ఒక సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పించినప్పుడు దేశం అతడిని గౌరవిస్తుంది. ప్రజలు అతని జ్ఞాపకార్థం కొవ్వొత్తులను వెలిగించి, సంతాపం తెలియజేస్తారు. అంతటి వారి బాధ్యత తీరిపోతుంది. కానీ, యుద్ధ విషాదాన్ని ఆ సైనికుడి కుటుంబం జీవితాంతం భరిస్తుంది. తను భర్తను కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోయి అమరవీరుల భార్యల కష్టాన్ని తొలగించడానికి సిద్ధపడింది సుభాషిణి వసంత్. అమరవీరుల భార్యలతో ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా నిధులు సేకరించడానికి సుభాషిణి వసంత్ బెంగళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీకి వెళ్లింది. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూపులోని ఒక అధికారి మాట్లాడుతూ ‘మమ్మల్ని బీరు వడ్డించమంటారా?!’ అని అడిగారు.
ఆ మాటతో ఆమె అక్కడనుంచి నిశ్శబ్దంగా బయటకు వచ్చేసింది. దక్షిణ భారతదేశంలో అమరవీరుల భార్యల పట్ల అవగాహన ఎంత తక్కువగా ఉందో ఆమె ఆలోచించింది. తమ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల భార్యలు పొందవలసిన గౌరవం ఎక్కడా లభించదని అర్ధమైంది. దీంతో సుభాషిని అమరవీరుల వితంతువుల కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే ‘ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ను ప్రారంభించింది. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జవాన్ల వితంతువులకు సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పడింది. 31 జూలై 2007 న జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు సుభాషిని భర్త కల్నల్ వసంత వేణుగోపాల్ అమరుడయ్యాడు. భర్త మరణించిన మూడు నెలల తరువాత అమరవీరుల వితంతువుల జీవితాలకు కొత్త మార్గాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా సుభాషిని ‘వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్’ కు పునాది వేసింది.
నిధుల కోసం నాటక ప్రదర్శన
ఫౌండేషన్ ఏర్పాటుకు డబ్బు సేకరణ ఎలా చేయాలో మొదట అర్థం కాలేదు సుభాషికి. కొన్ని రోజుల మధనం తర్వాత ‘ది సైలెంట్ ఫ్రంట్’ అనే నాటకాన్ని రాసి ఢిల్లీ, బెంగళూరులో ప్రదర్శించింది. ఆ ప్రదర్శనకు వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కి కేటాయించింది. కళలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తూ అమరవీరుల వితంతువులకు సుభాషిణి ఆశాకిరణంగా మారింది. అమర వీరుల భార్యలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, వారు తమను తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించింది. అందుకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ సంస్థ సభ్యులు మహిళలకు సహాయం చేస్తుంటారు.
సైనికులకు నివాళిగా!
బెంగళూరులో క్లాసికల్ డాన్సర్‌గా సుభాషినికి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వసంత వేణుగోపాల్‌తో పెళ్లయ్యాక 15 సంవత్సరాలలో ఎక్కువ భాగం సదాశివ్‌నగర్‌లో గడిపింది. ఆర్మీలో కీలకమైన పోస్టు కావడంతో దాదాపు ఏడేళ్లు భర్త నుంచి దూరంగానే ఉంది. ఈ సమయంలో తన కుటుంబాన్ని కలుసుకోవడం కూడా కష్టంగానే ఉండేది. అలాంటి పరిస్థితిలో కర్ణాటకలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన 30 ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలను కలిసింది సుభాషిని.. ‘అమర జవాన్ల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి భార్యలకు సహకారం అవసరమని గ్రహించాను. అప్పుడే సైనికులకు నివాళిగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాను.
సైనికుల భార్యలకు న్యాయ, ఆర్థిక సహాయం అందాలన్నదే నా ఆశయం. ఆ తర్వాత పెగసాస్ ఇనిస్టిట్యూట్ తో కలిసి బెంగళూరు శివార్లలో మూడు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో ఆర్థిక, న్యాయ, మానసిక సలహాలు అందేలా ప్రణాళికలు రూపొందించాను’ అని తెలిపిన సుభాషిణి కృషికి 2016లో ‘నీరజ్ భనోట్’ అవార్డు లభించింది సాధారణ మహిళల మాదిరిగానే జవాన్ల భార్యలూ భర్తతో కలిసి ఇంట్లో అన్ని బాధ్యతలను నెరవేరుస్తారు. ఆ ఇంటి జీవితమే వారి ప్రపంచం. అటువంటి పరిస్థితిలో భర్త అమరవీరుడయ్యాక ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో శూన్యత ఏర్పడుతుంది. ఆ శూన్యతను పూరించడమే నా ప్రయత్నం’ అంటూ తన కార్యాకలాపాలను యధావిధిగా నిర్వరిస్తున్నారు సుభాషిణి వసంత్.
Comments
Please login to add a commentAdd a comment