భరించలేని సమస్యలు ఎన్ని ఎదురైనా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే వివిధ కారణాల మూలంగా కష్టాల కడలిలో కొట్టుకుపోయిన మన కల లేదా లక్ష్యాన్ని చేరుకోవచ్చని 29 ఏళ్ల హైలీ ఆర్కేనో చెబుతోంది.
అమెరికాకు చెందిన హైలీ ఆర్కేనోకు చిన్నప్పుడు ఓ పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా ఆస్ట్రోనాట్ కావాలని ఆమె కలలు కనేది. కానీ హైలీకీ పదేళ్లు ఉన్నప్పుడు విధి కన్నెర్ర చేయడంతో బోన్‌క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా హైలీ ఫీమర్ బోన్ (తొడ ఎముక) ను తొలగించి ఆ స్థానంలో రాడ్లను అమర్చారు. ప్రస్తుతం హైలీ కృత్రిమ మోకాలి సాయంతో నడవగలుగుతోంది. దీంతో వ్యోమగామి అవ్వాలన్న తన కల కరిగిపోయిందనుకుంది హైలీ. కానీ ఈ ఏడాది చివర్లో స్పేస్‌ఎక్స్ చేపట్టబోయే ‘సివిలియన్ స్పేస్ ఎక్స్ మిషన్’లో రెండో క్రూ మెంబర్‌గా హైలీ ఎంపికైనట్లు బిలియనీర్ జారెడ్ ఐజక్మాన్ ప్రకటించారు. దీంతో హైలీ చిరకాలం నాటి కల చిగురులు తొడిగింది. అన్నీ సక్రమంగా జరిగితే అతిచిన్న వయసు(29)లో స్పేస్‌లోకి వెళ్లిన మొదటి అమెరికన్‌గా, తొలి ప్రోస్తెటిక్ స్పేస్ ట్రావెలర్‌గా హైలీ చరిత్ర సృష్టించనుంది.
పదేళ్ల వయసులో హైలీ ఏ హాస్పిటల్‌లో అయితే బోన్‌క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందో అదే హాస్పిటల్‌లో అంటే ‘సెయింట్ జుడే చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్’లో ఆంకాలజీ యూనిట్‌లో అసిస్టెంట్ ఫిజీషియన్‌గా చేరింది. చిన్నతనంలో కాలిని కోల్పోయినప్పటికీ ఆమె అధైర్యపడకుండా వైద్యవిద్యను అభ్యసించి మళ్లీ అదే ఆసుపత్రిలో డాక్టరుగా సేవలందించడం ఎంతో గొప్ప విషయం. ఈ కారణంతోనే ఐజక్మాన్ హైలీని తన క్రూలో రెండో సభ్యురాలుగా చేర్చుకున్నారు. అలా జుడే హాస్పిటల్‌లో చేరడం వల్ల హైలీకి తన చిరకాల కోరిక తీరే మార్గం దొరికింది. ఆస్ట్రోనాట్‌గా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ స్పేస్‌లోకి వెళ్లే గోల్డెన్ చాన్స్ హైలీని వెతుక్కుంటూ రావడం విశేషం.
ప్రముఖ స్పేస్ ఎక్స్ సంస్థ త్వరలో లాంచ్ చేయబోయే డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో నలుగురు పర్యాటకులను పంపనుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఓ నాలుగురోజుల పాటు భూమి చుట్టూ తిరిగి మళ్లీ భూమిమీదకు వస్తుంది. ఈ మొత్తం మిషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని బిలియనీర్ అయిన 38 ఏళ్ల జారెడ్ ఐజక్మాన్ భరిస్తున్నారు. పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తోన్న ‘షిఫ్ట్ ్ట4 పేమెంట్స్’ కంపెనీకీ ఆయన వ్యవస్థాపక సీఈఓగా వ్యవహరిస్తున్నారు. సివిలియన్ పైలట్ అయిన ఐజక్మాన్ నలుగురు మాత్రమే వెళ్లే ఈ స్పేస్ క్రాఫ్ట్ లో తనతోపాటు మరో ముగ్గురిని సొంత ఖర్చుతో తీసుకెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురు సభ్యుల కోసం ఆయన వివిధ రకాల పద్ధతుల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైలీని రెండో క్రూ మెంబర్‌గా ఎంపిక చేశారు.
‘‘హైలిన్ చిన్నతనంలోనే ఎంతో కష్టమైన సవాళ్లను ఎదుర్కోని ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఆమె స్పేస్‌లోకి వెళ్లి.. ప్రపంచానికే స్ఫూర్తిదాయక సందేశంతోపాటు మరెంతోమందికి ఆదర్శంగా నిలవనుంది. హైలీ అనేక కష్టాలు ఎదుర్కొని నేడు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోనుండటం గొప్ప విశేషం. అందుకే ఈ అమ్మాయి అంతరిక్షానికే ఓ అద్భుతం’’ అని ఐజక్మాన్ చెప్పారు.
‘‘నిజాయితీగా చెప్పాలంటే ఆస్ట్రోనాట్స్ తీసుకునే ఎటువంటి శిక్షణనూ నేను తీసుకోలేదు. అయినా నాకు స్పేస్‌లోకి వెళ్లడానికి ఎలాంటి భయం లేదు. బహుశా చిన్నతనం నుంచే క్యాన్సర్‌తో పోరాడడం వల్ల నాకు ఈ ధైర్యం వచ్చి ఉండవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ మిషన్‌లో నన్ను ఎంపిక చేసేవరకు నేను ఎప్పుడూ స్పేస్‌లోకి వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నవారికే అవకాశం ఉంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్లకు కూడా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని సివిలియన్ స్పేస్ మిషన్ ఇస్తోంది. ఈ మిషన్ ఎన్నో విషయాలను మార్చేస్తూ.. క్యాన్సర్‌ను జయించిన నన్ను స్పేస్‌లోకి పంపుతూ నమ్మశక్యం కాని గౌరవాన్ని ఇస్తోంది’’ అని హైలీ సంతోషంతో చెప్పింది.
చదవండి: చంద్రుడి పైకి తొలి మహిళ!
చదవండి: నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
Comments
Please login to add a commentAdd a comment