‘నువ్వు బాగా చదువుతున్నావు’ అని వారు చెప్పిన మాట మనల్ని మరింత బాగా చదివేలా చేసి ఉంటుంది. ‘దెబ్బలు పడతాయి... గాడిద’ అని చేసిన మందలింపు దారి తప్పకుండా గాడిలో పెట్టి ఉంటుంది. ఒక టీచర్ చిత్రలేఖనంలోకి పంపి ఉంటాడు. ఒక టీచర్ భుజాన తుపాకీ వేసుకొని సరిహద్దులో రక్షణకు నిలబడేలా చేసి ఉంటాడు. ఒక టీచర్ అంతరిక్షంలో చూపు సారించడానికి అవసరమైన దృష్టి అందించి ఉంటాడు. తల్లిదండ్రులకు మనం మాత్రమే పిల్లలం. టీచర్లకు ప్రతి విద్యార్థి పిల్లవాడే. మనం ఎక్కడికో చేరుకుని ఉంటాం. తదుపరి విద్యార్థి కోసం వారు అక్కడే ఆగిపోయి ఉంటారు. వారికి కావాల్సింది మణులా మాణిక్యాలా? ‘థ్యాంక్యూ టీచర్’ అనే చిన్న మాట.
ఒక చేత చాక్‌పీస్, ఒక చేత డస్టర్, మాటిమాటికి సవరించుకునే కళ్లద్దాలు, ఆర్భాటం లేని ఆహార్యం, బల్ల మీద ఊరికే పడేసి ఉంచే బెత్తం, నలభై అయిదు నిమిషాల వాక్ప్రవాహం, ఇల్లు దాటి మొదలెట్టే పసిపాదాల నడకలో మొదట తారసపడే రూపం... పేర్లు వేరు...టీచర్, సార్, మిస్, మేడమ్, ఐవోరు, మేష్టారు... కాని పాఠం ఒకటే. ఆ ప్రబోధం ఒకటే. దర్శనం ఒకటే. ఆ మార్గదర్శనం ఒకటే. ‘మాతృ దేవోభవ పితృ దేవోభవ’ అనడంలో విశేషం లేదు. కన్నందుకు ఎలాగూ ప్రేమ పంచుతారు. కాని ఏ పేగుబంధం లేకుండా వాత్సల్యం పంచుతాడు గురువు. అందుకే అతడు ఆచార్య దేవోభవుడు.
ఎంపిక చేసుకుంటారు
కొందరు ఇంజనీర్లవుదామనుకుంటారు. కొందరు డాక్టర్లు కావడానికి కష్టపడతారు. కొందరు మాత్రం ‘టీచర్ అవుతాను’ అని పట్టుబడతారు. ఎందుకు అలా పట్టుబడతారు? బహుశా వీళ్లకు పిల్లలు ఇష్టం. అక్షరాలు పంచడం ఇష్టం. ఒక మొక్కకు ఎరువు వేసి, కుదురు బలిష్టంగా అయ్యేలా చూసి, అది మహా వృక్షంగా ఛాయనూ కాయనూ ఇవ్వడాన్ని చూడటం ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిల్లల మధ్య పిల్లలుగా ఉండటం ఇష్టం. ‘టీచరుగా ఉండాలి’ అని అనుకోవడం వల్ల వీరు ఈ దేశ భవిష్యత్ నిర్మాణం పట్ల, విలువలున్న సమాజ స్థాపన పట్ల సగం బాధ్యత వహిస్తారు. ఆ బాధ్యత వీరికి ఇష్టం. టీచర్ ఉద్యోగం ఏ బిందువు నుంచి మొదలయ్యి ఏ బిందువున ముగుస్తుందో వీరికి తెలుసు. ఆ ఉద్యోగంలో శ్రీమంతులు అయిపోలేరు. ఆ ఉద్యోగంలో గొప్ప గొప్ప హోదాలు ఊడిపడవు. ఆ ఉద్యోగంలో అడుగులకు మడుగులొత్తే సిబ్బంది ఉండరు. ఆ ఉద్యోగంలో పెద్ద పెద్ద ఆఫీసులు గొప్పగొప్ప నగర జీవనాలు ఉండవు. అయినా సరే వీరు ‘టీచర్ అవుతాను’ అని అనుకుంటారు. వీరు ‘వినేవారు’ కాదు. ‘చెప్పేవారు’. ‘చెప్పేవారి స్థానం’ గొప్పది అని వారికి తెలుసు. తల్లిదండ్రులు సమాజానికి వ్యక్తులను ఇస్తారు. గురువులు పౌరులను ఇస్తారు.
ఢిల్లీకి రాజైనా
ఢిల్లీకి రాజైనా గురువుకు శిష్యుడే. ప్రధాన మంత్రి అయినా రాష్ట్రపతి అయినా తనకు పాఠాలు చెప్పిన టీచర్ ఎదురు పడితే తల వొంచి నమస్కరించాల్సిందే. ‘ఏవోయ్’ అని ఆ టీచర్ మెచ్చుకోలుగా భుజం చరిస్తే ఉబ్బితబ్బిబ్బవాల్సిందే. ఈ గౌరవం నిలబెట్టుకోవడానికి టీచర్లు ఎప్పుడూ తమ సాంఘిక జీవనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండేందుకు తాము ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాధన చేస్తారు. సగటు మనిషిలా వీరు బజారులో తిరగలేరు. టీచరు స్కూల్లో కాకుండా వేరే ఎక్కడ కనిపించినా స్టూడెంట్‌కి వింతే. కనుక వీరు అనేక సరదాలను, సంతోషాలను పరిమితం చేసుకుంటారు. తమ సంతానాన్ని మరింత క్రమశిక్షణతో పెంచుతారు. ‘ఫలానా టీచరు కొడుకు ఇలా చేశాడట’ అనే మాట వస్తే ఆ టీచరు ఇక బోధన చేయడానికి నైతిక అర్హత కోల్పోతాడు. ఈ మెడమీద వేళ్లాడే కత్తులన్నింటినీ వారు కంఠం తెగి పడకుండా కాచుకుంటారు.
చుక్కాని ఇస్తారు
టీచర్లు ఏం చేస్తారు? విద్యార్థుల చేతికి చుక్కాని ఇస్తారు. కొందరిని అన్ని దిక్కులకూ వెళ్లమని చెబుతారు. మరికొందరిని పని గట్టుకుని ఉత్తర దిక్కుకే వెళ్లు అని ఆజ్ఞాపిస్తారు. ‘ప్రశ్న’ అవసరాన్ని చెబుతారు. నిలదీయకపోతే వంకరలు పోవు అని నేర్పిస్తారు. న్యాయం వైపు నిలబడటం సింహాన్ని లొంగదీయడానికి మించిన సాహసం అని నూరిపోస్తారు. నాయకత్వం నేర్పుతారు. నడవడంతో పాటు నడిపించడమూ తెలుపుతారు. పొగడటం ద్వారా ముందుకు నడిచేలా చేస్తారు. తిట్టడం ద్వారా కూడా ముందుకు నడిచేలా చేస్తారు. చేయి దాటిపోయిన పిల్లల మీద తల్లిదండ్రులైనా ఆశ వదులుకుంటారేమో కాని గురువులు వదలుకోరు. తెగిన గాలిపటం ఏదో ఒక స్తంభానికి చిక్కి ఎగిరినా చాలనుకుంటారు.
నిత్య విద్యార్థులు
పరీక్షలు పూర్తి చేయడంతో, పట్టా పుచ్చుకోవడం తో అందరికీ ‘విద్యార్థి దశ’ ముగుస్తుంది. కాని టీచర్లు నిత్య విద్యార్థులుగా ఉంటారు. అదే స్కూల్లో రిటైర్ అయ్యేంత వరకు చదువుతారు. ఎప్పటి పాఠాలు అప్పుడు చెప్పడానికి చదువుతారు. హోమ్‌వర్క్‌లు ఇవ్వడానికి చదువుతారు. కొత్త సిలబస్ తెలుసుకోవడానికి చదువుతారు. క్లాస్‌లో ఒక తెలివైన కుర్రాడు తయారయ్యి తెలివైన ప్రశ్నలు అడుగుతుంటే గనుక తమ సబ్జెక్ట్‌ను పెంచుకోవడానికి మళ్లీ కొత్తగా చదువుతారు. వీరు చదివే కొద్దీ పిల్లలకు చదువు వస్తుంది. పిల్లలకు చదువు వస్తే దేశానికి చదువు వస్తుంది. దేశాన్ని గౌరవిస్తున్నామంటే ఆ దేశంలో తయారైన క్లాస్‌రూమ్‌ని ఆ క్లాస్‌రూమ్‌కు బాధ్యడైన టీచర్‌ని గౌరవిస్తున్నట్టు. ఆ టీచర్ నిబద్ధతను గౌరవించినట్టు. ఆ టీచర్ శ్రమను గౌరవించినట్టు. కాని ఆ గౌరవాన్ని ప్రదర్శించడం తక్కువ చేస్తుంటారు. మనకు పాఠాలు చెప్పిన టీచర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని నిజంగా ఆలోచించిన సందర్భాలు, వారి కోసం వెతికిన సందర్భాలు ఎన్ని ఉంటాయి?
థ్యాంకూ టీచర్
చిన్న గుమాస్తాగా ఉండవచ్చు. పెద్ద ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌గా ఉండొచ్చు. సమాజానికి గొప్ప మేలు చేస్తుండొచ్చు. అసలేమీ చేయకాపోవచ్చు. కాని ఒకరికి హాని చేయకుండా, నష్టపరచకుండా మన కుటుంబాన్ని మనం పోషించుకునే యోగ్యతలో ఉన్నామంటే అందుకు గురువు కదా కారణం. స్కూల్లో ఇరవై మంది టీచర్లు ఉంటే ఒకరు తప్పకుండా మనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ఉంటారు. వారిని తలుచుకుందాం ఈ రోజు. వారిని పలకరిద్దాం ఈరోజు. థ్యాంక్యూ టీచర్... థ్యాంక్యూ సార్– అని చెబుదాం ఈ రోజు. థ్యాంక్యూ సార్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
టీచర్లు బహువిధాలు
► రూపం. ఆహార్యం, కంఠం... ఈ మూడింటితో ఆకట్టుకునేవాళ్లు.
► నవ్విస్తూ పాఠం చెప్పేవాళ్లు.
► తాము నవ్వకుండా పిల్లలు నవ్వేలా చేస్తూ పాఠం చెప్పేవాళ్లు
► ఎక్కువ కబుర్ల మధ్య తక్కువ పాఠం చెప్పేవారు
► జ్ఞానం, పాండిత్యంతో గౌరవం పొందేవారు
► ఆటపాటలతో ఆకట్టుకునేవారు
► సిలబస్ ముందే ముగించేవారు
► సిలబస్ ఎప్పటికీ ముగించని వారు
Comments
Please login to add a commentAdd a comment