అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు | NASA astronaut Kate Rubins Plans To Cast The Vote From The space | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు

Published Mon, Sep 28 2020 7:53 AM | Last Updated on Mon, Sep 28 2020 7:53 AM

NASA astronaut Kate Rubins Plans To Cast The Vote From The space - Sakshi

కేట్‌ రూబిన్స్‌ : స్పేస్‌ నుంచి భూమిపైకి  తిరిగి వచ్చినప్పుడు (2016 అక్టోబర్‌)

ఓటు వేయడం అంటే మనకేం కావాలో అడగడం మాత్రమే కాదు..  ఏం వద్దో కూడా చెప్పడం. అసలు ఓటే వేయకపోతే? ఏమైనా చేసుకొమ్మని  హక్కులన్నీ రాసివ్వడం! ఓటు హక్కుని కూడా!! మహిళల్నైతే అస్సలు.. మిస్సవద్దని అంటారు కేట్‌ రూబిన్స్‌. తనైతే అంతరిక్షం నుంచే ఓటు వేయబోతున్నారు. 

మహిళలే మార్పు కోసం ముందుంటారు. మహిళలే మార్పు కోసం ముందుగా ఉద్యమిస్తారు. ఎందుకంటే మహిళలకే తమ స్థితిగతుల్ని మార్చుకోవలసిన అవసరాన్ని సమాజం ఎప్పుడూ కలిగిస్తూ ఉంటుంది. ‘సమాజం’ అని ఎక్కడో దూరాన్నుంచి చెప్పడం ఎందుకు గానీ, పురుషులు మారనందువల్లనే సమాజాన్ని మార్చే ప్రయత్నాలు మహిళలకు అవసరం అవుతుంటాయి. ఇంత ఉపోద్ఘాతాన్ని ఒక్కమాటలో కూడా చెప్పొచ్చు. ట్రంప్‌ ఉన్నారు. ఆయన్ని మార్చేయాలి. మనిషిని మార్చడం కాదు. అధ్యక్ష పదవి నుంచి మార్చేయాలి. మహిళలందరూ కలిస్తే ఆయన్ని మార్చడం సాధ్యం కావచ్చు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రాకపోతే! రాకపోయినా అదేమీ మార్పు కోసం ఏ ప్రయత్నమూ జరగకుండా పోయినట్లు కాదు. ఎవరి వంతు ప్రయత్నాలతో వారే కదా ఇంతవరకు మహిళలు ఒకటవుతూ మార్పును సాధించుకుంటూ వచ్చారు. చదవండి: (తొలిసారిగా అంతరిక్షంలో డీఎన్ఏ అమరిక)

అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌ కేట్‌ రూబిన్స్‌ తను ట్రంప్‌కి వ్యతిరేకమో అనుకూలమో చెప్పడం లేదు. అయితే తప్పక ఆమె తన ఓటును నవంబర్‌ 3 న జరిగే అధ్యక్ష ఎన్నికలో వేయబోతున్నారు. ‘ఇటీజ్‌ క్రిటికల్‌ టు పార్టిసిపేట్‌ ఇన్‌ ది డెమోక్రసీ’ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములం అవడానికి ఓటు వేయడం అత్యవసరం’ అని. ముఖ్యంగా మహిళలు తమ ఓటును మిస్‌ చేసుకోకూడదని కేట్‌ చెబుతున్నారు. ఓటర్‌ల జాబితాలో పేరుండీ ఓటు వేయడాన్ని మహిళలు తరచు మిస్‌ చేసుకోడానికి కారణం రాజకీయాల్లో వాళ్లకు ఆసక్తి లేకపోవడం అనుకోకండి. ‘మిస్‌’ చేసుకోవడం అంటే ఇక్కడి అర్థం.. భర్త చెప్పినట్లో, ఇంకొకరు చెప్పినట్లో ఫలానా అభ్యర్థికి ఓటేయడం. కేట్‌ రూబిన్స్‌కి ట్రంప్‌కి ఓటెయ్యాలని లేదనుకోండి. ఆమె భర్త మైఖేల్‌ మేగ్నాని ఆమెను ట్రంప్‌కే ఓటెయ్యమని చెప్పాడనుకోండి. అతడు చెప్పినట్లు కేట్‌ ట్రంప్‌కే ఓటేశారనుకోండి. అప్పుడు ఆమె తన ఓటును మిస్‌ అయినట్లు.

‘‘ఓటు వేయకుండా ఉండకూడదు, నచ్చిన వ్యక్తికి వేయకుండానూ ఉండకూడదు’’ అని కేట్‌ తరచు మహిళల్ని ప్రోత్సాహ పరుస్తుంటారు. ఈసారి కూడా ఎన్నికల సమయానికి ఆమె భూమి మీద ఉండబోవడం లేదు. అక్టోబర్‌ మధ్యలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మళ్లీ తిరిగి రావడం వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే. అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ ద్వారా ఆమె ఓటేస్తారు. ఆమె ఒక్క ఓటు కౌంట్‌ కాకపోతే అధ్యక్ష అభ్యర్థులకు వచ్చేది, పోయేది లేకపోవచ్చు. అయితే ఆమె ఒక్క ఓటూ అధ్యక్షుడు ట్రంపా, బైడనా అనే హోరాహోరీ పోటీలో ఒక సంఖ్యలో భాగంగానైతే ఉంటుంది. ఆ భాగాన్నే.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడం అంటారు కేట్‌ రూబిన్స్‌. 

స్పేస్‌లోకి వెళ్లినప్పుడు ‘క్రూ’లో ఒకరైన వ్యోమగామి జెఫ్‌ విలియమ్స్‌తో నాసా స్పేస్‌ సూట్స్‌ మధ్య కేట్‌ రూబిన్స్‌.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా అంతరిక్షం నుంచే ఓటు వేశారు కేట్‌. ఆ ఏడాది నవంబర్‌ 8 న అధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి వారం ముందే  కేట్‌ భూమి మీదకు తిరిగి వచ్చేసినప్పటికీ ‘ఎర్లీ ఓటింగ్‌’ సదుపాయంతో ముందే స్పేస్‌ నుంచి ఓటేశారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రోనాట్‌ తన  రెండో అంతరిక్షయానానికి సన్నద్ధం అయేందుకు మాస్కోలోని స్టార్‌ సిటీలో అక్కడ మరో ఇద్దరు పురుష కాస్మోనాట్స్‌తో కలిసి శిక్షణ పొందుతున్నారు. (ఆస్ట్రోనాట్‌ అన్నా, కాస్మోనాట్‌ అన్నా ‘వ్యోమగామి’ అనే అర్థం. అమెరికా ఆస్ట్రోనాట్‌ అంటుంది. రష్యా కాస్మోనాట్‌ అంటుంది). సూయెజ్‌ ఎం.ఎస్‌.–17 అనే వ్యోమనౌకలో రష్యాలోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ ముగ్గురూ అంతరిక్ష కేంద్రంలోకి బయల్దేరుతారు. ముగ్గురిలో ఒకరు కమాండర్‌.

ఇద్దరు ఫ్లయిట్‌ ఇంజనీర్‌లు. కేట్‌ ఇంజనీర్‌ నెం.2. అంతరిక్ష కేంద్రంలోని (ఐ.ఎస్‌.ఎస్‌.) ‘కోల్డ్‌ ఆటమ్‌ ల్యాబ్‌’లో వ్యోమగాముల హృదయనాళాలపై అంతరిక్ష వాతావరణ పీడన ప్రభావాల మీద కేట్‌ ఆరు నెలల పాటు పరిశోధనలు జరుపుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే... ఐ.ఎస్‌.ఎస్‌. విరామం లేకుండా మనుషులతో సందడిగా ఉండి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భం వస్తుంది! ఆమె అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ రెండో విడత వ్యోమగాములకు స్వాగతం పలుకుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే భూమి మీద అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారాన్ని పై నుంచి వీక్షిస్తారు. ఆమె ఓటు వేసిన అభ్యర్థి ఎన్నికయ్యారా, ఓటు వేయని అభ్యర్థి ఎన్నికయ్యారా అన్నది ఆమెకు తెలుస్తుంది. ఆమెకు మాత్రమే తెలుస్తుంది.              

స్పేస్‌లో 60వ మహిళ
కేట్‌ పూర్తి పేరు కేథ్లీన్‌ హ్యాలసీ కేట్‌ రూబిన్స్‌. నాసా వ్యోమగామి. కేట్‌ పుట్టింది కాలిఫోర్నియాలో. ఉంటున్నది టెక్సాస్‌లో. ఏడో తరగతి చదువుతున్నప్పుడే స్పేస్‌ క్యాంప్‌కు వెళ్లడానికి అవసరమైన డబ్బుల కోసం ఇంటి చుట్టుపక్కల పనీ పాటా చేసి, ఆ మేరకు సంపాదించుకున్నారు. స్పేస్‌ క్యాంప్‌ అంటే ఏం లేదు. అలబామాలో నాసా వాళ్ల అంతరిక్ష మ్యూజియం ఉంటుంది. అందులోని వింతలు–విశేషాలు చూసేందుకు వెళ్లే పిల్లల ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్‌. కేట్‌ (41) తన ముప్పయవ యేట నాసాలో ప్రవేశించారు. 2016లో స్పేస్‌లోకి అరవయ్యవ మహిళగా (ప్రపంచం మొత్తం మీద) అడుగు పెట్టారు.  కేట్‌ తర్వాత మరో ఐదుగురు మహిళలు ఐ.ఎస్‌.ఎస్‌.ను చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement