Magicians
-
ఆకట్టే కనికట్టు: మెంటలిస్ట్ సుహానీ షా
సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ. సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్ఫోన్లో ఒక పాట మ్యూట్‌లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్‌లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది? అదే మైండ్ రీడింగ్. మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది. అదీ మైండ్ రీడింగే. ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్. చిన్నప్పటి నుంచి సుహానీ షాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్‌లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్‌కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్‌లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్‌లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్‌గా మారింది. మెంటలిస్ట్ అంటే? మెజీషియన్లాగా సంగీతం, ఎక్విప్మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్‌లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్‌లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్‌గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ. మోటివేషనల్ స్పీకర్ సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్‌లో పర్సనాల్టీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె. సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి. -
‘సమాజ ప్రగతికి మ్యాజిక్ కోర్స్ ఎంతగానో ఉపయోగకరం’
హైదరాబాద్ : పీసీ సర్కార్ జయంతి సందర్భంగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ మరియు మేజిషియన్ అకాడమీ ఆధ్యర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మేజిషియన్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్‌రావు, డీన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ హనుమంతరావు, మేజిషిన్ అకాడమీ ప్రెసిడెంట్, మ్యాజికోర్స్ కో ఆర్డినేటర్ సామల వేణు హాజరైయ్యారు. అతిధులు జ్యోతి ప్రజ్యల చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు. మ్యాజిక్ కోర్స్ ఎంతో మంది యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పిస్తుందని, ఈ కోర్స్ నిర్వహిస్తునందుకు గర్వంగా ఉందన్నారు వీసీ కిషన్ రావు.సమాజంలో మూఢనమ్మకాలను తొలగించి, ప్రజలను చైతన్య పరచి సమాజ ప్రగతికి మ్యాజిక్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రశంసించారు ఐజీ ఆఫ్ నార్త్ తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో మేజిషియన్లు ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని ఐజీ చెప్పారు. మరోవైపు సమాజ హితానికి ఎంతగానో దోహదపడుతున్న మేజిషియన్ కోర్స్ చేసిన వారికి ఇప్పటి వరకు డాక్టరేట్ లేదని.. రాబోయే రోజుల్లో డాక్టరేట్ ఇచ్చేలా కృషిచేయాలని కోరారు. మ్యాజిక్ కోర్స్ చేస్తున్న విద్యార్థులకు సామాగ్రి కొనుగోలు చేసేందుకు బీసీ వెల్ఫేర్ తరపున ఆర్ధిక సాయం అందిచేలా కృషి చేస్తామని ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో మాజిక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు మేజిషియన్ అకాడమీ ప్రెసిడెంట్ సామల వేణు.గత ఎనిమిది సంవత్సరాలుగా మ్యాజిక్ కోర్స్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. -
బీజేపీ ‘మాయాజాలం’
మాములు మాటలతో కంటే మాయలు, మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లపై మా యాజాలం విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామాల్లో ఇంద్రజాలికుల ద్వారా ప్రదర్శనలు ఇప్పించి ఓటర్లను ఆకట్టుకోవాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం గుజరాత్లో 52 మంది ఇంద్రజాలికుల్ని రంగం లోకి దించారు. 2014 ఎన్నికల్లో ఇలాగే ఇంద్రజాలికులతో ప్రచారం చేయించడం పార్టీకి లాభించిందని భావించిన నాయకత్వం ఈసారి కూడా అదే ప్రయోగం చేస్తోందని బీజేపీ ప్రతినిధి భరత్ పాండ్య చెప్పారు. గుజరాత్‌తో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పిలిపిం చిన ఇంద్రజాలికులు కొన్ని బృందాలుగా విడిపోయి మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారు. ముందుగా మేజిక్‌తో అంటే ఖాళీ కుండ నుంచి కమలం బొమ్మ ఉన్న జెండాను బయటకు తీయడం, ఖాళీ పలకపై మోదీ బొమ్మను సృష్టించడం వంటివి చేస్తారు. ఒకవైపు ఈ ప్రదర్శన జరుగుతోంటే మిగతా వారు బీజేపీ ప్రభుత్వ పథకాలను, హామీలను వివరిస్తుంటారు. అక్కడి అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు. కాగా, మోదీ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన ప్రజోపయోగ నిర్ణయాలు, పథకాల గురించి ప్రచారం చేసేందుకు 52 ఎల్ఈడీ వ్యాన్లను కూడా ఉపయోగిస్తున్నారు. -
దేవ జాలం
మనుషులకు మంచి విషయాలు చెప్పడానికి పట్టాభిరామ్ ఇంద్రజాలాన్ని వాడుతారు అలా సమాజంలో అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను పెంపొందించే కృషి చేశారు. మంచి చెప్పడానికి ఇంద్రజాలాన్ని వాడినప్పుడు దైవత్వాన్ని అనుభూతి చెందడానికి దేవజాలమే కరెక్ట్ మేజిక్ ఏమో కదా! మెజీషియన్, సైకాలజిస్ట్ డా.బి.వి.పట్టాభిరామ్ క్లినిక్‌కి వెళ్లినప్పుడు ఎదురుగా బోర్డుమీద ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’ (నీ తలరాతకి నువ్వే సృష్టికర్తవు) అనే అక్షరాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్య అతి చిన్న చిన్న సమస్యలే పెద్దవి అయిపోయాయి. మనుషులు మనస్తత్వాలు మరీ సున్నితమైపోయాయంటూ సబ్జెక్ట్‌లోకి వెళ్లిపోయారు పట్టాభిరామ్. సైకాలజీలో ఇటీవల రెండో పీహెచ్డీ వచ్చిందని ఆనందంగా వివరించిన ఆయన ‘నా వృత్తే నాకు దైవం’ అంటూ చెప్పుకొచ్చారు... దేవుడి గొప్పతనం మీకు మొదటిసారిగా ఎప్పుడు అర్థమైంది? (చిన్నగా నవ్వుతూ) నాకు దేవుడి గొప్పతనం కంటే ముందు మనిషి గొప్పతనం అర్థమైంది. వివరంగా చెబుతారా? నా చిన్నప్పుడు ఓసారి మా ఇంట్లో అంతా జాతకం చూపించుకుంటూ నా జాతకమూ చూపించారు. జ్యోతిష్యుడు నా జాతకం చూసి ‘వీడికి అక్షరమ్ముక్క అబ్బదు. ఈ కుటుంబంలో వీడు మహాదరిద్రుడు అవుతాడు. పైగా 16 ఏళ్ళకు మించి బతకడు’ అని చెప్పాడు. భయపడిపోయాను. మా అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆవిడ ఆ మాటను కొట్టి పడేస్తూ ‘ఒరే... మా నాన్న 80 ఏళ్లు బతికాడు. నువ్వూ అన్నేళ్లు బతుకుతావు. నీకు ఆయన గుణాలే వచ్చాయి. దిగులు పడకు’ అంది. ఇప్పుడు నా వయసు 66 ఏళ్లు. అమ్మ ఆ రోజు నన్ను అలా ‘మోటివేట్’ చేయకపోతే ఆ దిగులు నాలో అలాగే పడిపోయేదేమో. మనిషి గొప్పతనం మనిషి చేయగల మేజిక్ అప్పుడే నాకు అర్థమైంది. మరి దేవుడెప్పుడు తెలిశాడు? నేను టెన్త్ పాసయ్యాక మా అమ్మ తిరుపతి తీసుకెళ్లింది. గుండు చేయించుకోమంది. నేను చేయించుకోనన్నాను. ‘తప్పు, నేను దేవుడికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాల్సిందే. మొక్కు తీర్చుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు’ అంది. నిజమే అనుకొని ‘టోపీ కొనిస్తే గుండు చేయించుకుంటా’న ని చెప్పాను. గుండు చేయించుకున్నాను. టోపీ పెట్టుకున్నాను. తిరిగి వస్తుండగా మా నాన్న నన్నే చూస్తూ ‘టోపీ ఎందుకు పెట్టుకున్నావురా.’ అన్నాడు. ‘అంతా నన్నే చూస్తున్నారు సిగ్గుగా ఉంది’ అన్నాను. ‘అంటే నీ మీద నీకు విశ్వాసం లేదన్నమాట. అమ్మ చెప్పింది కదా అని చేయించుకున్నావు. పైగా దేవుడు శిక్షిస్తాడు అంది కదా. శిక్షించేవాడు దేవుడెలా అవుతాడురా. గుండు చేయించుకోవడం అంటే ఆకర్షణ కారణంగా వచ్చిన అహాన్ని దూరం చేసుకున్నానని చెప్పడానికి సూచిక. అదేదో తప్పు అయినట్టు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు. ఇదెందుకు సిగ్గుపడే పని అయింది చెప్పు’ అన్నాడు. వాస్తవం అనిపించింది. టోపీ తీసి రోడ్డు మీదకు విసిరేశాను. మూఢంగా నమ్మడం అప్పటి నుంచే మానేశాను. లాజికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను. అమ్మా నాన్నలు బిడ్డకు జన్మనివ్వడమే కాదు మంచి చెడులను చెప్పి జీవితంలో ఎదిగేందుకు చేయూతనిచ్చే దేవతలు. అమ్మనాన్నలను మించిన దేవతలు లేరు నాకు. ఆ తర్వాత నన్ను నిలబెట్టిన ఈ వృత్తి నాకు దైవం కన్నా ఎక్కువ. ఇంటి కన్నా గుడి పదిలం అన్నారు పెద్దలు. మీరు చెబుతున్నది చూస్తే గుడి కన్నా ఇల్లు పదిలం అన్నట్టుంది? మా అమ్మనాన్నలకు 15 మంది సంతానం. 11 మంది అన్నదమ్ములం. నలుగురు అక్కచెల్లెళ్లు. వాళ్లు అంతమందిని ఎలా పెంచారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. మా నాన్న తిట్టడం, కొట్టడం చూళ్లేదు నేను. కొన్ని నియమాలు మాత్రం కఠినంగా ఉండేవి. అందరం ఒకేసారి కూర్చొని భోజనం చేయాలి, రాత్రి 9కి అందరూ పడుకోవాలి. కలిసి పంచుకొని తినడంలో ఆనందం, కంటి నిండా నిద్రపోవడంలో ఆరోగ్యం ఆయన నుంచి మేం నేర్చుకున్నాం. మా ఇంట్లో అందరూ కళాకారులే. నాకు మేజిక్ కళ అబ్బినట్టే అందరికీ ఒక్కో కళలో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి రెండవ శనివారం అందరం ఒకచోట కలుస్తుంటాం. ఆ రోజు మాకు పెద్ద పండగ. ఏ ఒక్కరు మిస్ అయినా వాళ్లేదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండేది ఇద్దరో, ముగ్గురో.. అయినా ఒకరినొకరు మాట్లాడుకోరు. ఫోన్లలో చాట్ చేస్తూనో, టీవీ చూస్తోనో గడిపేస్తారు. మాట్లాడుకోవాలి, ఏది మాట్లాడకూడదో తెలుసుకొని ఆచరించాలి, కలిసి భోజనం చేయాలి, కుటుంబంలో అందరి మధ్య స్పర్శ ఉండాలి, ప్రశంస ఉండాలి, నవ్వు ఉండాలి.. ఇవి లేకనే బయటివారితో తమ ఆనందాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లను వదిలి గుళ్లూ, గోపురాలలో కాలక్షేపం చేస్తున్నారు. మిమ్నల్ని మీరు హిప్నటైజ్ చేసుకుంటారా? ప్రతి రోజూ హిçప్నటైజ్ చేసుకుంటాను. మనల్ని మనం తెలుసుకోవడం అవసరం. పాజిటివ్ ఆలోచనలు ఎంత పెంచుకుంటే అంత ప్రశాంతమైన జీవితం మనదవుతుంది. చెడు నన్ను పట్టుకుందా దాన్ని శుభ్రం చేసుకుంటాను. మంచి ఎక్కడైనా ఉందా అది తీసుకుంటాను. ఈ విధానంలో గొప్ప ప్రశాంతత చేకూరుతుంది. మీ దగ్గరకు వచ్చే కేసులలో ఈ కేసు దేవుడే డీల్ చేయాలని చేతులెత్తేసిన సందర్భం? అలాంటిదెప్పుడూ లేదు. పరిష్కారం చేయలేని కేసులంటూ ఏమీ ఉండవు. దాన్ని డీల్ చేసే విధానాలే వేరు వేరుగా ఉంటాయి. మనం చెప్పే విధానంలో ఆ క్లారిటీ ఉండాలి. నాకీ పని చేయడం రాదు, నేను ఇలాగే ఉంటాను అంటుంటారు కొందరు. అదొట్టి మూర్ఖత్వం. ముందు ఆచరణలో పెడితే తర్వాత అదే అలవాటవుతుంది. దేవుడి మహిమ వల్లే ఈ కేసు పరిష్కారం అయిందనుకున్న సందర్భం ఉందా? మీరు వచ్చే ముందే ఈ (‘సత్య నాదెళ్ల’ పుస్తకం చూపిస్తూ) పుస్తకం చదువుతున్నాను. ఈయనకి ఐఐటీలో సీటు రాలేదు. బిట్స్ పిలానీలో సీటు రాలేదు. డొనేషన్ కట్టి చదివాడు. కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నది ఆశయం. అతను ఇందులో చెప్పుకున్నాడు.. ‘నా గదిలో మా అమ్మ లక్ష్మీదేవి బొమ్మ పెట్టేది.. మా నాన్న కార్ల్‌మార్క్స్ బొమ్మ పెట్టేవాడు... నేను క్రికెటర్ జయసింహ ఫొటో పెట్టుకునేవాణ్ణి’ అని. ఆయన తన కలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేశాడు. ఇప్పుడు మహామహా మేధావులు సైతం ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’. నీ నుదుటి రాత దేవుడు రాయడు. పెన్ను, పేపర్ నీ చేతిలోనే ఉంది. నువ్వేది రాసుకుంటే అదే నీ జీవితం. నువ్వు కృషి చేయి. నీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. అంతేకానీ, దేవుడి మహిమలు అంటూ ఏమీ లేవు. మేజిక్ అంటే మాయ కదా! డబ్బు మాయ, పదవి మాయ, మోహం మాయ.. మనిషి ఏ మాయ నుంచి జాగ్రత్తగా ఉండాలి. డబ్బు గొప్పది. దీని కోసమేగా అందరం పనిచేసేది. మనిషి తనకు సరిపడా ఉన్నా ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. తరతరాలకు. ఆ డబ్బే అతన్ని సుఖపెడుతుంది. ఆ డబ్బే దుఃఖపెడుతుంది. డబ్బు మాయను అర్థం చేసుకొని ఆనందంగా బతికితే చాలు. మీ భార్యను మాయ చేసిన సందర్భం ఉందా? (నవ్వుతూ) మాయ అని చెప్పలేను. కానీ, వాస్తవంగా ఆలోచించినది ఆచరణలో పెట్టడానికి పెళ్లయ్యాక నాకు ఐదేళ్లు పట్టింది. మా ఆవిడకు గుళ్లకు వెళ్లడం, సంప్రదాయాలను పాటించడం చాలా ఇష్టం. అవి నన్నూ పాటించమంటే కష్టంగా ఉండేది. నా వృత్తికవి అడ్డంకి కూడా. ఇలా చెప్పి ఆమె మనసును నొప్పించకూడదు. అందుకని ఓ ప్లాన్ వేశాను. ‘ఏడాదిలో రెండుసార్లు అంటే, జనవరి 1న షిరిడీ వెళ్దాం. పెళ్లిరోజున తిరుపతిలో ఉందాం’ ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లాన్ ఇంకో పదేళ్లయినా అలాగే కంటిన్యూ అవుతుంది. సంప్రదాయాలను మూఢంగా కాకుండా లాజికల్‌గా ఆలోచించి చేయమని చెబుతుంటాను. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండీ అంటుంది. అలా అయితే బిల్‌గేట్స్ ఇంటి ముందు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి చెప్పు అంటాను నవ్వేస్తూ.. ఆలోచనల్లో పడుతుంది. ముక్కోటి దేవతలు ఉండగా జనాలు మీతో మొరపెట్టుకోవడానికి వస్తారెందుకు? ఇక్కడే అర్థం అవుతుందిగా. దేవతలు సమస్యలు సాల్వ్ చేయరని. సైకాలజిస్ట్‌లు అంటే ఎవరు..? ఒకప్పటి తాతయ్యలు, నానమ్మలు. అప్పట్లో వాళ్లు అన్‌పెయిడ్ కౌన్సిలర్లు. ఇప్పుడు ఇళ్లలో వాళ్లు లేరు. అందుకే మా అవసరం వచ్చింది. మంచి, చెడులు చెప్పి బాంధవ్యాలు చక్కగా ఉండేలా చేసే పెద్దదిక్కులను ఆశ్రమాలకు పంపిస్తున్నాం. కనపడని దేవతలకు మొక్కుకుంటే ఎవరు వింటారు. ఆ ప్రాబ్లమ్‌ని ఎవరు సాల్వ్ చేస్తారు. దేవుడి సైకాలజీ ఏమిటి? ప్రశాంతంగా ఉండటమే దేవుడి సైకాలజీ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండే స్థలంలోనే కదా దేవుడు ఉంటాడు. మరి ఆ దేవుడిని పూజించే మనం ప్రశాంతంగా ఉంటున్నామా? చాలా మంది ఫ్యామిలీ ఇష్యూస్‌తో మా వద్దకు వస్తుంటారు. చెప్పిన మాట పిల్లలు వినడం లేదనో, భార్యాభర్తల బంధం సరిగా లేదనో.. అన్నీ కంప్లైంట్సే. చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అశాంతికి విరుగుడు ప్రశాంతత అని అర్థం చేసుకోవాలి. దేవుడికి కష్టం చెప్పుకోవచ్చా? దేవుడికి కష్టం చెప్పుకుంటారు బానే ఉంది. వింటున్నాడనే నమ్మకం ఉందా. అలా అని నమ్ముతున్నారా? మరి మా దగ్గరకు వచ్చే జనం రోజు రోజుకూ పెరుగుతున్నారు ఎందుకు? అందుకే, మనం మనుషులతోనే మాట్లాడాలి. మనవాళ్లతో మనం మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడాలి. మాట కత్తికన్నా పదునైనది. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా ఫర్వాలేదు. ఎదుటివారిని నొప్పించేవిధంగా మాత్రం మాట్లాడకూడదు. అది నీ ఆప్తులైనా సరే. అప్పుడే మనుషుల మధ్య బాంధవ్యాలు బాగుంటాయి. బాంధవ్యాలు బాగుంటే బతుకు బాగున్నట్టే. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
మోదీ మెజీషియన్‌లా వ్యవహరిస్తున్నారు
వాద్నగర్/పటాన్: వాస్తవ అంశాలను మరుగు పరిచి, జనం దృష్టి మరల్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ సొంతూరు వాద్నగర్లో జరిగిన సభలో ప్రసంగించారు. మెజీషియన్ ట్రిక్కులు ప్రదర్శించే సమయంలో జనం చూపు పక్కకు మరల్చేందుకు ప్రయత్నించినట్లే మోదీ గత 15 రోజులుగా నిజాలను దాస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాల్లో గుజరాత్ అభివృద్ధికి సంబంధించిన విషయాలే కనిపించడం లేదని ఆరోపించారు. నర్మద జలాల అంశం, రిజర్వేషన్లు, రాష్ట్రాభివృద్ధి వంటి వాటిపై బీజేపీ వైఫల్యం తెలుస్తుండడంతో అయ్యర్ ట్వీట్ల అంశాన్ని మోదీ ప్రస్తావిస్తున్నారని తెలిపారు. ఇది ఎన్నికల ప్రచార అంశమేనా అని ప్రశ్నించారు. నర్మదా జలాలను గ్రామాలకు తరలిస్తామని మోదీ హామీ ఇచ్చినప్పటికీ ఆ నీళ్లు టాటాల నానో ఫ్యాక్టరీకే వెళ్తున్నాయన్నారు. -
థి ఛూ.. మంతర్
భాగ్యనగరం తొలిసారిగా అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనానికి వేదిక కానుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో 19, 20 తేదీల్లో ‘ఛూ... మంతర్-2014’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెజీషియన్స్ ‘ఆస్కార్’గా పరిగణించే మెర్లిన్ అవార్డును తెలుగువాడైన ఇంద్రజాలికుడు సామల వేణు అందుకోనున్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్లిన్ అవార్డు ప్రతిమను ఆవిష్కరించారు. ‘ఛూ... మంతర్’లో భాగంగా ఇండియన్ మెర్లిన్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు టోనీ తెలిపారు. మింట్ టీ చిన్నారులు తమ అద్భుత నటనతో మిమ్మల్ని అలరిస్తారు. లామకాన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ ముందకు వస్తున్నారు. ద డిక్షనరీ సేల్స్‌గర్ల్, చిలి పెప్పర్ చిక్స్ షార్ట్, డూ యూ వర్క్ హియర్ అనే పేరిట మూడు నాటకాలతో కనులవిందు చేయనున్నారు. సుజానే పటేల్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వివరాలకు.. 9885450022 వస్త్ర బోటిక్ ‘నిండైన భారతీయుత చీర కట్టులోనే ఉంటుంది. అందుకే చీరలంటే నాకెంతో ఇష్టం’ అన్నారు వూజీ వుంత్రి డీకే అరుణ. హివూయుత్నగర్లో ‘వస్త్ర బొటిక్’ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె హాజరయ్యారు.