ఆవును సంరక్షించడంతో నా జీవితం మలుపు తిరిగింది | Surabhi Goshala Founders Valluru Ravi Kumar Special Story In Sagubadi | Sakshi
Sakshi News home page

ఆవును సంరక్షించడంతో నా జీవితం మలుపు తిరిగింది

Published Mon, Mar 1 2021 2:38 PM | Last Updated on Mon, Mar 1 2021 2:43 PM

Surabhi Goshala Founders Valluru Ravi Kumar Special Story In Sagubadi - Sakshi

‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు..’ అంటూ వేమన శ్రేష్టమైన ఆవు పాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. నాటు (దేశీ జాతి) ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సర్వోత్తమమైనవన్న భావన ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. వీటినే ‘ఎ2 మిల్క్‌’ అని పిలుస్తూ.. అనేక దేశాల్లో అమృతసమానంగా చూస్తున్నారు. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఎ2 పాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిని పెంపొందించి, ఎ2 పాల ఉత్పత్తులను ‘ఏపీ గోపుష్టి’ పేరుతో దేశ విదేశాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పించింది. నాటు ఆవుల సంతతిపై అవ్యాజమైన ప్రేమతో, అనురక్తితో ‘సురభి గోశాల’ ను నిర్వహిస్తున్న వల్లూరు రవికుమార్‌ ఈ పథకానికి సలహాదారుగా నియమితులయ్యారు. నాటు ఆవు పాల ఉత్పత్తితో పాటు శాస్త్రీయ పద్ధతిలో సంతతిని పెంపొందించుకునే పద్ధతులపై తన సుసంపన్నమైన అనుభవాలను ఆయన ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు. దేశీ ఆవుల్లో కొన్నే ‘గంగి గోవుల’ని ఆయన సూత్రీకరిస్తున్నారు.. 

వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్‌ డిప్లొమా చేసిన వల్లూరు రవి కుమార్‌(47) హైదరాబాద్‌లో ఓ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు. ఒక రోజు తమ ఇంటి ఎదుట ఒక నాటు ఆవుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ ఆవును సంరక్షించి సపర్యలు చేయడంతో రవి జీవితం మలుపు తిరిగింది. తదనంతరం గుజరాత్‌లోని తోడల్లుడి దగ్గరకు వెళ్లినప్పుడు దేశీ గోజాతుల గురించి మరింత ఆసక్తి కలిగింది. దేశీ గోజాతుల సంరక్షణకు రవి కృషి అనుకోకుండా అలా ఆరంభమైంది. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వగ్రామం పేరికలపాడులో ‘సురభి గోశాల’ను రవి 4 ఆవులతో ప్రారంభించారు.

21 ఎకరాలు.. 125 ఆవులు.. 
సురభి గోశాలలో ఇప్పుడు 125 ఆవులు, ఆంబోతులు ఉన్నాయి అనే కంటే.. వాటితో రవి పూర్తిగా మమేకమై అనుదిన జీవనాన్ని పంచుకుంటున్నారు అంటే బావుంటుంది. 2.35 ఎకరాల్లో షెడ్లున్నాయి. వివిధ జాతుల గోవులు, ఆంబోతులకు అందులో వేర్వేరుగా ప్రత్యేక ఆవాస విభాగాలున్నాయి. పక్కనే ఉన్న 6 ఎకరాల్లో సూపర్‌ నేపియర్‌ గడ్డి పెంచుతున్నారు. 45 రోజులకోసారి కోస్తూ నిరంతరం పచ్చి గడ్డి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆవుల పేడను గుంతలో వేసి, చివికిన తర్వాత పొలాల్లో వేస్తున్నారు. గోమూత్రం బక్కెట్లతో పట్టుకుంటేనే స్వచ్ఛత, ఔషధ గుణాలు చెడకుండా ఉంటాయని రవి అన్నారు. వరి గడ్డి కొని మేపుతున్నారు. 60% పచ్చిమేత, 40ఋ% ఎండుమేత ఉండేలా చాప్‌ కట్టర్‌తో ముక్కలు చేసి రెండూ కలిపి ఆవులకు పెడుతున్నారు. పదెకరాల్లో సజ్జలు, పచ్చజొన్న, జె7 జొన్న, 3 ఎకరాల్లో పుల్ల శనగ, 3 ఎకరాల్లో వేరుశనగ పండించి.. దాణాకు వాడుతున్నారు. గిర్‌ జాతి ఆవులు ఎక్కువ సంఖ్యలో 79తోపాటు 7 ఆంబోతులు ఉన్నాయి. కాంక్రేజ్‌ ఆవులు 18, ఆంబోతులు 2 ఉన్నాయి. పుంగనూరు ఆవులు 3, ఒక ఆంబోతు ఉంది. రెడ్‌ సింధి ఆవులు 3, థార్‌పార్కర్‌ ఆవులు 3, ఒక ఆంబోతు ఉన్నాయి. 3 ఒంగోలు ఆవులు ఉన్నాయి. 115 ఆవుల్లో ఏ సీజన్‌లో అయినా కనీసం 30 ఆవులు పాలు ఇస్తూ ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చూడి కట్టించడం చేస్తున్నామని రవి కుమార్‌ తెలిపారు. 15 చూడితో ఉంటాయి. 30 దూడలు (మూడేళ్ల లోపు) ఉంటాయి. 

వత్తిడి లేని గోపాలన 
నాటు ఆవుల పెంపకం పాల దిగుబడి వరకే పరిమితం చేసుకోకుండా దేశీ గో జాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రవి ప్రత్యేకత. వత్తిడి లేని గోపాలన పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. ఆవులను వేరే ప్రాంతం నుంచి కొని తెచ్చిన తర్వాత కొత్త మనుషులకు అలవాటు పడటానికి కనీసం 15 రోజులు పడుతుంది. రైతు స్వయంగా రోజుకు కనీసం 4–5 గంటల పాటైనా ఆవులతో మమేకం అవ్వాలి. ప్రతి ఆవుకు పేరు పెట్టాలి. ఆ పేరుతోనే పిలుస్తూ గంగడోలు సవరిస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లోనే నాటు ఆవులు మచ్చిక అవుతాయి. వత్తిడి నుంచి బయటపడతాయి. ఆవులను ప్రేమగా నిమరాలి. రోజూ నిమిరే వ్యక్తిని గుర్తు పెట్టుకొని.. పేరుతో పిలవగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తాయని రవి తెలిపారు. ఈ అనుబంధం ఏర్పరచుకుంటే ఆవులు వత్తిడికి గురికాకుండా.. సౌమ్యంగా, ఆనందంగా ఉంటూ అధిక పాల దిగుబడినిస్తాయన్నారు.

ఫ్రీ లోఫింగ్‌ సిస్టం
జన్యు స్వచ్ఛతను పరిరక్షించుకోవడానికి ‘ఫ్రీ లోఫింగ్‌ సిస్టమ్‌’ను రవి అనుసరిస్తున్నారు. కట్టేసి మేపరు. అన్నిటినీ కలిపి ఆరు బయట తిరగనివ్వరు. అలా తిరగనిస్తే రక్త సంబంధం ఉండే ఆవులను ఆంబోతులు ‘దాటే’ అవకాశం ఉంటుంది. దాని వల్ల ‘ఇన్‌బ్రీడింగ్‌’ జరిగి, జన్యు స్వచ్ఛత తగ్గిపోతుంది. పిడిగ్రీ నియమాలు ఇందుకు అనుమతించవు. అంటే.. ఏ జాతికి ఆ జాతిని వేర్వేరుగా ప్రత్యేక దొడ్ల(ఎన్‌క్లోజర్‌)లో ఉంచుతున్నారు. పాలిచ్చే ఆవులు, 7 నెలలు నిండిన చూడి ఆవులు, 9 నెలల లోపు దూడలు, మూడేళ్ల లోపు దూడలు, ఆంబోతులు.. ఇలా విభజించి వేర్వేరు విభాగాల్లో ఉంచుతున్నారు. ప్రతి ఆవుకు 15 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా 65“60 అడుగుల విస్తీర్ణంలో దొడ్లను నిర్మించారు. నీడనిచ్చే షెడ్‌తో పాటు ఎండ తగిలే ఖాళీ ప్రదేశం కూడా ఈ దొడ్డిలో ఉంటుంది. ఆవు తన ఇష్టం మేరకు ఎండలో, నీడలో బంధించినట్లు లేకుండా తిరుగాడుతూ స్వేచ్ఛగా ఉండటం వల్ల వత్తిడి ఉండదు.   

4 ఏళ్లుగా పిడిగ్రీ నమోదు
రవి ఏడేళ్లుగా సురభి గోశాలను నిర్వహిస్తున్నారు. అనేక విషయాల్లో అనుభవం గడించిన తర్వాత దేశీ గోజాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ఉపక్రమించారు. గత నాలుగేళ్లుగా పిడిగ్రీ(జన్యు వంశకత)ని నమోదు చేస్తున్నారు. ప్రతి ఆవు, ఆంబోతు తల్లిదండ్రులు ఎవరు? వాటి లక్షణాలు, పాల ఉత్పత్తి సామర్థ్యం తదితర వివరాలను, వాటి ఫోటోలను శాస్త్రీయంగా నమోదు చేసి, కంప్యూటరీకరిస్తున్నారు. దేశీ గోజాతుల బ్రీడింగ్‌లోను, నాణ్యమైన పాల ఉత్పత్తిలోనూ రవి కుమార్‌ సాధించిన విజయం అసామాన్యం. పట్టుదల, శ్రద్ధ రవిని ఎ2 డెయిరీ రంగంలో విజయ తీరాలకు నడిపించాయి.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

దూడలే రైతుకు ఆస్తి 
దేశీ గోజాతులను పెంచే రైతులకు దూడలే పెద్ద ఆస్తి అని రవి భావిస్తున్నారు. పిడిగ్రీ ప్రకారం, పోషణ లోపం లేకుండా పెంచితే మూడేళ్ల పెయ్య దూడ ఒక్కోటి రూ. లక్షకు అమ్ముడు పోతుందని, అదే రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని ఆయన స్వానుభవంతో చెబుతున్నారు. దూడకు ఒకటి లేదా రెండు రొమ్ముల పాలు పూర్తిగా వదిలెయ్యాలి. ఒక నెల అటు వైపు రొమ్ములు, మరో నెల ఇటు వైపు రొమ్ములు దూడకు అలవాటు చెయ్యాలి. 3 నెలల తర్వాత దూడ పాలు తాగటం తగ్గిస్తుంది. 6వ నెల నుంచి రోజుకు కిలో దాణా పెట్టాలి. ఆవు లేదా దూడ ఆరోగ్యం ఎలా ఉందో వాటిని, పేడను చూసి తెలుసుకోగలిగే అవగాహన రైతుకు ఉండాలి. టీకాలు షెడ్యూలు ప్రకారం వేసుకుంటూ.. మూడేళ్ల వరకు దూడలను కనిపెట్టుకొని ఉండాలి. ఈనిన తర్వాత 90 రోజుల్లో ఆవును కట్టించాలి. ఏడాదికో దూడ పుట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెయిరీ రంగంలో నష్టాలకు ఆస్కారమే ఉండదు. 

గంగి గోవు నెయ్యిలో ‘కెరోటిని’ 3.2%
రోజుకు 240 లీటర్ల పాల దిగుబడి వస్తోంది. ఉదయం పూట పాలను విజయవాడలో ఇంటింటికీ (లీ. రూ. వంద) పంపుతున్నారు. సాయంత్రం పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయ బద్ధంగా వెన్న తీస్తారు. 40 డిగ్రీలకు మించని వేడితో కాచి నాణ్యమైన నెయ్యినిæతయారు చేస్తున్నారు (కిలో రూ. 2,700 – 3 వేలు). ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. నిబంధనల మేరకు 3 నెలలకోసారి పాలు, నెయ్యిలకు లాబ్‌ పరీక్షలు చేయిస్తారు. పాలలో ఎస్‌.ఎన్‌.ఎఫ్‌. 8–8.5%, కొవ్వు 4–4.5% వస్తుంటాయి. నెయ్యిలో ఇతర పౌష్టికాంశాలతో పాటు ‘కెరోటిని’ 3.2% ఉంటుంది. మనిషి దేహానికి విటమిన్‌ ‘ఎ’ సమృద్ధిగా సమకూరేందుకు ఇది దోహపడుతుంది. ఇది గంగి గోవు నెయ్యిలోనే ఉంటుంది. గేదె నెయ్యిలో ఉండదు అన్నారు రవి. మజ్జిగను దూడలకు కుడితిలో పోస్తారు. పుల్ల మజ్జిగను పంటలపై అవసరం ఉన్నప్పుడు పిచికారీ చేస్తారు.  

ఆవుతో రోజూ మాట్టాడాలి!
నాటు ఆవులు సున్నితంగా ఉంటాయి. కొట్టకూడదు. ముల్లుగర్రతో పొడవ కూడదు. తిట్ట కూడదు. ముక్కుతాడు, సిగమారు వెయ్యకూడదు. రైతు రోజూ 4–5 గంటలు ఆవులతో ఉండాలి. పేరుతో పిలుస్తూ ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నిమరాలి. ఆవులతో మమేకం కాగలగాలి. మేత కన్నా ఈ ప్రేమ ముఖ్యం. ఇలా చేస్తుంటే ఆవుపై వత్తిడి ఉండదు. పాల దిగుబడి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలూ పెద్దగా రావు. కష్టపడే తత్వం ఉన్న రైతుకు నాటు ఆవుల గోశాల సంతృప్తిని, లాభాలను అందిస్తుంది. ఏ పేరు గల ఆవు ఎప్పుడు చూడి కట్టింది, ఏ రోజు ఎంత పాలిచ్చింది, ఆరోగ్య స్థితిగతులు.. అన్నీ  రైతు స్వయంగా రోజూ డైరీలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఏయే మార్పులు, చేర్పులు చేసుకోవాలో అర్థమవుతుంది. ఆవు ఆరోగ్య రక్షణ, మేత–దాణా లభ్యత, దూడల పోషణ, వత్తిడి లేని సంరక్షణ పద్ధతులు.. ఇవే నాటు ఆవు గోశాలల సక్సెస్‌ మంత్రాలు. గోశాలలో ఉన్న ఆవుల్లో మూడో వంతు ఆవులు రోజుకు 10 లీటర్ల పాలిచ్చేలా ప్లాన్‌ చేసుకోవాలి. లీటరుకు రూ. 50 ధర లభిస్తే చాలు రైతు నిలబడతాడు. ఏపీ ప్రభుత్వ గో పుష్టి పథకం రైతులకు చాలా ఉపయోగకరమైనది. గోశాల వల్ల ఆర్థిక పుష్టితో పాటు సమాజంలో ఎంతో పెద్ద వారి నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నాను. భార్యా పిల్లల తోడ్పాటు నా విజయానికి మరో ముఖ్య కారణం.  
– వల్లూరు రవి కుమార్‌ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు,  పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా,ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు.

నాటు ఆవుల్లో గంగి గోవులు వేరు..
దేశీ జాతుల ఆవుల్లోనూ అన్నీ శ్రేష్టంగా ఉండవంటారు రవి. 100% సకల సద్గుణాలు కలిగిన ఆవును గంగి గోవు అంటారు. విశాలమైన గంగడోలు, మంచి మోపురం, సాధు స్వభావం, మనిషిని గుర్తుపట్టే నైజం.. ఈ లక్షణాలు 100% ఉంటే ‘గంగి గోవు’. ఈ లక్షణాలు 50–65% ఉంటే ‘గోవు’. ఈ లక్షణాలు అసలు లేకపోతే ‘ఆవు’ మాత్రమేనని రవి అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement