విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజాలు అన్నీ ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు జన్మదినం జరుపుకునే డిసెంబర్ 25కి ముందు నాలుగు వారాల నుంచి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. లాటిన్ భాషలోని అడ్వెంటస్ అనే పదం దీనికి మూలం. అడ్వెంట్ అంటే ఆగమనం/ రాకడ/ ఆహ్వానం అని అర్థం. డిసెంబర్ 24 సాయంత్రంతో అడ్వెంట్ ముగుస్తుంది.
అడ్వెంట్ నాలుగు వారాల్లో దేవాలయాల్లో ముందస్తు క్రిస్మస్ వాతావరణం ఏర్పడుతుంది. అడ్వెంట్ తొలి ఆదివారమే పెద్ద నక్షత్రాన్ని అలంకరిస్తారు. ఏసు జననానికి ముందు ఆకాశంలో పుట్టిన కొత్త నక్షత్రానికి గుర్తుగా నక్షత్రాన్ని అలంకరించడంతో క్రిస్మస్ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దేవాలయాల్లోనూ క్రిస్మస్ చెట్టును అలంకరించి రంగురంగుల దీపాలతో అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు. పచ్చని చెట్టు ప్రేమకు, శాంతికి, జీవిత విలువలకు ప్రతీక. అడ్వెంట్ నాలుగు వారాల్లో వరుసగా మూడు వారాలు ఊదారంగు మైనపు వత్తులూ, చివరివారం గులాబి రంగు మైనపు వత్తి వెలిగిస్తారు.
ఈ అన్ని రోజుల్లో జరిగే ప్రార్థనలో ప్రేమ –ఆనందం, విశ్వాసం – శాంతికి గుర్తుగా రంగురంగుల మైనపు వత్తులు వెలిగించడం క్రీస్తుశకం 567 నుండి కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ప్రారంభించారు. ఈ నాలుగు వారాలూ దేవాలయం ప్రధాన పీఠభాగం (ఆల్టార్)ని ఉదారంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దేవాలయ అధిపతులు కూడా అదే రంగు వస్త్రాలను ధరిస్తారు. ఊదారంగు రాచరికానికి గుర్తు. రారాజు ఆగమనానికి ఆహ్వానం పలకడానికి సమాజాన్ని సిద్ధం చేయడంలో మతాధిపతులు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. అడ్వెంట్ కాలమంతా తెల్లవారుజామునే ప్రార్థనలు నిర్వహించి, సమాజానికి క్రిస్మస్ ఆగమన సందేశం ఇస్తారు.
అడ్వెంట్ కాలంలోనే క్రిస్మస్ కారల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. యువకులు, పెద్దలు ఒక సమూహంగా ఏర్పడి ఆ యా గృహాలు సందర్శించి పాటలు, నృత్యాలతో పండుగ ఉత్సాహాన్ని నింపుతారు. ఈ నేపథ్యంలోనే ఆ యా ప్రాంతాల్లోని అనాథలను గుర్తించి వస్త్రాలు, ఆహారం పంచి ఇస్తారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించ’మన్న సందేశం అక్షరాలా పాటిస్తారు. అడ్వెంట్ వల్ల ఏసును హృదయంలో ప్రతిష్టించుకుని తప్పులు పునరావృతం కాకుండా ఆత్మక్షాళనం గావించుకోవడం ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత శుద్ధితో పాటు సమాజ ప్రక్షాళన జరుపుకుని మానవ సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఆనందించడం, ఒకరికొకరు చేయూతను అందించుకోవడం అడ్వెంట్ కాలంలో చేయవలసిన కర్తవ్యం.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి
(నవంబర్ 24న అడ్వెంట్ ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment