Meet Asma Khan Woman Behind The Popular Darjeeling Express In London, Unknown Facts About Her - Sakshi
Sakshi News home page

Darjeeling Express Asma Khan Story: ఆహా ఏమి రుచి... ఎంత కృషి!

Published Thu, Jun 16 2022 8:14 AM | Last Updated on Thu, Jun 16 2022 1:14 PM

The woman behind the popular Darjeeling Express in London - Sakshi

అవసరమే ఆవిష్కరణలకు 
కారణం అవుతుంది... అంటారు.
అవసరమే అన్నీ నేర్పిస్తుంది... 
అని కూడా అంటారు.
అస్మాఖాన్‌కు వంటలలో ఓనమాలు తెలియవు. ఇంగ్లాండ్‌కు వెళ్లిన కొత్తలో స్వదేశి ఇంటి వంటల రుచులు ఆమెకు దూరం అయ్యాయి. దీంతో పనిగట్టుకొని వంటలు నేర్చుకుంది. అయితే ఆమె అక్కడే ఆగిపోలేదు.
ఆల్‌–ఉమెన్‌ ‘డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌  రెస్టారెంట్‌’ ద్వారా సూపర్‌ఫాస్ట్‌గా దూసుకుపోతోంది..

‘అస్మాఖాన్‌ ఏమిటి?’ అనే సింగిల్‌ ప్రశ్నకు ఎన్నో జవాబులు దొరుకుతాయి. అందులో కొన్ని...

మంచి చెఫ్‌: ఆమె గరిట తిప్పితే వంటల రుచులు ఎక్కడికో వెళ్లిపోతాయి.

స్టార్‌ రెస్టారెటర్‌: వ్యాపారం అంటే ఆషామాషీ విషయం కాదు. అయినప్పటికీ  ఆ వ్యాపారంలో దూసుకుపోయింది. ఎంతోమంది ఔత్సాహికులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

వంటల పుస్తకాల రచయిత్రి: వంటల పుస్తకాలు చదివించేలా ఉండడమే కాదు, చదువు పూర్తయిన తరువాత వంటగదిలోకి పరుగెత్తేలా చేయాలి... అంటారు. అస్మాఖాన్‌ పుస్తకాలు అలాంటివే.

ఘనత: బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ‘100 కూలెస్ట్‌ పీపుల్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
కోల్‌కత్తాలో పుట్టిపెరిగిన అస్మాఖాన్‌ వివాహం తరువాత కేంబ్రిడ్జి (ఇంగ్లాండ్‌) కి వచ్చింది. వంటల విషయంలో భర్త అభిప్రాయానికి, తన అభిరుచికి మధ్య చాలా తేడా ఉండేది. ఆయన విషయంలో భోజనం అంటే... జస్ట్‌ ఫర్‌ ఎగ్జిస్టింగ్‌! తనకు మాత్రం భోజనం అనేది కేవలం భోజనం మాత్రమే కాదు... అదొక గొప్ప సంస్కృతి. ఇప్పుడు తాను ఆ సంస్కృతికి దూరం అయింది,

పుట్టింట్లో ఇష్టంగా తిన్న వంటకాలు గుర్తుకు వచ్చి నోట్లో నీరు ఊరేది. దీంతో ‘ఎలాగైనా సరే వంటలు నేర్చుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చింది. కేంబ్రిడ్జిలో ఉంటున్న బంధువు దగ్గర వంటలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తరువాత... మూడు నెలల పాటు ఇండియాలో గడపడానికి వచ్చినప్పుడు... తల్లి, ఇంటి వంటమనిషితో పాటు ఎంతోమంది బంధువుల దగ్గర ఎన్నో వంటకాలు నేర్చుకుంది. తక్కువ సమయంలో వాటిలో నేర్పు సాధించి ‘ఆహా ఏమి రుచి!’ అనిపించుకుంది.

తిరిగి కేంబ్రిడ్జికి వచ్చిన కొంతకాలానికి... ఇండియన్‌ రెస్టారెంట్‌ ఒకటి ప్రారంభించాలనుకుంది. కానీ అది ఎలాంటి కాలం అంటే... ఇండియన్‌ రెస్టారెంట్ల విషయంలో ‘నేడు ప్రారంభం’ ‘మూడు రోజుల తరువాత మూసివేత’ అన్నట్లుగా ఉండేది. దీనికి కారణం అక్కడ నివసిస్తున్న భారతీయులు కూడా ‘ట్రెండ్‌’ పేరుతో రకరకాల రుచులను ఆస్వాదించేవారు తప్ప భారతీయ భోజనాల దగ్గరకు అరుదుగా వచ్చేవారు.
రెస్టారెంట్‌ ఆలోచన భర్తకు నచ్చలేదు. అలా అని ఆయన వద్దని వారించలేదు.

ఒక శుభముహుర్తాన లండన్‌లో ఆల్‌–ఉమెన్‌ ‘డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెస్టారెంట్‌’ మొదలుపెట్టింది అస్మాఖాన్‌. పేరుకు తగ్గట్టే దూసుకుపోయింది. ‘ఆహా ఏమి రెస్టారెంట్‌’ అనిపించింది. ‘ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌... మొదలైన దేశాల్లో వంటగదులు మహిళల ఆధ్వర్యంలోనే ఉంటాయి. రెస్టారెంట్‌ల దగ్గరికి వచ్చేసరికి మగ చెఫ్‌లే ఎక్కువగా కనిపిస్తారు’ అంటున్న అస్మాఖాన్‌ తన రెస్టారెంట్‌లో మహిళా  చెఫ్‌లు, ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఆదివారం ఈ రెస్టారెంట్‌ ‘చెఫ్‌’లుగా రాణించాలనుకుంటున్న మహిళల కోసం శిక్షణ కేంద్రంగా మారుతుంది.

వృత్తిలో విజయశిఖరం అందుకున్న అస్మాఖాన్‌ ఆ విజయం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. సామాజిక బాధ్యతను తన కర్తవ్యంగా భావిస్తుంది. 2019లో ఇరాక్‌కు వెళ్లి ఉగ్రవాద బాధిత మహిళల కోసం ‘ఆల్‌–ఉమెన్‌ రెస్టారెంట్‌’ను ప్రారంభించింది. ఇక మనదేశం విషయానికి వస్తే... ‘మళ్లీ ఆడపిల్లే’ అని నిట్టూర్చే కుటుంబాల మానసిక ధోరణిలో మార్పు తీసుకువచ్చేలా ‘సెకండ్‌ డాటర్‌ ఫండ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తోంది అస్మాఖాన్‌. ఉదా: రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తున్న అస్మాఖాన్‌ భవిష్యత్‌లో మరిన్ని సామాజికసేవా కార్యక్రమాల కోసం సిద్ధం అవుతోంది.

రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తోంది ఆస్మాఖాన్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement