్షల ఖర్చుతో బస్సులు మాట్లాడి పంపేంతగా ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు ప్రభావితం చేశాయి.

బహుముఖ కార్యక్రమాలు
ఈ కరోనా కాలంలో సోషల్‌ మీడియా మాధ్యమాలు బహుముఖాలుగా ఉపయోగపడుతున్నాయి. అనేక లైవ్‌లు వీటి ద్వారానే నడుస్తున్నాయి. సాహిత్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, స్మృతి కార్యక్రమాలు సోషల్‌ మీడియా ద్వారానే ఇంట్లో కూచుని అందరూ చూస్తున్నారు. పాల్గొంటున్నారు. సామాజిక చైతన్యానికి, భిన్న అభిప్రాయాల ప్రకటనకు సోషల్‌ మీడియా ఒక వేదికగా మారుతోంది. తమిళనాడులో జరిగిన తండ్రీ కొడుకుల లాకప్‌ డెత్, ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హత్రాస్‌ అత్యాచార ఘటన సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా నిరసనను సంఘటితం చేయగలిగాయి. 
లైకులు కొన్నే కావచ్చు. జరుగుతున్న పని కొంతే కావచ్చు. కాని సోషల్‌ మీడియాను అర్థవంతంగా ఉపయోగించుకోవాలనుకునేవారు తెస్తున్న వెలుతురు ఇప్పటికిప్పుడు ఎంతో విలువైనదని చెప్పక తప్పదు.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement