![Valentine's Day: Why Are Couples Called As Love Birds? - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/14/Happy-Valentines-Day-2024.jpg.webp?itok=XDgsjg-T)
ప్రేమికుల దినోత్సవం.. ఏదో పులకింతకు గురి చేసే పదం. పెళ్లయి ఏళ్లు గడిచినా, ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినా, సిచ్యుయేషనల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న లవ్‌బర్డ్స్ జీవితాల్లో ఈ రోజుకున్న ప్రత్యేకతే వేరు. అన్నట్టు ప్రేమికులను అందంగా వర్ణించాలంటే లవ్‌బర్డ్స్ అని ఎందుకు అంటాం. అసలు ఈ పోలిక ఎలా వచ్చింది? లవ్‌బర్డ్స్ గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇపుడు తెలుసుకుందాం.
అత్యంత ప్రాచుర్యం పొందిన అందమైన, తెలివైనచిలుక జాతికి చెందిన పక్షులే ఈ లవ్‌బర్డ్స్. ఈ చిన్న పక్షులు 100 సంవత్సరాలకు పైగా ఆఫ్రికన్ చిలుకలలో అత్యంత ప్రియమైన రకాల్లో ఒకటి. కొన్ని చిలుకలు మనుషులను అనుకరిస్తూ, మాట్లాడగలవు కానీ. లవ్‌బర్డ్స్ సాధారణంగా మాట్లాడవు. ఈలలు లేదా డోర్‌బెల్స్ అనుకరిస్తాయి. కానీ చాలా చిన్నప్పటినుంచీ నేర్పితే మాట్లాడుతాయిట.
లవ్‌బర్డ్స్‌లో రకాలు
లవ్‌బర్డ్స్‌లో తొమ్మిది వేర్వేరు ఉప-జాతులు ఉన్నాయి. వీటిలో దేనికవే వాటి ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. మాస్క్‌డ్ లవ్‌బర్డ్, బ్లాక్-చెంపల లవ్‌బర్డ్, ఫిషర్స్ లవ్‌బర్డ్, న్యాసా లవ్‌బర్డ్, స్విండర్న్ లవ్‌బర్డ్, రెడ్-ఫేస్డ్ లవ్‌బర్డ్, అబిస్సినియన్ లవ్‌బర్డ్, మడగాస్కర్ లవ్‌బర్డ్ , లవ్లీ పీచ్-ఫేస్డ్ లవ్‌బర్డ్ ఉన్నాయి. అయితే పసుపు, గ్రీన్, బ్లూ కలర్‌లో ఉండే లవ్‌బర్డ్స్ బాగా పాపులర్.
ప్రేమికులతో లవ్‌బర్డ్స్ అని పోలిక ఎందుకంటే
లవ్‌బర్డ్స్ చాలా చురుకైన పక్షులు. ప్రేమ పక్షులు సాధారణంగా 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జీవితాంతం ప్రేమలోనే మునిగి తేలతాయి. ఏకభాగస్వామితో మాత్రమే బలమైన ప్రేమబంధాన్ని కొనసాగిస్తాయి. ఒకదానికొకటి కొసరి..కొసరి తినిపించుకుంటూ,ఎపుడూ అచ్చిక బుచ్చిక లాడు కుంటూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి. ఒకవేళ జంట వీడితే డిప్రెషన్‌కు కూడా లోనవుతాయట.
జంట వీడితే తట్టుకోలేవు!
మనుషుల మాదిరిగానే, ప్రేమపక్షులు కూడా తమ భాగస్వామి లేదా జట్టు నుండి విడిపోయినప్పుడు నిరాశకు గురవుతాయి. ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. దీంతో దిగులుతో ఆహారం మానేసి చివరికి చనిపోవచ్చు కూడా. లవ్‌బర్డ్స్‌లో ఆడ, మగ తేడాను సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా మగవి ఆడవాటి కంటే పెద్దగా ఉంటాయి. సాధారణంగా నల్లటి రెక్కలున్న మగ ప్రేమపక్షికి ఎర్రటి ఈకల కిరీటం ఉంటుంది.
అంతేకాదు మేటింగ్ సమయంలో లవ్ బర్డ్స్ హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. దీంతోవాటిల్లో జెలసీ, దూకుడు తత్వంబాగా పెరుగుతుందిట. ఫలితంగా కొన్ని సందర్భాల్లో తగాదాలు, ఒక్కోసారి ఒకదాన్ని మరొకటి చంపుకునే దాకా పోతాయిట.
ప్రేమ పక్షులు ఏమి తింటాయి?
లవ్‌బర్డ్స్ చిన్ని చిన్ని గింజలు, విత్తనాలు, గడ్డి, పండ్లు , కొన్ని రకాల కూరగాయలను తింటాయి.
చాలా ఇళ్లలో రంధ్రాలు ఉన్న మట్టి కుండల్లోనే లవ్‌బర్డ్స్ ని ఎందుకు పెంచుతారో ఎపుడైనా ఆలోచించారా?
ప్రేమ పక్షులు.. అడవిలో చెట్లు, రాళ్ళు, పొదల్లోని రంధ్రాలలో నివసించడం వీటికి అలవాటు. అడవులు తగ్గిపోవడంతో భవనాల్లోని రంధ్రాల్లోగూడు కట్టుకుంటాయి. అందుకే ఇళ్లలో కూడా సహజంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆ ఏర్పాటు అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment