పొరుగూరుకు వెళ్లాలంటేనే అక్కడ ఆహారం ఎలా ఉంటుందో అని సందేహ పడతాం. అలాంటిది విదేశాలకు ప్రయాణం అంటే..!!
ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచే ఆహారపదార్థాల ఎంపిక పట్ల రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వెళ్లబోయే
ప్రదేశాలలో ఎలాంటి పదార్థాలు లభిస్తాయి.. ఎలాంటివి
నిరభ్యంతరంగా తీసుకోవచ్చు..
అని సందేహ పడుతుంటారు. వంటకాల పట్ల కొంత అవగాహన పెంచుకుంటే ఆహారం విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మన దేశీయులు తరచూ సందర్శించే దేశాలలో థాయ్‌లాండ్, మలేసియా, చైనా, జపాన్, మెక్సికో, ఇటలీలు.. ప్రధానంగా ఉంటుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల వంటకాల జాబితాలో మన దేశంతో పాటు పైన చెప్పిన దేశాల రుచులకూ స్థానం ఉంది. మనకు పరిచయం ఉండే దేశాల వంటకాల గురించిన సమాచారం ఇదీ...
కారం కారంగా... థాయ్‌లాండ్..!
థాయ్ వంటకాలలో ప్రధానంగా వెల్లుల్లి, కారం, మిరియాలు... ఉంటాయి. మన వంటకాలతో పోలిక ఉన్న మరొక పదార్థం నిమ్మరసం. ఆ తర్వాత కొత్తిమీర. ఇంచుమించు అన్ని సంప్రదాయ వంటలలోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. ఇక ఫిష్ సాస్, ఉప్పు కలిపిన రొయ్యల ముద్ద మాంసాహారప్రియులను అలరిస్తుంది. ఇక్కడి వీధుల్లో చిన్న చిన్న స్టాల్స్‌లోనూ ‘పడి థాయ్’ అనే వంటకం నోరూరిస్తుంటుంది. ఇది థాయ్ జాతీయ వంటకం. దీనిని నూడుల్స్, సోయా టోఫూ, చింతపండు గుజ్జు, నిమ్మరసం కలిపి తయారుచేస్తారు. శాకాహారం, మాంసాహారంలోనూ ఈ వంటకం లభిస్తుంది.
ఆలివ్ రుచి.. గ్రీసు..!
ఆలివ్ వంటకాలకు గ్రీసు దేశం ప్రసిద్ధి. ఆలివ్ ఆయిల్ వల్ల ఇక్కడి వంటకాలు అత్యంత రుచిగా, తాజాగా ఉంటాయి. ఎక్కువగా సలాడ్స్ రూపంలో దొరికే ఇక్కడి వంటకాలలో కూరగాయలు, మూలికలు, గింజధాన్యాలు, బ్రెడ్, వైన్, చేపలు... వాడతారు. మరీ ముఖ్యంగా బ్రెడ్, టొమాటో, చీజ్, వంకాయ, మన పెరుగులాంటి యోగర్ట్‌తో.. చేసే వంటకం ఇక్కడ ప్రసిద్ధి. గ్రీసు దేశపు జాతీయ డిజర్ట్‌గా దీనికి పేరుంది. అవసరాన్ని బట్టి వంటలలో నట్స్, తేనె వాడుతుంటారు. బుధ, శుక్రవారాలు శాకాహారానికే ప్రాముఖ్యం ఇస్తారు.
రైస్ నూడుల్స్ హవా.. చైనా..!
రెండు చెక్కపుల్లల సాయంతో భోజనం చేసే నేర్పు చైనీయుల సొంతం. చైనా ‘యిన్ యాన్’ సాంస్కృతిక అంశాలు వీరి పాత్రలలో ఘుమఘుమలాడుతుంటాయి. కూరగాయలు, పండ్లు, మాంసం.. అతి శీతల కౌంటర్లలో కొనుగోలు చేస్తారు. ఇక చైనా నదీ తీరాలలో పండిన ధాన్యపు పంటతో ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తయారు చేస్తారు. ఇదే వీరి ప్రధాన ఆహారం. వీటినే వందల రకాల రుచులతో తయారుచేస్తారు.
షాంపైన్ అంటే ఫ్రాన్స్..!
ఫ్రెంచ్ ఆహారంలో ‘బాగెట్టై’ అనే బ్రెడ్‌తో పాటు చీజ్, షాంపైన్, నత్తలు... ఎక్కువగా కనిపిస్తాయి. విలాసవంతమైన హోటల్స్‌లో ‘హాటె క్యుజిన్’ అనే డిష్ లభిస్తుంది. అరుదుగా లభించే వైన్, బంగాళదుంప, వెల్లుల్లి, ఆకుకూరలను దీంట్లో వాడతారు. చేపలు, గుడ్లు, బఠానీలను ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. చాక్లెట్స్ తయారీ ఎక్కువ.
మొక్కజొన్న, బీన్స్ వంటకాల మెక్సికో..!
మెక్సికన్ ఆహార తయారీ పద్ధతులలో స్పానిష్ ప్రభావం అధికం. ఫ్రెంచ్, ఆఫ్రికన్ చారిత్రక అంశాలు వీరి వంటకాలలో కనిపిస్తాయి. మొక్కజొన్న, చిక్కుడుగింజల(బీన్స్) తరహా వంటకాలు ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తాయి.
వేడి వేడి పిజ్జాల... ఇటలీ..!
ఇటలీ వంటకాలు ప్రపంచమంతా కోరుకునే విధంగా ఉంటాయి. ఈ దేశ పాకశాస్త్ర నైపుణ్యం అలాంటిది. సన్నని పలక మాదిరిగా ఉండే పిజ్జా, పాస్తాలో వందలరకాలు కనిపిస్తాయి. ఇవన్నీ అన్ని దేశాలలోనూ లభిస్తున్నాయి.
తేనీటి విందుకు... జపాన్..!
నాలుకను వెర్రెత్తించే జపనీస్ వంటకం నోటినిండా రుచిని పంచుతుంది. ఇక్కడ రెస్టారెంట్‌లలో ‘యాకిటోరి (గ్రిల్డ్ చికెన్), ‘సుషి, సాషిమి (చేపలు), టెంపురా (వేయించిన దినుసులు), నూడుల్ బార్స్.. నోరూరిస్తుంటాయి. వీరి విందులలో తేనీరు ప్రధానమైనది. గ్రీన్ టీ, తేయాకుతో తయారుచేసే కేకులను టేస్ట్ చేయాల్సిందే! ఇక పదార్థాల కలయిక, తయారీ, విందులో కొద్ది కొద్ది మోతాదులో వడ్డించే తీరులో వీరి సంప్రదాయ కళ చూడముచ్చటగా ఉంటుంది.
రైస్ భేష్... ఇండోనేషియా, మలేషియా..!
ఈ రెండు దేశాలు వంటకాలకు ప్రపంచానికి అతి పెద్ద వేదిక. చైనా, పోర్చుగీస్, ఇండియాలకు.. పాకశాస్త్ర నిపుణులు, కలినరీ కాన్సెప్ట్‌లో వివిధ రకాల దినుసులను, పదార్థాలను కలపడం ఈ దేశస్థులే తీసుకువచ్చారు. ఈ రెండు దేశాలను ఆహారానికి మారుపేరుగా చెప్పుకుంటారు. ఇక్కడ ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. మిర్చి పంటలు ఎక్కువ. మన రుచికి ఇక్కడి వంటకాలు ఏ మాత్రం తేడా అనిపించవు.
కుంకుమపువ్వుకు స్పెయిన్
ఏ దేశానికి వెళ్లినా ఆహారం గురించి ఇబ్బంది తలెత్తవచ్చు. స్పెయిన్‌కి వెళితే మాత్రం ఏ ఇబ్బందీ ఉండదు. మన బిర్యానీని పోలిన ఆహారమే ఇక్కడా లభిస్తుంది. మాంసాహారం, శాకాహారంతోనూ తయారుచేసే ఈ వంటకం పేరు ‘పయెల్లా.’ ఇది స్పెయిన్ జాతీయ వంటకం కూడా! ప్రాంతీయ వంటకాలలో ప్రధానంగా కుంకుమపువ్వు, జీలకర్ర, తేనెను ఉపయోగిస్తారు. సీ ఫుడ్ (సముద్ర జీవులతో తయారుచేసే ఆహారం), మాంసాహార తయారీలో సాస్‌లను కలుపుతారు. వీరికి రాత్రి భోజనం ప్రధానమైనది. రాత్రి 9 తర్వాతే వీరు ‘నైట్ మీల్ ఈవెంట్’ను జరుపుకుంటారు. వేడి వేడి సూప్‌లలో ‘క్యాట్ సూప్, డాగ్ స్టెవ్’లు లభిస్తాయి.
ప్రయాణపు పసందు...
Published Thu, Jul 10 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement