ముప్పయ్యేళ్ల క్రితం సాహసం.. వెచ్చూరు ఆవుల పరిరక్షణ | Sosamma Iype: Revives Vechur Cattle Breed From Brink Of Extinction | Sakshi
Sakshi News home page

ముప్పయ్యేళ్ల క్రితం సాహసం.. వెచ్చూరు ఆవుల పరిరక్షణ

Published Tue, Mar 8 2022 8:12 PM | Last Updated on Tue, Mar 8 2022 8:17 PM

Sosamma Iype: Revives Vechur Cattle Breed From Brink Of Extinction - Sakshi

సోసమ్మ ఐపె.. ఈ మహిళా వెటర్నరీ ప్రొఫెసర్‌ ముప్పయ్యేళ్ల క్రితం సాహసంతో తన ఉద్యోగాన్నే దేశీ గోజాతి పరిరక్షణ ఉద్యమ కేంద్రంగా మార్చుకొని ఉండకపోతే.. ఇవ్వాళ అపురూపమైన వెచ్చూరు గోజాతి మనకు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయేది. అందుకే ఆమెను ‘వెచ్చూరమ్మ’ అని కేరళ రైతులు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన 80 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్‌ సోసమ్మ విశేష కృషి గురించి మహిళా దినోత్సవం సందర్భంగా ముచ్చటించుకుందాం..  

‘వెచ్చూరు’ అత్యంత అరుదైన పొట్టి దేశీయ గోజాతి. మన ‘పుంగనూరు’ కన్నా ఎత్తు తక్కువగా ఉండే ఆవులు ఇవి. కొట్టాయం జిల్లాలోని వెచ్చూరు గ్రామం ఈ జాతి పుట్టిల్లు. ‘1960లలో అధిక పాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం విదేశీ గోజాతులతో సంకరీకరణ  విధానాన్ని భారీఎత్తున అమలు చేయటం ప్రారంభించింది. 1980ల నాటికి వెచ్చూరు దేశీయ జాతి ఆవుల సంతతి దాదాపుగా అంతరించిపోయింది..’ అని డా. సోసమ్మ గుర్తుచేసుకున్నారు. 

అటువంటి దశలో కేరళ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్స్‌ యూనివర్సిటీలో బ్రీడింగ్‌ అండ్‌ జెనెటిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. సోసమ్మ దృష్టి వెచ్చూరు ఆవుల పరిరక్షణ వైపు మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైన పనిని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. ఆమె ప్రయత్నాలకు 15–20 మంది వెటర్నరీ విద్యార్థులు, వ్యక్తులు మద్దతుగా నిలిచారు. మొదటి పని.. నికార్సయిన వెచ్చూరు ఆవులు ఎక్కడైనా మిగిలి ఉన్నాయా అని కొట్టాయం తదితర దక్షిణ కేరళ జిల్లాల్లో 1989లో వెతకడం ప్రారంభించారు. సెలవు రోజుల్లో ఆమె, విద్యార్థులు బృందాలుగా విడిపోయి కాలికి బలపం కట్టుకొని తిరిగారు. సొంత ఖర్చులతో ఊళ్లమ్మట తిరుగుతూ రైతులను వాకబు చేసేవారు. విద్యార్థుల కుటుంబాలు కూడా ఇందులో భాగస్వాములు కావటం విశేషం. 

‘నా ఉద్యోగ జీవితంలోనే అవి అత్యుత్తమ ఘడియలు. మేం అంతా ఆ ప్రయాణంలో సంతోషదాయకంగా నిమగ్నమయ్యాం..’ అన్నారామె.  ఒక్కోసారి చాలా రోజులు తిరిగినా ఒక్క వెచ్చూరు ఆవు జాడ కూడా దొరికేది కాదు. ఎట్టకేలకు మనోహరన్‌ అనే రైతు దగ్గర మొదటి ఆవును గుర్తించాం. ఆయన ఆవును మాకు అమ్మటానికి మొదట అంగీకరించలేదు. పరిశోధన చేసి జాతిని బతికిస్తాం అని నచ్చజెప్పిన తర్వాత అంగీకరించారు. మా అందరికీ పట్టలేని సంతోషం కలిగిన రోజు అది. ఒక ఏడాదిలో 24 నికార్సయిన 24 వెచ్చూరు ఆవులను సేకరించగలిగాం. మరింత సంతోషం ఏమిటంటే.. వీటి కొనుగోలుకు, పోషణకు యూనివర్సిటీ నుంచి రూ. 65 వేల గ్రాంటు అందటం. మన్నుతిలోని వెటర్నరీ యూనివర్సిటీ క్షేత్రంలోనే ఆవులను ఉంచి పోషించటం ప్రారంభించారు. 

అయితే, ఆ తర్వాత పనులూ సులువుగా ఏమీ జరగలేదు. ‘మేం చేస్తున్న పని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైనది. మా పనిని యూనివర్సిటీలో కొందరు వ్యతిరేకించేవారు కూడా. అయితే, ఈ లోగా వెచ్చూరు దేశీ గోజాతి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తింపు వచ్చింది’ అన్నారామె. సంవత్సరం గడిచేలోగానే పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల అనేక ఆవులు చనిపోయాయి. అందుకు పాల్పడింది ఎవరో తెలీదు. దర్యాప్తు కొనసాగింది. ‘నా జీవితంలో అతి కష్టమైన రోజులవి.. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా సరే.. లక్ష్యసాధనకు మా పోరాటాన్ని మాత్రం ఆపలేద’న్నారు డా. సోసమ్మ.   

1998లో స్కాట్లండ్‌కు చెందిన రోస్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెచ్చూర్‌ గోజాతి డిఎన్‌ఎపై పేటెంట్‌ పొందటం పరిశోధనారంగంలో సంచలనం కలిగించింది. ‘వెచ్చూరు జాతి పరిరక్షణకు మేం చేస్తున్న కృషికి చాలా ప్రతిఘటన ఎదురైన రోజులవి. రెండేళ్ల దర్యాప్తు తర్వాత.. వారిది తప్పుడు పని అని తేలిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాం’ అన్నారు డా. సోసమ్మ. వెచ్చూరు జాతి పరిరక్షణ కృషిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి అని భావించి వెచ్చూరు కన్సర్వేషన్‌ ట్రస్టును 1998లో రిజిస్టర్‌ చేయించారు. ట్రస్టు తరఫున మేలైన వెచ్చూరు ఆబోతుల వీర్యాన్ని సేకరించి రైతులకు అందించడం ప్రారంభించారు. వెచ్చూరుతోపాటు కాసర్‌గోడ్‌ గోజాతుల చిల్డ్‌/ఫ్రోజెన్‌ వీర్యాన్ని రైతులకు 2008 నుంచి ఈ ట్రస్టు అందిస్తోంది. 

మరోవైపు యూనివర్సిటీ తరఫున బయోడైవర్సిటీ బోర్డు, నాబార్డులతో కలసి వెచ్చూరు జాతిపై పరిశోధనా ప్రాజెక్టులు చేశారు. ఎఫ్‌.ఎ.ఓ., యు.ఎన్‌.డి.పి.ల నుంచి డా. సోసమ్మకు ప్రశంసలు, అవార్డులు సైతం లభించాయి. ఇప్పుడు కేరళ తదితర రాష్ట్రాల్లో 5 వేలకు పైగా వెచ్చూరు జాతి పశువులు ఉన్నాయని డా. సోసమ్మ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చెప్పారు. 
facebook.com/vechur
– పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి 

2 అడుగులు.. 3 లీటర్లు..
వెచ్చూరు ఆవు సగటు ఎత్తు 90 సెంటీమీటర్లు (3 అడుగులు). అయితే, 61.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన వెచ్చూరు ఆవు గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. కేరళకు చెందిన రైతు, పర్యావరణవేత్త బాలకృష్ణన్‌ నంబుకుడి కుటుంబంలో భాగంగా మారిపోయిన ఈ ఆవు పేరు ‘మాణిక్యం’. తమ కుటుంబానికి దైవమిచ్చిన కానుక మాణిక్యం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. వెచ్చూరు ఆవు తక్కువ మేత తింటుంది. సగటున 3 లీటర్ల పాలు ఇస్తుంది. పెరట్లోనూ పెంచుకోవచ్చు. నిర్వహణ సులభం. దీని పాలు ఔషధ విలువలతో కూడి ఉంటాయని చెబుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement