సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ.
సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్‌ఫోన్‌లో ఒక పాట మ్యూట్‌లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్‌లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్‌లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది?
అదే మైండ్ రీడింగ్.
మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది.
అదీ మైండ్ రీడింగే.
ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్.
చిన్నప్పటి నుంచి
సుహానీ షాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్‌లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్‌కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్‌లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్‌లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్‌గా మారింది.
మెంటలిస్ట్ అంటే?
మెజీషియన్‌లాగా సంగీతం, ఎక్విప్‌మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్‌లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్‌లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్‌గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ.
మోటివేషనల్ స్పీకర్
సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్‌లో పర్సనాల్టీ డెవలప్‌మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె.
సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి.
Comments
Please login to add a commentAdd a comment