సంపద అంటే చాలామంది దృష్టిలో, భవంతులు, పొలాలు. మరికొందరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. ఇంకొందరి భావనలో వాహనాలు, ఇళ్ళ స్థలాలు. కషీవలుడికి పంట, పశువులు, పండితుడికి జ్ఞానం... ఇలా సంపదను ఎన్నో రకాలుగా భావించి నిర్వచించవచ్చు. ఇది లౌకిక దృష్టి, సహజమైనది. ఆ రకమైన సంపద మన జీవనానికి అవసరమైనది. అయితే, సంపదంటే కేవలం ఇదే కాదు, ఈ భావనలకు లేదా మరికొన్ని ఇటువంటి భావనలకే ఈ మాట అర్థాన్ని పరిమితం చేయలేం. ఇది అర్థమయితేనే దాని లోతైన, విస్తృతార్థం బోధపడుతుంది.
ఇహపరమైన సంపద ఏ రూపంలో ఉన్నా, తరతరాలకు తరగనిదైనా ఎవరి దగ్గర ఉన్నా వారికి తృప్తి అనేది ఉండాలి. తమ శక్తి మేరకు కూడబెట్టామన్న ఆలోచన రావాలి. ఇంకా ఎక్కువ పొందాలి అన్న తీవ్రమైన కోరిక కూడదు. అది ఉన్నవారు ప్రశాంతతకు దూరమవుతారు. అపార సంపన్నులైనా పరిమిత ప్రాథమిక అవసరాలతో, కోరికలతో నిరాడంబర జీవితం గడపగలగాలి. తమ తోటి వారికి ఆర్ధిక సహాయం చేయగలిగే దృష్టి రావాలి. ఆపన్నులకు చేయాత నివ్వాలన్న భావన రావాలి. ఇలా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన నిజమైన సంపద. ఈ తృప్తి, నిరాడంబర జీవితం, పక్కవారిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఎంత పేదవారైనా ఐశ్వర్యవంతులే. ఆ ఆలోచన లేని వారు ఎంత ధనవంతులైనా అభాగ్యులే.
గురువుల నుండి నేర్చుకున్న విద్యకు మెరుగు లు దిద్ది మన పరిశీలనా దృష్టితో దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఇతరులకు అందివ్వగలగాలి. అపుడు అదెంతో సుసంపన్నమవుతుంది. ఇలా గురువులే కాదు ఇతరులూ చేయవచ్చు. గురువుల జ్ఞానం లేదా పాండిత్యం వారి శిష్యప్రశిష్యుల ద్వారా సర్వవ్యాపితమై అ దేశం జ్ఞాన సంపదగా నిక్షిప్తమవుతుంది.
‘మిడాస్ టచ్’ అనే కథలో ఒక రాజు తను ముట్టుకున్నది ప్రతిది బంగారంగా మార్చగల వరం పొందాడు. ఇక తన ఆనందానికి అవధులే లేవనుకుంటూ తన రాజభవనంలోని ప్రతి దానిని ముట్టుకుని హేమమయం చేసుకున్నాడు. తను తినే ఆహారం, తాగే మంచి నీరు, చివరకు తన కూతురు బంగారు విగ్రహంగా మారి పోవటం చూసి నిశ్చేష్టుడై, తన వరాన్ని వెనుకకు తీసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. నిజమైన ప్రేమ, అనుబంధాలు ముఖ్యమైన వని, అవే నిజమైన సంపదని గ్రహించాడు.
నిజమైన సంపద ఇహపరమైనది కాదు. దానిని మన భౌతిక సంపదతో కొలవలేం. మన వ్యక్తిత్వం, గుణశీలత, మానవీయతలను మన ముందు తరాలవారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. అదే నిజమైన సంపద.
ఒక దేశంలోని అద్భుత కట్టడాలు సృజనశీలురు వారి అపురూప సృష్టి, సంగీత, సాహిత్య ప్రవాహాలు, శిల్ప సంపద, జీవనవిధానం, ఆహారం, నాట్యం, చలనచిత్రాలు, శాస్త్రవేత్తల అద్భుత మేధస్సు.. వీటి కలయిక ఆ దేశ సంస్కృతిగా భావన చేస్తారు. ఈ సంస్కృతి ఆ దేశ సంపదవుతుంది. వీటికి మనం జత చేయవలసిన అంశాలు ఆ దేశ ప్రజల నీతి, నిజాయితీ, నైతిక వర్తన, నిబద్ధత, వ్యక్తిత్వం, వారి ఆలోచనా తీరు. ఇవి వారికి వారసత్వసంపదగా వచ్చిన సంస్కృతిని మరింత ఉదాత్తంగా చేస్తుంది.
ఇహపరమైన సంపదే కాకుండా ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన చక్కని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆలోచనలు. మనల్ని సక్రమమార్గంలో పయనింపచేసే పథాలు. మనలోని అంతర్గత శక్తులకు సరైన ఆకృతి వీటివల్లే వస్తుంది. ఆలోచనలు మనిషి వ్యక్తిత్వ వికాసాన్నే కాదు సమాజ, దేశ వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దేశ ప్రజల సక్రమ ఆలోచనా సరళి దేశ సంపదగానే భావించాలి.
– బొడ్డపాటి చంద్రశేఖర్, అంగ్లోపన్యాసకులు
Comments
Please login to add a commentAdd a comment