వెనుక చాలా మాటలు. రిజర్వేషన్ క్యాండిడేట్. భర్తదీ సేమ్ కేటగిరీ..! చూసి ప్లాన్ చేసుకుంది. సొంత ప్రతిభేమీ కాదు. అంతా పేరెంట్స్ పలుకుబడి. ఇప్పుడు ‘బ్రిక్స్’ చాన్స్. అదీ అంతే.. సిఫారసు. ఒక మాట కాదు!! అన్నీ వింటూ హాయిగా నవ్వడమూ.. మాటలు కాదు!
భారత ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ అవడం టీనా దాబీ కల. ఆ కల అటుండగనే అంతకంటే పెద్ద కల ఆమెను కనింది! టీనాను ‘బ్రిక్స్’ గౌరవ సలహాదారుగా బ్రిటన్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలను తిప్పుకు రావడానికి ఆ రెక్కల గుర్రం ఇంటి బయట సిద్ధంగా ఉంది! ఇండియా సహా బ్రిక్స్‌లోని ఐదు దేశాలు ఇవి. టీనా ప్రస్తుతం రాజస్థాన్‌లోని భిల్వారాలో సబ్–డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమె రాజస్థాన్ నుంచి కదిలేదేమీ ఉండదు. బ్రిక్స్ స్టీరింగ్ కమిటీకి సలహాలు అవసరమైనప్పుడు ఈ ఐఎఎస్ ఆఫీసర్‌కు కాల్ చేస్తోంది. వెబ్ మీటింగ్‌లకు ఆహ్వానిస్తుంది.
ఆ కమిటీలో ఒక్కగానొక్క ఐఏఎస్ ఆఫీసర్ టీనా. ఇరవై ఏడేళ్ల అమ్మాయి. అవును. అమ్మాయిలానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ. ఎప్పుడూ హుషారుగా డ్యూటీ చేస్తూ! వినే ఉంటారు.. భిల్వారాలోకి కరోనా చొరబడకుండా టీనా సరిహద్దుల్లో గట్టి బందోబస్తు పెట్టించిందని. రెండు నెలల క్రితమే ఆమె పేరు భిల్వారా నుంచి గట్టిగా దేశానికి వినిపించడం. టీనా దాబి! ఎక్కడో విన్నట్లుందే అనుకున్నారు. ఐదేళ్ల క్రితం కేవలం ఇరవై రెండేళ్ల వయసులో యు.పి.ఎస్.సి.ని ‘క్రాక్’ చేసి ఫస్ట్ ర్యాంక్‌తో దేశానికి తన విజయధ్వానాన్ని ప్రతిధ్వనింపజేసింది ఈ అమ్మాయే.
బ్రిక్స్ కమిటీ గౌరవ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా. బ్రిక్స్‌కి సలహా ఇవ్వడం అంటే జైర్ బొల్సనారోకి, వ్లాదిమర్ పుతిన్‌కి, నరేంద్ర మోదీకి, షి జిన్‌పింగ్‌కి, సిరిల్ రమాఫోసాకు సలహా ఇవ్వడమే. ఐదు దేశాల వాణిజ్యం, పరిశ్రమలు, రాజకీయాలు, సహకారం.. వీటి మీద కమిటీని టీనా తన సూచనలతో నడిపించాలి. కరోనా లేకుండా ఉంటే టీనా ఈరోజు (జూలై 23) రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉండేవారు. ఏటా ఒక్కో ‘బ్రిక్స్’ దేశంలో సదస్సు జరుగుతుంది. ఈ ఏడాది రష్యా అనుకున్నారు. అది రద్దయింది.
టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బి.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. అక్కడా టాపరే. ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే ఐ.ఎ.ఎస్.కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు తొమ్మిది నుంచి పన్నెండు గంటల ప్రిపరేషన్! డిగ్రీ అయిన రెండేళ్లకే సర్వీస్ కమిషన్ పాస్ అయ్యారు. ట్రయినింగ్ ముస్సోరీలో. అక్కడే ఆమెకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్, ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ వచ్చాయి. అక్కడే ఆమిర్ ఉల్ షఫీఖాన్ పరిచయం అయ్యాడు.
టీనా బ్యాచ్‌మేట్ అతను. ఇప్పుడు వాళ్లిద్దరూ దంపతులు. రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ఆమిర్‌కు రాజస్థాన్‌లోనే పోస్టింగ్. జమ్ము కశ్మీర్ అడిగితే అక్కడ ఖాళీల్లేవని ఇక్కడ ఇచ్చారు. టీనాకూ అలాగే జరిగింది. ఆమె హర్యానా అడిగితే రెండో ఆప్షన్‌గా ఉన్న రాజస్థాన్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టం. ఇద్దరూ సాహితీ ప్రియులే. ఆయన పొయెట్రీ రాస్తారు. ఈమె ఇంగ్లిష్ నవలలు చదువుతారు.
టీనా తండ్రి జస్వంత్ దాబి బి.ఎస్.ఎన్.ఎల్.లో జనరల్ మేనేజర్. తల్లి హిమానీ దాబీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అధికారి. పిల్లల కోసం ఉద్యోగం మానేశారు. మీనాకు రియా అని ఒక చెల్లి. ఈ కుటుంబానిది భోపాల్. టీనా చిన్నప్పుడే ఢిల్లీ వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రులు పలుకుబడి గలవాళ్లు కాబట్టి టీనాకు కెరీర్‌లో ప్రాధాన్యం లభిస్తోందని, ఇప్పుడు బ్రిక్స్‌కు వచ్చిన అవకాశం కూడా అలాంటిదే అని గత రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
ఆ ట్రోల్స్‌ని చూసి ఎప్పటిలా నవ్వుకుని వదిలేస్తున్నారు టీనా. ఆమె ప్రతిభావంతురాలు కాకపోయుంటే ఆ సంగతి ఎక్కడో ఒక చోట బయట పడి ఉండాలి. స్కూల్లోనో, కాలేజ్‌లోనో, క్యాంపస్‌లోనో, ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్‌లోనో, ఎస్డీఎంగా ఇప్పుడు పని చేస్తున్న హోదాలోనో! ప్రతిచోటా ఆమెకు మంచిపేరే ఉంది. మంచి మార్కులే పడుతున్నాయి. దళితురాలు కనుక ఏమైనా ప్రచారం చెయ్యొచ్చు అనుకుంటే ప్రతిభ చూస్తూ కూర్చోదు. పై స్థాయికి చేరుస్తూనే ఉంటుంది.. ఏడ్చేవాళ్లను ఏడవనివ్వమని.
బ్రిక్స్ సిసిఐ (చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) ‘యంగ్ లీడర్స్ ఇనీషియేటివ్స్’ కమిటీకి గౌరవ సలహాదారు గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. యువతే భవిష్యత్తు. కీలకమైన రంగాలలో యువతకు ప్రేరణనిచ్చి, వారిని ప్రోత్సహించి, వారి ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆలోచనల్ని మేము పంచుకోబోతున్నాం. – టీనా దాబి, యువ ఐ.ఎ.ఎస్. అధికారి
Comments
Please login to add a commentAdd a comment