ఎంటర్‌ ది డ్రాగన్‌ | Special Story About Megan McArthur | Sakshi
Sakshi News home page

ఎంటర్‌ ది డ్రాగన్‌

Published Sat, Aug 8 2020 1:45 AM | Last Updated on Sat, Aug 8 2020 3:07 AM

Special Story About Megan McArthur - Sakshi

నడిపించడం పెద్ద మార్షల్‌ ఆర్ట్‌. టీమ్‌నైనా.. గేమ్‌నైనా.. వార్‌నైనా..  వెహికిల్‌నైనా.. ఎంటరింగ్‌ ది డ్రాగన్‌.  డ్రాగన్‌కు ఎదురెళ్లడమే. వెళ్లడమే కాదు.. సవారీ చేయబోతున్నారు మెగాన్‌! అంతరిక్షం పైకి ‘డ్రాగన్‌’ని లేపబోతున్నారు. 

దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించేంత తీరిక ఉండదు ఎలాన్‌ మస్క్‌కి. ప్రపంచంలోని తొలి పదిమంది సంపన్నుల జాబితాలో ఏ „ý ణానికి ఆ క్షణం పైకీ కిందికీ అవుతుండటంతోనే ఆయనకు రోజు సరిపోతుంటుంది. అయితే ఈ ఏడాది మే నెల 30వ తేదీ నుంచి ఆయన ఆలోచనల్లోకి దేవుడు వచ్చిపోతున్నాడు! ఫ్లారిడా నుంచి ‘డ్రాగన్‌’ అనే వ్యోమనౌక ఇద్దరు నాసా మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి వదిలిన రోజు అది. ఆ నౌకను తయారు చేసింది ‘స్పేస్‌ ఎక్స్‌’ అనే అమెరికన్‌ ప్రైవేటు కంపెనీ. ఆ కంపెనీ యజమానే ఎలాన్‌ మస్క్‌. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఆ ఇద్దరినీ ఆగస్టు 2న డ్రాగన్‌ క్షేమంగా భూమి మీదకు దింపాక చూడాలి మస్క్‌ ఆశ్చర్యం, ఆనందం! ‘‘నేను భక్తిపరుడిని కాదు.

అయితే ఇందుకోసం దేవుణ్ణి ప్రార్థించాను’’ అన్నాడు మస్క్‌.. ప్యారాచ్యూట్‌ల సహాయంతో డ్రాగన్‌ సుర క్షితంగా ఫ్లారిడా సముద్ర జలాలపై దిగగానే! నాసా కాకుండా, ఒక ప్రైవేటు వ్యోమనౌక సాధించిన తొలి ఘనత ఇది. చరిత్ర కూడా! అరవై ఐదు రోజుల పాటు భూకక్ష్యలోని ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ లో ఉండి వచ్చిన ఆ ఇద్దరు వ్యోమగాములు బాబ్‌ బెంకెన్‌ (50), డగ్‌ హర్లీ (53). డ్రాగన్‌–2 మిషన్‌ మళ్లీ వచ్చే ఏడాది మార్చి–మే ల మధ్య మొదలవుతుంది. అందులోనూ ఇద్దరు ఉంటారు. అయితే ఈసారి ఒక మహిళ. ఒక పురుషుడు. ఆ స్పేస్‌ క్రాఫ్ట్‌ను నడిపేది మాత్రం మహిళ. ఆమె పేరు మెగాన్‌ మెకార్థర్‌ (48). నానా వ్యోమగామి. ప్రసిద్ధ ఓషనోగ్రాఫర్‌. సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు. బాబ్‌ బెంకెన్‌ భార్య. నాసాలో వీళ్లిద్దరూ ఇరవై ఏళ్ల క్రితం బ్యాచ్‌మేట్‌లు. మెగాన్‌ గత ఏడాదే నాసా ‘ఆస్రోనాట్‌ ఆఫీస్‌’ డిప్యూటీ చీఫ్‌ అయ్యారు. 

ఒక వ్యోమనౌకు పైలట్‌గా ఉండటం మెగాన్‌ మెకార్థర్‌కు ఇదే మొదటిసారి అయినప్పటికీ, అంతరిక్షంలోకి వెళ్లడం మాత్రం ఇది రెండోసారి. భూ నిమ్నకక్ష్యలో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) 1990 నుంచి పరిభ్రమిస్తున్న ‘హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ మరమ్మతుల కోసం 2009లో ‘లీడ్‌ మిషన్‌ స్పెషలిస్టు’గా పదమూడు రోజులు స్పేస్‌లో ఉండి వచ్చారు మెగాన్‌. చివరిసారి హబుల్‌ని టచ్‌ చేసి వచ్చిన వ్యోమగామి కూడా మెగానే! అంటే ఆ తర్వాత హబుల్‌కు మరమ్మతులు రాలేదని. అంతా సవ్యంగా ఉంటే 2040 వరకు హబుల్‌ పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడీ డ్రాగన్‌ 2 మిషన్‌తో మెగాన్‌ రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లినట్లవుతుంది. ఆమెతోపాటు షేన్‌ కింబోర్గ్‌ (స్పేస్‌ కమాండర్‌), మిషన్‌ స్పెషలిస్టులు అకిహకో, థామస్‌ పెస్‌క్వెట్‌లు ఉంటారు. నాసా, స్పేస్‌ ఎక్స్‌ల ఉమ్మడి మిషన్‌ ఇది. ‘‘స్పేస్‌ క్రాఫ్ట్‌ను నడపబోతున్నాను అనే ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని మెగాన్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. నాసాలో ఇప్పటికే మెగాన్‌ పైలెట్‌ శిక్షణ మొదలైంది. 

కాలిఫోర్నియాలో మెగాన్‌ మెకార్థర్‌ నివాసం. 2000 లో ఆమె నాసా వ్యోమగామిగా ఎంపిక అయ్యారు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఆస్ట్రోనాట్‌ అవాలని ఆమెకు ఉండేది. కానీ అది కష్టమైన సంగతని కూడా ఆమెకు తెలుసు. ఎంత కష్టమైతేనేం కోరుకున్న దారిలోకే వచ్చేశారు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఓషనోగ్రఫీలో డాక్టరేట్‌ చేశారు. నక్షత్రాలు, లేదంటే సముద్ర జలాలు. చివరికి నింగీ నేలా రెండూ ఆమెకు ఆహ్వానం పలికాయి. ఇప్పుడు పైలెట్‌గా ఆహ్వానం! ఈసారి మాత్రం స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ ఆరు నెలలు అంతరిక్షంలోనే ఉంటుంది. ఆమె భర్త బాబ్‌ బెంకెన్, ఆరేళ్ల కొడుకు థియోడర్‌లకు అదేమీ పెద్ద కాలమూ, దూరమూ కాకపోవచ్చు. వ్యోమగాముల ఫ్యామిలీ కనుక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement