యుద్ధంలోకి యువతుల్ని రానిచ్చే దేశాలు తక్కువ. భయం! శత్రువుకు చేతికి చిక్కితే.. ఏమైనా ఉందా! నిజానికి... అంతకన్నా పెద్ద యుద్ధాలే చేస్తున్నారు అమ్మాయిలు. జర్నలిస్టులుగా.. ఎయిడ్స్ వర్కర్‌లుగా.. తమది కాని భూభాగాల్లోకి నిర్భయంగా వెళుతున్నారు. అలా ఇటలీ నుంచి Ðð ళ్లిన సహాయ కార్యకర్త సిల్వియా. పద్దెనిమిది నెలల క్రితం కెన్యాలో కిడ్నాప్ అయింది. తిరిగి ఆదివారం ఇటలీ చేరుకుంది!! శత్రువుకు ఇన్నాళ్లూ బందీగా ఉన్న భయం లేదు ఆమె కళ్లలో. విముక్తి ఆమెను మళ్లీ ‘యుద్ధానికి’ తొందరపెడుతోంది!
దేశాల మధ్య యుద్ధంలో ఎవరి సరిహద్దుల లోపల వాళ్లుండి ఆయుధాలు విసురుకుంటారు. అంతకంటే పెద్ద యుద్ధం.. భూభాగం దాటి వెళ్లి అవతలి వైపు పోరాడటం! అలాంటి యుద్ధాలనే ఎంతోకాలంగా యువతులు చేస్తున్నారు! ఉగ్రవాదుల దాడుల్లో గూడు కోల్పోయి, అయినవాళ్లను పోగొట్టుకుని, అత్యాచారాలకు, హింసకు గురవుతూ, ఆకలితో, అనారోగ్యాలతో బతుకులు ఈడుస్తున్న మహిళల్ని, పిల్లల్ని అక్కున చేర్చుకుని అండగా ఉండేందుకు ఎయిడ్స్ వర్కర్‌లుగా.. ఆ కల్లోల ప్రాంతాల వాస్తవ స్థితి గతుల్ని ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులుగా.. ఎంతో మంది మహిళలు దేశం దాటి వెళుతున్నారు. ఉగ్రవాదులకు బందీలుగా చిక్కి ప్రాణాలనూ కోల్పోతున్నారు. అయినప్పటికీ మానవత్వాన్ని నిలిపే అలాంటి ‘యుద్ధాలకు’ యువతులు వెనుకంజ వెయ్యడం లేదు.
సిల్వియా రొమానో (25) సహాయ కార్యకర్త. ఇటలీలోని ‘ఆఫ్రికా మీలా’ అనే సంస్థలో పని చేస్తోంది. మిలాన్‌లో చదువై పోగానే ఉద్యోగానికి వెళ్లకుండా ధార్మిక సేవా కార్యక్రమాల వైపు వచ్చింది. తూర్పు ఆఫ్రికాలో తీవ్రవాద దాడుల బాధితుల సహాయక చర్యల కోసం 2018 నవంబరులో ఒక బృందాన్ని పంపింది ఆఫ్రికా మీలా. ఆ బృందంలో సిల్వియా ఉంది. ఆగ్నేయ ఆఫ్రికాలోని కెన్యాలో సహాయక కార్యక్రమాలలో ఉండగా సాయుధులైన కొందరు వ్యక్తులు సిల్వియాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మేము కిడ్నాప్ చేశాం అని కెన్యాలోని ఏ తీవ్రవాద సంస్థా ఏడాది వరకు ప్రకటించలేదు. ఇటలీ ఇంటిలిజెన్స్.. కెన్యా ప్రభుత్వంతో కలిసి సిల్వియా కోసం గాలిస్తూనే ఉంది. ఆచూకీ లేదు.
సిల్వియాను చంపేసి ఉంటారనే రెండు దేశాలూ అనుకుంటుండగా.. సోమాలియా రాజధాని మొగదిషుకు ముప్పై కి.మీ. దూరంలోని ఒక ప్రాంతంలో సిల్వియా లాంటి అమ్మాయి ఉన్నట్లు కొద్దినెలల క్రితం సోమాలియాలోని కెన్యా నిఘా వర్గాల ద్వారా ఇటలీ ప్రభుత్వానికి తెలిసింది! సిల్వియాలాంటి అమ్మాయి కాదు, సిల్వియానే అని ఇటలీ గుర్తించింది. విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. కెన్యా, సోమాలియా, ఇటలీ మూడు దేశాలు సిల్వియాను కోసం రహస్యంగా పనిచేశాయి. మూడు దేశాల్లోని రక్షణ, విదేశాంగ, న్యాయశాఖలు కలిసి సమాలోచనలు చేశాయి. టర్కీ నేషనల్ ఇంటిలిజెన్ కూడా సహాయం చేసింది. ‘ఆ అమ్మాయి మాకు ముఖ్యం’ అని ముందే ఇటలీ అధ్యక్షుడు, ప్రధాని మిగతా రెండు దేశాల వారికి స్పష్టంగా చెప్పారు. తీవ్రవాదుల నుంచి విడిపించే ప్రయత్నంలో సిల్వియాకు ఆపద కలగకూడదని దానర్థం.
ఈ ఆదివారం ప్రత్యేక విమానంలో రోమ్‌లోని చాంపీనో విమానాశ్రయంలో దిగింది సిల్వియా. ఆమె పక్కన మాస్కులు ధరించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు. సిల్వియా విమానం మెట్లు దిగుతూనే తన ముఖానికి ఉన్న మాస్క్ తీసి సంతోషంగా గాలిలో చేతులు ఊపింది. ఇటలీ అధ్యక్షుడు, ప్రధాని ఆమెకు స్వాగతం పలికారు. మిలాన్ దగ్గరి సిల్వియా సొంతూరులో ఆమె కోసం చర్చి గంటలు మోగాయి. ‘‘ఆనందంతో చచ్చిపోయేలా ఉన్నాను’’ సిల్వియా తండ్రి కూతుర్ని చూడగానే పెద్దగా అరిచేశాడు. కూతుర్ని గట్టిగా కావలించుకుంది ఆమె తల్లి. సిల్వియా పద్దెనిమిది నెలల అనుభవాల కోసం మీడియా ఇప్పుడు ఎదురుచూస్తోంది. అంతకన్నా ముందు సిల్వియా తరఫున ఆమె పని చేస్తున్న ‘ఆఫ్రికా మీలా’ సంస్థ సిల్వియాను అపహరించిన అనుమానిత సోమాలియా తీవ్రవాద సంస్థ అల్–షబాబ్‌పై న్యాయపోరాటం మొదలుపెట్టబోతోంది. ‘‘మానసింగా, శారీరకంగా నేను నా విధులకు పునరంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటోంది సిల్వియా!
కైలా మ్యూలర్
సిల్వియాలానే కిడ్నాప్ అయిన మానవ హక్కుల కార్యకర్త కైలా మ్యూలర్. అరిజోనాలోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సిరియాలో పనిచేస్తోంది. 2013లో సిరియాలోని అలెప్పోలో ‘డాక్టర్స్ వితౌట్ బార్డర్స్’ ఆసుపత్రి నుంచి బయటికి వస్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు కైలాను బందీగా పట్టుకున్నారు. తర్వాత ఆమె ఏమైందో తెలియదు. కైలా చనిపోయినట్లుగా 2015లో ఆమె తల్లిదండ్రులకు కొన్ని ఫొటోలు మెయిల్ అయ్యాయి. వాటిల్లో కైలాను చిత్రహింసలు పెట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ‘ఐసిల్’ నాయకుడు అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికాపై కక్షతో అమెరికా యువతి అయిన కైలాను రెండేళ్ల పాటు హింసించి, పలుమార్లు అత్యాచారం చేసి చంపినట్లు ఆ తర్వాత నిర్థారణ అయింది. 2019 అక్టోబర్‌లో అమెరికా దళాలు అల్ బగ్దాదీని ఆత్మహత్యకు ప్రేరేపించి అంతమొందించాయి. ‘ఆపరేషన్ కైలా మ్యూలర్’ పేరిట అమెరికా అతడిని వేటాడి ఆమెను గౌరవించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment