థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్‌, హోటళ్లలో ఓన్లీ వెజ్‌! | Visit Thai Vegetarian Festival To Find Vegan Food | Sakshi
Sakshi News home page

థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్‌, హోటళ్లలో ఓన్లీ వెజ్‌!

Published Mon, Oct 23 2023 10:53 AM | Last Updated on Mon, Oct 23 2023 3:43 PM

Visit Thai Vegetarian Festival To Find Vegan Food - Sakshi

మనకు దసరా నవరాత్రులు జరిగే సమయంలోనే థాయ్‌లాండ్‌లో ఏటా శాకాహార సంబరాలు జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 15న మొదలైన ఈ సంబరాలు అక్టోబర్‌ 24న ముగుస్తాయి. ఈ సంబరాలను ‘జయ్‌’ ఉత్సవాలు అని పిలుస్తారు. ఒకానొకప్పుడు మలయ్‌ సమ్రాజ్యాన్ని పరిపాలించిన తొమ్మిదిమంది చక్రవర్తుల పేరిట ఈ ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే ఆచారం మొదలైనట్లు చెబుతారు. థాయ్‌లాండ్‌లోని మిగిలిన ప్రాంతాల కంటే ఫుకేత్‌ నగరంలో ఈ సంబరాలు భారీ స్థాయిలో జరుగుతాయి.

థాయ్‌లాండ్‌లోనే కాకుండా మలేసియా, ఇండోనేసియా, సింగపూర్‌లలో పెరనాకన్‌ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ ఈ సంబరాలు జరుగుతాయి. తావో మత ఆచారాల ప్రకారం తొమ్మిదిరోజుల పాటు ఈ సంబరాలను ఘనంగా జరుపుకొంటారు. ఈ తొమ్మిదిరోజులూ మాంసాహారాన్ని ముట్టరు. పూర్తిగా శాకాహారమే భుజిస్తారు. ఈ సందర్భంగా దీక్షపూనే వారిలో కొందరు నాలుకకు, బుగ్గల్లోను పదునైన సూదులు, కత్తులు వంటి ఆయుధాలను గుచ్చుకుని ఊరేగింపుల్లో పాల్గొంటారు.

ఊరేగింపులు జరిగే వీథుల్లోను, ప్రార్థన మందిరాల వద్ద ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆహారశాలలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహారశాలల్లో చైనీస్‌ సంప్రదాయ శాకాహార వంటకాలను విక్రయిస్తారు. ఈ సంబరాలు జరిగే తొమ్మిదిరోజుల్లోనూ థాయ్‌లాండ్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా శాకాహార వంటకాలనే విక్రయిస్తాయి. పూర్తి శాకాహారమే విక్రయిస్తున్నట్లుగా హోటళ్లు, రెస్టారెంట్లపై పసుపు రంగు జెండాలను ఎగురవేస్తాయి. 

(చదవండి: తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement