తినడమూ తెలిసుండాలి!
విడ్డూరం
ఇంట్లో ఉంటే ఎలా పడితే అలా తినేస్తాం కానీ... బయట ఎక్కడైనా భోజనం చేయాల్సి వస్తే కాస్త జాగ్రత్తగా ప్రవర్తించాలి. లేదంటే మనకు మర్యాద తెలియదనుకుంటారు. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పద్ధతులు తెలుసుకుని మరీ భోజనానికి కూర్చోవాలి. లేదంటే మనం చేసే కొన్ని పనులు వారిని బాధ పెడతాయి. మనం వారిని అవమానించాం అనుకునేలా చేస్తాయి.
జపాన్‌లో ప్లేటును పూర్తిగా ఖాళీ చేయకూడదు. కాస్త మిగల్చాలి. లేదంటే మనం కడుపు నిండలేదని చెబుతున్నట్టు వాళ్లు అర్థం చేసుకుంటారు.
చైనాలో చెంచాలు, ఫోర్కులు, చాప్‌స్టిక్స్‌ని బౌల్‌లో నిలబెట్టి ఉంచకూడదు. వాటిని ప్లేటులో పడుకోబెట్టాలి. లేదంటే మనం అర్ధాకలితో భోజనాన్ని ముగించినట్టు లెక్క.
థాయ్‌ల్యాండ్‌లో ఫోర్‌కతో ఆహారాన్ని తినకూడదు. దాని సహాయంతో చెంచాతో తీసుకుని మాత్రమే తినాలి. లేదంటే మనకు టేబుల్ మ్యానర్‌స లేదనుకుంటారు వారు.
దక్షిణ కొరియాలో భోజనానికి కూర్చున్నప్పుడు... అక్కడున్న వారిలో అత్యధిక వయస్కులు తినడం ప్రారంభించేవరకూ మనం ఆహారాన్ని ముట్టకూడదు.
ఇటలీలో సీఫుడ్ తినేటప్పుడు కాంబినేషన్‌గా చీజ్ అడిగితే మనల్ని చాలా చీప్‌గా చూస్తారు.
కెనడాలో భోజనం ముగిసిన తరువాత వంట చేసిన వారిని తప్పక మెచ్చుకుంటారు. అది భోజనానికి, దాన్ని పెట్టిన వారికి ఇచ్చే గౌరవం!
చిలీలో తినేందుకు రెండు చేతుల్నీ ఉపయోగించకూడదు.
అఫ్గానిస్తాన్‌లో తినేదేదైనా కింద పడితే తీసి ముద్దు పెట్టుకోవాలి.
ఈజిప్ట్‌లో ఖాళీ అయిన గ్లాసులో మనమే డ్రింక్ నింపుకోకూడదు. ఆతిథ్యం ఇచ్చేవారు నింపే వరకూ వేచివుండాలి!
భారతదేశంతో పాటు చాలా దేశాల్లో ఎడమచేతితో తినడం సభ్యత కాదు. అది అపరిశుభ్రమైన చర్యే కాదు, అమర్యాద కరమైన చర్యగా కూడా భావిస్తారు.