‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు!
ఒక మహిళ దుబాయ్‌కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది.
కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్‌పెట్ స్టోరేజ్ జార్‌లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్‌లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది.
∙∙
బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్
‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది.
∙∙
శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్‌మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది!
Comments
Please login to add a commentAdd a comment