పిల్లల్లో చాలామంది కొన్నిసార్లు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతుంటారు.ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. నిజానికి చాలా సందర్భాల్లో స్కూళ్లలో ప్రేయర్‌కు నిలబడ్డ సమయంలో ఇలా జరుగుతుడటం గమనించవచ్చు. ఈ సమస్యను ‘సింకోప్’ అంటారు. దీన్ని సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు.
పిల్లల్లో సింకోప్ కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి.
ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు.
సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా పిల్లలు పదే పదే ‘సింకోప్’కు లోనై పడిపోతుంటే మాత్రం డాక్టర్‌కు చూపించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment