పత్రికల్లో పజిల్స్ వస్తుంటాయి. దారి చూపండి.. రంగులు వేయండి. ఆరు తేడాలను గుర్తించండి. ఖాళీలు నింపండి. అన్నీ.. చిన్నపిల్లలు చేసేవి. వీళ్లూ చిన్నపిల్లలే.. టెన్త్ పిల్లలు. స్పేస్ ఇండియా వీళ్లకో పెద్ద పజిల్ ఇచ్చింది. ‘కనుక్కోండి చూద్దాం?’ అంది. ఆ పజిల్‌నీ పూర్తి చేశారు! కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టి.. ‘కనుక్కున్నాం చూడండి’ అన్నారు!
పైన అంతరిక్షంలో అనేకం తిరుగుతుంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు! నక్షత్రాలు కూడా ఉంటాయి కానీ వాటిని ‘తిరుగుతున్నాయి’ అనకూడదు. వాటి దారి వేరే. సూర్యుడిలా సొంత రూట్‌లో ప్రయాణిస్తూ ఉంటాయి. అదొక మర్మదేశం. దేశం అంటే చిన్నదైపోతుంది. అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’. ఆదీ అంతమూ తెలియని రహస్యం. వాటిల్లో కొన్ని శాస్త్ర పరిశోధకులకు మాత్రమే కనిపించేవి. మరికొన్ని మామూలు కంటికి కూడా కనిపించేవి. కొన్ని రోజులుగా డాబాలపై నుంచి ‘నియోవైజ్’ అనే తోకచుక్క కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ తోకచుక్కను వట్టి కంటితో చూడగలిగాం. దాదాపు 5 కి.మీ. పొడవున ఉన్న నియోవైజ్ భూమికి పది కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కూడా రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున పైకి తేలుతోంది. మళ్లీ 6,766 ఏళ్ల తర్వాతే నియోవైజ్ కనిపించడం!
ఇప్పుడిక ‘నియోవైజ్’ తోక చుక్కను మించిన అద్భుతంలోకి వద్దాం. మనలాగే రోజూ ఆ తోకచుక్కను చూస్తూ, ఆశ్చర్యపడవలసిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ తోక చుక్కను కూడా దాటిపోయి, ఆకాశంలో ఓ లఘు గ్రహాన్ని (ఆస్టరాయిడ్) కనిపెట్టారు! ఆ ఆస్టరాయిడ్ వీళ్ల కళ్లలో పడింది భూకక్ష్యలో ఉండి కాదు. అంగారకుడి చుట్టూ తిరుగుతూ!! నియోవైజ్ తోక చుక్క గురించి ‘నాసా’ వాళ్లు ప్రపంచానికి వెల్లడించక ముందు నుంచే గత రెండు నెలలుగా వైదేహి, రాధిక అనే ఆ ఇద్దరమ్మాయిలు కొత్త గ్రహాల కోసం ఖగోళాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సవానీ చైతన్య విద్యాసంకుల్’లో టెన్త్ విద్యార్థినులు వాళ్లు. ‘ఆలిండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ భాగంగా గగనాన్ని గాలిస్తున్నప్పుడు ఆ ఆస్టరాయిడ్‌పై వీళ్ల దృష్టి పడింది! ‘పాన్ స్టార్స్’ అనే టెలిస్కోప్‌లో పరిశీలిస్తూ ఇద్దరూ ఒకేసారి అంగారకుడి కక్ష్యలో ఆస్టరాయిడ్‌ను గుర్తించారు.
అంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఈ అమ్మాయిల చేతికి ఎలా వచ్చింది? ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐజక్) అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థ, టెక్సాస్‌లోని హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వాటితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని ‘స్పేస్ ఇండియా’ (హర్యానా) ఈ అన్వేషణ కోసం.. అంతరిక్ష పరిజ్ఞానం, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల నుంచి ఆహ్వానించి, పోటీ పరీక్ష నిర్వహించి వైదేహి, రాధికలను ఎంపిక చేసుకుంది. భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కనిపెట్టడం సెర్చ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. కరోనా సమయం కాబట్టి వీళ్ల ఈ అన్వేషణ అంతా ఇంటి నుంచే జరిగేలా స్పేస్ ఇండియా ఏర్పాట్లు చేసింది. అంతకుముందే అన్వేషణ విధానాలలో శిక్షణ ఇచ్చింది.
అంతరిక్షంలో మొదట వీళ్లు దాదాపు ఇరవై ఖగోళ పదార్థాలేవో గుర్తించారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్స్ కాదు. చివరికి అసలైన ఆస్టరాయిడ్ కంటికి చిక్కింది. అయితే అది ఆస్టరాయిడేనా?! నిర్థారణ కోసం ఆ లోకేషన్‌ని ‘స్పేస్ ఇండియా’ నాసాకు పంపింది. ‘ఎస్.. ఆస్టరాయిడే’ అంది నాసా. తాత్కాలికంగా ఆ ఆస్టరాయిడ్‌కు హెచ్.ఎల్.వి.2514 అనే పేరు పెట్టింది. దాని కక్ష్యను కూడా నాసా గుర్తించాక (ఇందుకు సంవత్సరాలు పడుతుంది) ఆ ఆస్టరాయిడ్‌కు పేరు పెట్టే అవకాశాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇస్తుంది! హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిల్లర్ పంపిన ప్రత్యేక అభినందనలలో వైదేహి రాధిక ఇప్పుడు మేఘాలలో విహరిస్తున్నారు. యు.ఎస్.లోని నాసా వరకు ఎగరాలన్నది వారి కోరిక. వైదేహి తండ్రి వస్త్రవ్యాపారి. రాధిక తండ్రి కంప్యూటర్స్ విడిభాగాలు దుకాణం. కూతుళ్లు ఇంత సాధించాక తల్లిదండ్రులు గాలితో తేలిపోకుండా ఉంటారా!
Comments
Please login to add a commentAdd a comment