ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు.
‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు.
రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్‌గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు.
నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక.
ఈదుల్ ఫిత్ర్ ఇలా...
ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి.
ఖురాన్ ప్రబోధనలు
►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188)
►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి.
►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10)
►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36)
►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2)
►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108)
►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29)
నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10)
(చదవండి: హలీమ్.. రుచికి సలామ్)
Comments
Please login to add a commentAdd a comment