‘సరిగా అర్థం చేసుకోవడం నుంచే ప్రతిభకు బీజాలు పడతాయి’ అంటారు. ‘నాకు అర్థం కాలేదు’ అన్నంత మాత్రాన ఆ స్టూడెంట్ తెలివి తక్కువ అని కాదు. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవడానికి, అవడానికి మధ్య ఏదో గ్యాప్ ఉండి ఉండవచ్చు. ఆ ఖాళీని పూరించగలిగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ‘స్టెమాన్‌స్టర్’ద్వారా నిరూపించింది బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ సోనాలి గుప్తా...
ఆరోజు స్కూలు నుంచి వచ్చిన శ్రిష్టి తల్లి సోనాలిని ఒక డౌట్ అడిగింది.‘లోహంతో తయారు చేసిన ఓడ నీటిలో ఎలా తేలుతుంది?’నాల్గవ తరగతి చదువుతున్న శ్రిష్టి ఇలాంటి సందేహాలెన్నో తల్లిని అడుగుతుంటుంది. అప్పటికప్పుడు జవాబు చెప్పి చిన్నారి సందేహాన్ని తీరుస్తుంటుంది సోనాలి. ఇంట్లో శ్రిష్టి కోసం ఒక ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను పరిశీలించడం ద్వారా శ్రిష్టిలో శాస్త్రీయ విషయాలపై ఆసక్తి పెంచాలనేది సోనాలి కోరిక. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన సోనాలికి కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అత్యంత సులువైన పని. మరి శాస్త్రీయ విషయాలపై అవగాహన లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి?
ఓడకు సంబంధించిన కుమార్తె సందేహాన్ని ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే చెప్పింది సోనాలి. తాను అలా చెప్పడం వల్ల శ్రిష్టికి సులభంగా అర్థమైంది. ఇదే విధానంలో ఇతర పిల్లలకు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన లాక్‌డౌన్ టైమ్‌లో పట్టాలకెక్కింది. ‘అది నా జీవితంలో చెప్పుకోదగిన ముఖ్య సందర్భం’ అంటుంది సోనాలి. ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే నినాదంతో పిల్లలకు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచడానికి హ్యాండ్స్–ఆన్ లెర్నింగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘స్టెమాన్‌స్టర్’కు శ్రీకారం చుట్టింది. రకరకాల సందేహాలను తీర్చేలా వాట్సాప్ వేదికగా ఎన్నో వీడియోలు చేసింది.
సంప్రదాయ బోధన ఎలా మెరుగుపడాలో చెబుతున్నట్లుగా ఉండేవి ఆ వీడియోలు. పరిచితులు, అపరిచితులు, మిత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ‘మీ వీడియోలు అంటే మా పిల్లలకు ఎంతో ఇష్టం’ అని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చెప్పినప్పుడల్లా సోనాలికి ఉత్సాహంగా ఉండేది. ‘చాలా స్కూళ్లలో సైన్స్ అనేది సూత్రాలు, నిర్వచనాల పరిధి దాటి బయటికి రాదు. నిర్వచనాలు నిర్వచనాలలాగే చెప్పడం వల్ల అందరు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్‌గా చెప్పాలి. ప్రపంచంలో గొప్ప ల్యాబ్స్ అని చెప్పుకోదగ్గ ఎన్నో ల్యాబ్స్‌లో పనిచేశాను.
ఎందరో పిల్లలు ఆ ల్యాబ్స్‌లో కనిపించేవారు. పిల్లలకు సైన్స్‌పై ఆసక్తి అక్కడినుంచే మొదలవుతుంది’ అంటుంది సోనాలి. ‘స్టెమాన్‌స్టర్’ ద్వారా సైన్స్, గణితానికి సంబంధించి జటిలమైన కాన్సెప్ట్‌ల గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి చెబుతున్నారు. ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించారు. ‘పిల్లలు నా నుంచి మాత్రమే కాదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు’ నవ్వుతూ అంటుంది సోనాలి.
అయిదవ తరగతి చదువుతున్న ఆర్యన్ కేజ్రీవాల్‌కు సౌరవ్యవస్థ అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘స్టెమాన్‌స్టర్’ ΄ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ‘నేను ఒరిగామి స్టార్స్ తయారు చేస్తాను. వాటి ద్వారా ఎన్నో సైన్స్ విషయాలు ఫ్రెండ్స్‌కు చెబుతుంటాను’ అంటాడు ఆర్యన్. ‘మా అబ్బాయిలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ వాడి ఫేవరెట్ సబ్జెక్ట్‌లు’ అంటుంది ఆనందంగా ఆర్యన్ తల్లి ఆంచల్. ప్రశ్న–జవాబుల నుంచి వర్క్‌షాప్‌ల వరకు ‘స్టెమాన్‌స్టర్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఆస్క్, డూ, లెర్న్, రిపీట్’ అంటూ పిల్లలకు దగ్గరవుతోంది స్టెమోన్‌స్టర్.
Comments
Please login to add a commentAdd a comment