వాళ్లందరికీ సరిపోయే ఒకే పేరు.. స్ఫూర్తి | Special Story About Lady IAS Officers From Last Five Years | Sakshi
Sakshi News home page

ఒకే పేరు స్ఫూర్తి

Published Fri, Aug 7 2020 12:01 AM | Last Updated on Fri, Aug 7 2020 4:53 AM

Special Story About Lady IAS Officers From Last Five Years - Sakshi

ప్రిపరేషన్‌ ఎంత కష్టం! టాపర్‌లను అడగాలి. టాపర్‌లు కాని వాళ్లనూ అడగొచ్చు. ‘సివిల్స్‌’ కష్టం అందరికీ ఒకటే. మహిళల కష్టం మాత్రం.. అందరిలో కలిపేది కాదు! గత ఐదేళ్ల విజేతలు ఈ అమ్మాయిలు. అననుకూలతల్ని దాటి టాపర్‌లుగా నిలిచినవాళ్లు! వీళ్లందరికీ సరిపోయే ఒకే పేరు.. స్ఫూర్తి

మహనీయుల జీవిత కథల తర్వాత మళ్లీ అంతటి ఆసక్తిని రేకెత్తించేవి.. సివిల్‌ సర్వీసు టాపర్‌లు ‘ప్రిపరేషన్‌’కు పడిన కష్టాలే. టాపర్‌గా నిలిచిన వారు మస్తిష్కంలో ఎంత చిక్కి శల్యం అయి ఉంటారో.. అసలంటూ పరీక్షకు హాజరైనవారు కూడా అంతే! ఇద్దరి శ్రమా ఒక్కటే. కోల్పోయిన నిద్ర జాములూ ఒకటే. ర్యాంకు మాట ఎలా ఉన్నా.. ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ర్యాంకరే. అందుకే సివిల్స్‌లో విజేతలు, పరాజితులు ఉండరు. విజేతలు, విజయం కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించేవారు మాత్రమే ఉంటారు. అయితే ఒక మహిళ టాపర్‌ అవడాన్ని మాత్రం మరింత గొప్పగా చూడాలి. పోటీలో ఆమె వేసే ప్రతి అడుగును ఒక టాప్‌ ర్యాంకుగానే పరిగణించాలి.

సివిల్స్‌లో ర్యాంకు కోసం స్త్రీ పురుషులు చేసే ప్రయత్నం ఒకేలా ఉండొచ్చు. అయితే అందరూ సమానంగా రాసే ఆ అసలు పరీక్షకు ముందు.. మహిళ అనేక పరీక్షల్లో నెగ్గుకుంటూ అక్కడి వరకు చేరుకోవాలి. అననుకూలతల ‘ప్రీ–ఎగ్జామ్స్‌’ అవి! ఈ ఏడాది యు.పి.ఎస్‌.సి. సివిల్స్‌ పరీక్షా ఫలితాలలో ప్రతిభావర్మ మహిళల్లో టాపర్‌గా నిలిచారు. తర్వాతి స్థానాలు విశాఖ యాదవ్, సంజితా మల్హోత్రాలవి. 3, 6,10 ర్యాంకులు. ప్రతిభ ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి.  2018 సివిల్స్‌లో 489 ఆలిండియా ర్యాంకు వచ్చినప్పటికీ, మళ్లీ రాసి, మెరుగైన ర్యాంక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం తను ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌. పోస్టింగ్‌ రాగానే ఐఎస్‌ ఆఫీసర్‌. అనారోగ్యం ఆమె అననుకూలత. లేకుంటే ర్యాంక్‌ వన్‌ తనదే అయివుండేదని అంటోంది.
ఆరోర్యాంకు సాధించిన విశాఖ యాదవ్‌ ఢిల్లీ అమ్మాయి. విశాఖకు ఇది మూడో యత్నం. ఉదయం, సాయంత్రం లైబ్రరీకి వెళ్లి నోట్స్‌ రాసుకునేది. ఇంటికొచ్చి తెల్లారేవరకు చదువుకునేది. విశాఖ బి.టెక్‌ గ్రాడ్యుయేట్‌. రెండున్నరేళ్లు బెంగళూరులో జాబ్‌ చేసింది. జాబ్‌లో ఉంటే ప్రిపరేషన్‌ కష్టం అని మొదటి రెండు ప్రయత్నాల్లో అర్థమైంది. సెలవు పెట్టి ఢిల్లీ వచ్చేసింది. విశాఖ అననుకూలత.. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్‌ అవవలసి రావడం. ఇక పదో ర్యాంకు సాధించిన సంజితా మహాపాత్ర ఒడిశా అమ్మాయి. తండ్రి రిటైర్డ్‌ ఉద్యోగి. తల్లి గృహిణి. సంజిత చెల్లెలు బెంగళూరులో చేస్తోంది. ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్లి లాక్‌డౌన్‌ వల్ల గత మార్చి నుంచి తండ్రి అక్కడే ఉండిపోయాడు. తల్లి రూర్కెలాలో ఉంటోంది. సంజిత భర్తతో ముంబైలో ఉంటోంది. ఆమె అననుకూలత.. కుటుంబ సభ్యులంతా ఒకేచోట లేకపోవడం, వివాహం, సివిల్స్‌ ప్రిపరేషన్‌ ముందు వరకు రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం.
గత ఏడాది సెప్టెంబరులో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఇంటర్వూ్యలు జరుగుతూ వచ్చాయి. అంతిమ ఫలితాలే మొన్న వచ్చినవి. మొత్తం 829 మంది ఎంపిక అయ్యారు. వీరిలో మహిళలు 197 మంది. అంటే తక్కువేం కాదు. ఏటా సివిల్స్‌కి లక్షలాది మందితో పోటీ పడుతున్న మహిళల్లో పెళ్లయినవారు, బిడ్డ తల్లులు కూడా ఉంటున్నారు. అలాంటి వారిలో ఒక్కరు సివిల్స్‌లో గెలిచినా ఆ ఘనత ముందు సంఖ్యలు, నిష్పత్తులు, శాతాలు ఏమాత్రం సరిపోలనివి. 2017–18లో మహిళల్లో టాపర్‌ అయిన అనూ కుమారి సివిల్స్‌ రాసేటప్పటికే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమెది హర్యానా. రెండో ప్రయత్నంలో ర్యాంక్‌ సాధించింది. ప్రిపరేషన్‌పై ధ్యాస పెట్టేందుకు కొడుకును తల్లి దగ్గర వదిలేసి, కొన్ని నెలలపాటు మారు మూల గ్రామంలోని తన పిన్ని ఇంటికి వెళ్లిపోయిందామె! 

గత ఏడాది (2018–19) తొలి ప్రయత్నంలోనే మహిళల్లో టాపర్‌గా, ఆలిండియాలో ఐదో ర్యాంకర్‌గా నిలిచిన శృతి జయంత్‌ దేశ్‌ముఖ్‌.. ప్రిపరేషన్‌ స్ట్రెస్‌ తగ్గించుకోడానికి యోగాను ఆశ్రయించింది. 2016–17లో కర్ణాటక నుంచి జనరల్‌ కేటగిరీలోనే టాపర్‌ అయిన కె.ఆర్‌. నందిని.. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్ని కొన్నాళ్లపాటు బలవంతంగా మైండ్‌లోంచి తీసి పక్కనపెట్టవలసి వచ్చింది. అదే ఏడాది వైశాలీ శర్మ అనే యూపీ అమ్మాయి ఫిజికల్‌ డిజేబిలిటీ ఉన్నప్పటికీ ఆ కేటగిరీలో టాపర్‌ గా వచ్చింది. ఇక 2015–16 బ్యాచ్‌ టాపర్‌ టీనా దాబీని..  తల్లిదండ్రులు ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు అవడం వల్లే ఆమెకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి అనే ట్రోలింగ్‌ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
2014–15 టాపర్‌ ఇరా సింఘాల్‌.. మీరట్‌ అమ్మాయి. అంగవైకల్యం బాధిస్తున్నా జనరల్‌ కేటగిరీలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. మూడుసార్లు ప్రయత్నిస్తే నాలుగోసారి సక్సెస్‌ అయింది. ఏ వైకల్యమూ, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ కుటుంబ బాధ్యతలూ, ఇతరత్రా ఏ అననుకూలతలు లేకున్నా.. ఊరి నుంచి నగరానికి వచ్చి పరీక్షలకు సిద్ధం అయేందుకు అవసరమైన ఒక చోటు (అకామడేషన్‌) దొరకడం ఏ యువతికైనా తప్పని మొదటి సమస్య. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వూ్య పాస్‌ అయితే పోస్టింగ్‌ వచ్చేస్తుంది. అమ్మాయిలు మాత్రం ప్రిలిమ్స్‌ కన్నా ముందు ఒకటి పాస్‌ కావాలి. సురక్షితంగా కోచింగ్‌కి వెళ్లి రావడానికి భద్రమైన చోటును మహా నగరాలలో దొరికించుకోవడం అనే పరీక్ష.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement