భారతదేశంలో పదిహేను వసంతాలను పూర్తి చేసుకున్న యూట్యూబ్ (ఇండియా) పల్లె నుంచి మహా పట్నం వరకు యువతరంలో ఎంతోమందిని కంటెంట్ క్రియేటర్స్‌గా మార్చింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నాడిని తెలుసుకుంటూ, యూట్యూబ్ కొత్త టూల్స్‌ను అందిపుచ్చుకుంటూ తమ సృజనాత్మక శక్తులను బలోపేతం చేసుకుంటున్నారు యంగ్ క్రియేటర్‌లు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ యువత రంగుల కలలను సాకారం చేసే రంగస్థలం అయింది. ప్యారే దోస్తుగా మారింది...
‘మన దేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ పదిహేను సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో కనిపిస్తుంది’ అంటాడు యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ మాట ఎలా ఉన్నా యువతరం క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ ఎంతోమంది క్రియేటర్‌లను సృష్టించింది. కొత్త కెరీర్ దారులను పరిచయం చేసింది. చెన్నైకి చెందిన మలర్ సరదాగా యూట్యూబ్‌లో ఇంగ్లీష్–స్పీకింగ్ కోర్సు మొదలుపెట్టింది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో కూడా సక్సెస్ అయింది. తన యూట్యూబ్ కుకింగ్ చానల్‌తో సక్సెస్ అయిన పశ్చిమబెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన పుష్పరాణి సర్కార్ ‘ఈ చానల్ ద్వారా నలుగురికి నా పేరు తెలియడమే కాదు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది’ అంటుంది.
ఎబిన్ జోస్ పాపులర్ యూట్యూబ్ చానల్ ‘ఫుడ్ అండ్ ట్రావెల్’కు 7,00,000 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ‘అనుకరణతో ఫలితం ఉండదు. ఎవరి సక్సెస్ ఫార్ములాను వారు రూపొందించుకోవాల్సిందే’ అంటాడు జోస్. 2008లో మన దేశంలోకి యూ ట్యూబ్ లోకలైజ్‌డ్ వెర్షన్ అడుగు పెట్టింది. ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నో అవతారాలు ఎత్తింది. ఎన్నో ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఈ ట్రెండ్స్‌లో యువతరానిదే పై చేయిగా మారింది.యూట్యూబ్ ట్రెండ్స్–2023 రిపోర్ట్ ప్రకారం జెన్ జడ్‌లో 69 శాతం మంది ప్రేక్షకులు షార్ట్ ఫామ్, లాంగ్ ఫామ్, లైవ్‌స్ట్రీమ్... ఇలా ఏ ఫార్మట్‌లోనైనా తమ అభిమాన క్రియేటర్ కంటెంట్‌ను చూడడానికి ఇష్టపడుతున్నారు.
నిర్దిష్టమైన కంటెంట్, ఆర్టిస్ట్‌లు, పబ్లిక్ ఫిగర్స్‌కు సంబంధించి ఫ్యాన్స్ రూపొందించిన వీడియోలను చూడడానికి ఇష్టపడుతున్నట్లు జెన్ జడ్‌లో 48 శాతం మంది చెబుతున్నారు. పదిహేను సంవత్సరాల కాలంలో యూట్యూబ్ యూత్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మహానగరంలో ఉన్నా, మారుమూల పల్లెలో ఉన్నా ఒక చిన్న బ్రైట్ ఐడియాతో అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోయేలా ఈ వేదిక యూత్‌కు ఉపకరించింది. డ్యాన్స్ ట్యుటోరియల్స్ నుంచి హౌ–టు వీడియోల వరకు యువతరంలో ఎంతోమందిని ఫేమ్ చేసింది. యూ ట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (2011) లాంచ్‌తో ఎంతోమంది క్రియేటర్‌లకు ఒక వేదిక దొరికింది.
ఈ ఫస్ట్ వేవ్ క్రియేటర్‌లు తమ విజయాలతో ఎంతోమందిని ప్రభావితం చేశారు.మ్యూజిక్, సినిమాలు ఆరాధించే మన దేశంలో యూట్యూబ్ వేదికగా యువతరం చేతిలో కంటెంట్ క్రియేషన్ అనేది కొత్త పుంతలు తొక్కింది. కంటెంట్ క్రియేషన్‌కు సంబంధించి యూట్యూబ్ అడ్వాన్సింగ్ టూల్స్‌ను తీసుకువచ్చింది. ఫార్మట్‌లను విస్తరించింది. క్రియేటర్‌లు తమ వీడియోలను ఇతర భాషల్లోకి తీసుకువచ్చే ఏఐ పవర్డ్ డబ్బింగ్ టూల్‌ను తీసుకురానుంది.
భవిష్యత్‌లో ఈ టూల్ ద్వారా వాయిస్ ప్రిజర్వేషన్, లిప్ రీ–యానిమేషన్, ఎమోషన్ ట్రాన్స్‌ఫర్... మొదలైనవి చేయవచ్చు. ఫిల్మ్ స్టూడియోలు, మ్యూజిక్ కంపెనీలు కూడా యూట్యూబ్ చానల్స్‌ను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాయి. దీనిద్వారా యువతలో క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ‘యూట్యూబ్ తొలిసారిగా పరిచయం అయినప్పుడు అది టైమ్‌పాస్ మాత్రమే. అయితే మన టైమ్‌ను కూడా మార్చుకొని ఎదగవచ్చని ఎంతోమంది నిరూపించారు’ అంటుంది బెంగళూరుకు చెందిన ప్రజ్వల.
స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్స్
మన దేశంలోని మోస్ట్ పాపులర్ యూట్యూబ్ స్టార్‌ల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ‘ది యూట్యూబ్ స్టార్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు దిల్లీకి చెందిన అజితాభ బోస్. ఇది బోస్ నాన్–ఫిక్షన్ బుక్. ఈ పుస్తకంలో సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌ల స్ట్రగుల్‌ను కళ్లకు కట్టేలా రాశాడు. అశిష్, అమిత్ బదన, ప్రజక్త కోలి, కునాల్ చాబ్రియ, శృతి, అర్జున్ ఆనంద్‌లాంటి పదిహేను మంది యూట్యూబర్‌ల గురించి రాశారు. విజయం అనేది ఎంత కష్టపడితే వస్తుంది అనేది వీరి గురించి చదివితే బోధపడుతుంది. అహ్మదాబాద్‌కు చెందిన హర్ష్ పమ్నానీ వృత్తిపరంగా బ్రాండ్ ఎక్స్‌పర్ట్.
ప్రవృత్తి పరంగా స్టోరీటెల్లర్. ‘బూమింగ్ బ్రాండ్స్’ పేరుతో పుస్తకం రాసి పేరు తెచ్చుకున్న హర్ష్ ‘బూమింగ్ డిజిటల్ స్టార్స్’ పేరుతో సక్సెస్‌ఫుల్ యూ ట్యూబ్ స్టార్స్ గురించి మరో పుస్తకం రాశాడు. క్రియేటర్ ఎకనామీలో భాగం కావడానికి వారి పరిచయాలు పాఠాలుగా ఉపయోగపడతాయని అంటాడు రచయిత. కవితా సింగ్, ఉజ్వల్ చౌరాసియ, యశ్వంత్ ముఖ్తే... లాంటి పదకొండుమంది యూట్యూబ్ స్టార్‌ల గురించి ఈ పుస్తకంలో రాశాడు హర్ష్.
Comments
Please login to add a commentAdd a comment