మనం ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో, ఆవశ్యకమో తనని పఠిస్తూండే శ్లోకంలో ఇమిడిపోయి మహాగణపతి మనకి అద్భుతంగా తెలియజేసాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలు....
సుముఖ శ్చైకదంత శ్చ కపిలో గజకర్ణికః
లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
అష్టా వష్టౌ చ నామాని యః పఠే ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా!
సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్య న జాయతే
అంటూ వినాయకుని గురించి చెప్పే నామాలు 8. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసిందని చెప్పేందుకే అష్టౌ (8), అష్టౌ(8) చ (కలిపి) నామాన్ని అని కన్పిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణిస్తూ, ఇలాంటి గుణాలని మనం ఆయననుండి నేర్చుకోవాలనే యదార్థాన్ని తెలుసుకుందాం!
1. సుముఖః: సు–ముఖః అంటే ఎవరు ఏ కోరికని తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖంగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలానూ) ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరికి పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్యమధ్యలో ‘ఏం చెప్పా?’ వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు.
అలాంటివాళ్ళకి వినాయకుడు చెప్పాడు... వినదలిస్తే సుముఖునిగా ఉండి విను లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండడం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. ఇలా ముఖమనే మాటకి నోరు అనే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి ‘నొప్పించకుండా మాట్లాడేవాడు’ అనేది ఈయనకున్న మరో చక్కని గుణం. ఆ గుణం మనకి రావాలని ఆయన చెప్తున్నాడు.
2. ఏక+ దంతః: గజముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటి వాడు భారతగ్రంథమంతనీ తన బుద్ధిలో నిల్చుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన గణపతి పేరు చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన తప్పక రాస్తాను. అయితే నా రాతవేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పాలనే నియమాన్ని పెట్డాడు. దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ నేను చెప్పే ప్రతి అక్షరాన్ని నువ్వూ అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యధాలాపంగా రాయకూడదన్నాడు.
వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటి వానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో వీక్షించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకిలించి) గంటంగా చేసి మరీ రాసాడు. దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు అంటే పనిలో సహాయపడడం... మాట సహాయం చేయడం గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ళమీద నెట్టేలా సముఖంలో మాట్లాడడం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి.
3. కపిలః: రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’ మంటారు. ఇటు శివలక్షణమూ, అటు విష్ణువిధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు. దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైన నేరాన్ని చూస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడతాడా? ..’ అన్న తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే పని (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ, శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదేతీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ణి మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులు బాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి.
4. గజకర్ణికః : ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై పదానికి అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకన్నా ఆ చిన్నకళ్లు నేలమీద పడ్డ బట్టలు కుట్టే సూదిని కూడా గుర్తించగలవు. అలాగే ఆ చెవులు కూడా దూరంగా పాము బుసకొడుతుంటే వినగలిగినంతటి శక్తివంతమైనవి. గజకర్ణికః నామం ద్వారా చెవులవరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి. గణపతి చెప్పేదేమంటే, వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నింటినీ నమ్మడం సరికాదని. అసలు చెవి దగ్గరకి ఎవరినీ చేరనీయవద్దనీ కూడ.
5. లంబోదరః: పెద్దబొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. “లంబ’ మనే మాటకి వేలాడుతున్న అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది.
‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటిని తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా “కడుపులో దాచుకోగలగడమనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట.
6. వికటః: కటకమంటే చెక్కిలి. ఏనుగురూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి అనేది వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట.
7. విఘ్నరాజః : ప్రారంభించిన పని– ఇక ఎప్పటికీ ముడిపడనే పడదన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం. రాజుకి చతురంగ బలాలు (పదాది– అశ్వ– గజ– రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం, నలుగురి సహాయాన్ని అర్థించడం, నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ్త ఉండిపోవడం సరికాదని గణపతి చెప్తున్నాడన్నమాట.
8. గణాధిపః: యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ రాక్షస, దేవ .... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం. లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏకగ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దీనిద్వారా అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట.
మరో విశేషమేమంటే పై కన్పిస్తున్న అన్ని గణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది. అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి.
– డా. మైలవరపు శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment