పూర్తిగా అంతరించే ప్రమాదంలో పలు జాతులు! దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి! పాపం ఈ తాబేళ్లు! | World Tortoise Day 2023: Interesting Facts In Telugu Funday Cover Story | Sakshi
Sakshi News home page

పూర్తిగా అంతరించే ప్రమాదంలో పలు జాతులు! దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి! తాబేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?

Published Sun, May 21 2023 1:38 PM | Last Updated on Sun, May 21 2023 2:04 PM

World Tortoise Day 2023: Interesting Facts In Telugu Funday Cover Story - Sakshi

World Tortoise Day 2023: తాబేలు కుందేలు కథ మనందరికీ తెలిసినదే! తాబేలు తాపీగా నడుస్తుంది. కుందేలు చెంగు చెంగున దూకుతూ వేగంగా పరుగులు తీస్తుంది. కుందేలు తాబేలుతో పరుగు పందేనికి దిగింది. తాపీ నడకల తాబేలును చివరిక్షణంలోనైనా ఓడించగలనని, గెలుపు తనదే అనుకుంది కుందేలు.

మితిమీరిన ఆ ఆత్మవిశ్వాసంతోనే ఒక చెట్టు కిందకు చేరి హాయిగా కునుకు తీసింది. నిద్ర నుంచి కుందేలు కళ్లు తెరిచి చూసే సరికి నిరంతర శ్రమను నమ్ముకున్న తాబేలు తాపీగా గమ్యాన్ని చేరుకుంది. ఈ కథలో తాబేలు గెలిచింది. ఇది ప్రాచీనకాలం నాటి గ్రీకు కథ. ఇందులోని నీతి విశ్వజనీనమైనది కావడంతో అనువాదాల ద్వారా ప్రపంచమంతటా పాకింది. 

మనదేశంలో తాబేలును కూర్మావతారానికి ప్రతిరూపంగా పూజిస్తారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోనూ తాబేలును ఆరాధించే ఆచారాలు ఉన్నాయి. అయినా, ప్రస్తుత ప్రపంచంలో తాబేళ్లు మనుగడ కోసం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.

పూర్తిగా అంతరించే ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులు, చెరువులు, బావుల్లో మనుగడ సాగించే తాబేళ్లలో 356 జాతులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా– అంటే, 187 జాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి.  ఈ సంగతిని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ (ఐయూసీఎన్‌) వెల్లడించింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వీటిలోని పలు జాతులు ఈ శతాబ్ది ముగియక మునుపే పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రమాదం అంచుల్లో ఉన్న తాబేళ్ల జాతులను, అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్న తాబేళ్ల జాతులను తన ‘రెడ్‌ లిస్ట్‌’లో చేర్చింది. తాబేళ్లలో కొన్నిజాతులు మంచినీటి తాబేళ్లు, మరికొన్ని జాతులు సముద్రపు తాబేళ్లు. సముద్రపు తాబేళ్లలో దాదాపుగా అన్నీ ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు ‘వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) గుర్తించింది.

‘భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతుజాతుల్లో తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోకపోతే ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’ అని ఐయూసీఎన్‌లోని తాబేళ్ల అధ్యయన బృందం అధిపతి క్రేగ్‌ స్టాన్‌ఫోర్డ్‌ చెబుతున్నారు. 

గంగా బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతంలో
ప్రపంచవ్యాప్తంగా తాబేళ్ల మనుగడ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పటికీ మన దేశంలోనే తాబేళ్ల జాతుల వైవిధ్యం అత్యధికంగా కనిపిస్తుంది. భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌ వరకు వ్యాపించి ఉన్న గంగా బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతంలో ఏకంగా 41 జాతుల తాబేళ్లు మనుగడ సాగిస్తున్నాయి. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతుల తాబేళ్లను ప్రపంచంలో మరెక్కడా చూడలేం.

వాతావరణ మార్పులు, జల కాలుష్యం, ఆవాసాల క్షీణత వంటివి తాబేళ్ల మనుగడకు కొంతవరకు ముప్పు కలిగిస్తున్నా, అక్రమ వేట వాటికి అన్నింటి కంటే ఎక్కువగా ముప్పు కలిగిస్తోంది. మాంసం కోసం తాబేళ్లను ఇష్టానుసారం వేటాడుతున్నారు.

ఆహారం కోసమే కాకుండా, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ తాబేలు మాంసం, గుడ్లు, ఇతర శరీర భాగాలను వినియోగిస్తారు. చైనాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. తాబేలు మాంసం వినియోగంలో చైనాదే ప్రపంచంలో అగ్రస్థానం. చైనా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో తాబేళ్లను పెంచుకునే అలవాటు కూడా ఉంది.

దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి
చైనా తర్వాత ఆఫ్రికా దేశాలు కూడా తాబేలు మాంసాన్ని, గుడ్లను గణనీయంగానే వినియోగిస్తున్నాయి. తాబేళ్లను వినియోగించే ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు దక్షిణ అమెరికా దేశాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోందని, తాబేళ్ల పరిరక్షణలో యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలే కొంత మెరుగ్గా ఉన్నాయని ఐయూసీఎన్‌ చెబుతోంది. తాబేళ్లు తిండి, నీరు లేకపోయినా నెలల తరబడి బతకగలవు. అక్రమ రవాణాదారులు వీటిని వేటగాళ్ల నుంచి కొనుగోలు చేసి, గిరాకీ ఎక్కువగా ఉండే దేశాలకు దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి చేస్తుంటారు.

తాబేళ్లు ఇటూ అటూ కదిలి తప్పించుకోకుండా ఉండేందుకు, వాటిని తల్లకిందులుగా పెట్టెల్లో బంధించి రవాణా చేసే పద్ధతి చాలా క్రూరమైనదని ప్రపంచవ్యాప్తంగా జంతుప్రేమికులు గగ్గోలు పెడుతున్నా, వివిధ దేశాల్లో తాబేళ్ల అక్రమ రవాణా మాత్రం ఆగకుండా సాగుతూనే ఉంది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న తాబేళ్ల జాతులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో మన భారత్‌ మూడో స్థానంలో ఉంది. చైనా, వియత్నాం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న

కొన్ని జాతుల తాబేళ్లు:


నార్తర్న్‌ రివర్‌ టెరాపిన్‌: ఇది మంచినీటి తాబేలు. పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది.


రెడ్‌ క్రౌన్డ్‌ రూఫ్‌ టర్టల్‌: ఇది అత్యంత అరుదైన మంచినీటి తాబేలు. చంబల్‌లోయలోని చంబల్‌ ఘరియాల్‌ జాతీయ అభయారణ్య ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. 

ఇండియన్‌ స్టార్‌ టార్టాయిస్‌: ఇది భారత్, పాకిస్తాన్, శ్రీలంకల్లోని కొద్దిపాటి నీటి వనరులు ఉన్న పొడినేలల్లోను, పొదలతో నిండి ఉన్న చిట్టడవుల్లోను కనిపిస్తుంది. ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతున్న తాబేలు జాతుల్లో ఇదొకటి.

బ్లాక్‌ పాండ్‌ టర్టల్‌: ఎక్కువగా చెరువులు, పెద్దపెద్ద బావుల్లో కనిపిస్తుంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లో ఇది కొంత అరుదుగా కనిపిస్తుంది. దీన్ని స్పాటెడ్‌ పాండ్‌ టర్టల్‌ అని కూడా అంటారు. 

ఇండియన్‌ నేరోహెడెడ్‌ సాఫ్ట్‌షెల్‌ టర్టల్‌: ఇది ఎక్కువగా గంగా పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. నదిలోని చేపలు, కప్పలు, ఇతర కీటకాలు దీని ప్రధాన ఆహారం. 


బ్లాక్‌ సాఫ్ట్‌షెల్‌ టర్టల్‌: ఇది భారత్, బంగ్లాదేశ్‌లలో దిగువ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కొందరు చెరువుల్లో కూడా ఈ జాతి తాబేళ్లను పెంచుతుంటారు.

ఆసియన్‌ జెయింట్‌ టార్టాయిస్‌: భారత్‌ సహా ఆసియా ప్రధాన భూభాగంలో ఉన్న దేశాల్లో కనిపిస్తుంది. భారత్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియాల్లో కొంత ఎక్కువగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనిని ఆసియన్‌ ఫారెస్ట్‌ టార్టాయిస్‌ అని, మౌంటెయిన్‌ టార్టాయిస్‌ అని కూడా అంటారు. ఈ జాతి తాబేళ్లు చాలా భారీగా పెరుగుతాయి. ఈ జాతి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు ఐయూసీఎన్‌ గుర్తించింది.

తాబేళ్ల విశేషాలు
తాబేళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి రకరకాల పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. వీటిలో కొన్ని ఇట్టే అరచేతిలో ఇమిడిపోయేలా ఉంటాయి. ఇంకొన్ని కొండల్లా పెరుగుతాయి. సజావుగా బతకనిస్తే వీటిలో కొన్ని శతాబ్దాల ఆయుర్దాయంతో బతుకుతాయి. ఇంకొన్నిటి ఆయుర్దాయం పట్టుమని పదేళ్ల వరకే ఉంటుంది. తాబేళ్లలో ఉన్న వైవిధ్యం మరే జంతుజాతిలోనూ కనిపించదు. కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

అతిచిన్న తాబేలు
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత చిన్న తాబేలును గత ఏడాది కనుగొన్నారు. న్యూఆర్లీన్స్‌ తీరం వద్ద తచ్చాడుతున్న ఈ తాబేలును లూసియానా తీర పరిరక్షక దళానికి చెందిన శాస్త్రవేత్తలు పట్టి తెచ్చి మీడియా ముందు ప్రదర్శించారు.

ఇది కెంప్స్‌ రిడ్లే జాతికి చెందిన తాబేలు. ఈ జాతి తాబేళ్లు దాదాపు రెండడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అయితే లూసియానాలో శాస్త్రవేత్తలకు దొరికిన తాబేలు పూర్తిగా ఎదిగినా, దీని పరిమాణం ఆరంగుళాల లోపే ఉండటం విశేషం.

అతిపెద్ద తాబేలు
ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు సీషెల్స్‌లోని బర్డ్స్‌ ఐలాండ్‌లో ఉంది. ఇది ఆసియన్‌ జెయింట్‌ టార్టాయిస్‌ జాతికి చెందినది. సాధారణంగా ఈ జాతి తాబేళ్లు మూడున్నర నుంచి నాలుగు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇది నాలుగు అడుగుల ఐదంగుళాల పొడవు, మూడడుగుల నాలుగంగుళాల వెడల్పు, రెండడుగుల మూడంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలుగా గిన్నిస్‌ రికార్డుకెక్కింది. 

ఆలివ్‌రిడ్లే వలస ప్రయాణం
ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్రపు తాబేళ్లు. ఇవి ఎక్కువగా పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి. భారత్, జపాన్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మైక్రోనేసియా తదితర తీరాల్లో ఇవి కనిపిస్తుంటాయి. వీటిది విస్తారమైన సామ్రాజ్యం. ఒకప్పుడు ఇవి చాలా విరివిగా కనిపించేవి. ఇష్టానుసారంగా వేటాడుతుండటంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

గుడ్లు పెట్టేకాలంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అనువైన తీరాలను వెతుక్కుంటూ వలస వెళతాయి. గుడ్లు పెట్టడం కోసం ఇవి మన దేశం, ఒడిశాలోని కేంద్రపడా జిల్లా గహిర్‌మథా తీరానికి, గంజాం జిల్లాలోని రుషికుల్యా నదీముఖద్వారానికి పెద్దసంఖ్యలో చేరుకుంటాయి. ఈ కాలంలో కర్ణాటకలోని హొన్నవర్‌ తీరానికి, తమిళనాడులోని కోరమండల్‌ తీరానికి, శ్రీలంక తీరాలకు కూడా ఇవి చేరుకుంటాయి.

ఏటా ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇక్కడకు వీటి రాక మొదలవుతుంది. గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలతో కలసి మే మొదటి వారం వరకు సముద్రంలో వీటి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. వీటికి ట్యాగులు తొడగడం ద్వారా పరిశోధకులు వీటి రాకపోకల తీరుతెన్నులను అధ్యయనం చేయగలుగుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 1978 నాటికి కోటికి పైనేగా ఉండేది. తర్వాతి కాలంలో వేటగాళ్ల తాకిడి పెరగడంతో 2008 నాటికి 8.52 లక్షలకు పడిపోయింది. వీటి పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా, అక్రమంగా వీటి వేట కొనసాగుతూనే ఉంది.

 

ఆలయాల్లో కూర్మావతారం
తాబేలును పూజించడం మన దేశంలో శతాబ్దాలుగా ఆచారంగా వస్తోంది. కృతయుగంలో శ్రీమహావిష్ణువు కూర్మావతారం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనంలో దేవదానవులు కవ్వంగా ఎంపిక చేసుకున్న మంధర పర్వతం మునిగిపోకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపం దాల్చి, తన వీపుపై ఆ పర్వతాన్ని మోశాడని పురాణాల కథనం.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రం ఉంది. కూర్మావతారానికి గల అత్యంత అరుదైన పురాతన ఆలయం ఇది. పదకొండో శతాబ్దిలో దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో గుంపులు గుంపులుగా తాబేళ్లు యథేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తాయి. కూర్మావతార ఆలయాల్లో ఇది అత్యంత ప్రసిద్ధమైనది. చిత్తూరు జిల్లా సముద్రపల్లెలోని కూర్మవరదరాజ ఆలయంలోను, కర్ణాటకలోని గవిరంగాపుర క్షేత్రంలోని రంగనాథ స్వామి ఆలయంలోనూ శ్రీమహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజలు అందుకోవడం కనిపిస్తుంది. 

ఇతర దేశాల్లో కూర్మారాధన
ప్రాచీనకాలం నుంచి పలు ఇతర దేశాల్లోనూ కూర్మారాధన ఉంది. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన పలు దేశాల్లో తాబేలును సుదీర్ఘాయుర్దాయానికి, సహనానికి, సరళ స్వభావానికి, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. తాబేలును అదృష్టానికి సంకేతంగా నమ్ముతారు. తాబేళ్లను గురించి ఎన్నో పురాణగాథలు ఉన్నాయి.

తాబేలు తన వీపు మీద భూగోళాన్ని మోస్తుందనే పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. భూగోళాన్ని మోస్తున్న రూపంలో పురాతన తాబేలు శిల్పాలు, చిత్రాలు చైనా ప్రాంతంలో కనిపిస్తాయి. చైనీస్‌ సంప్రదాయ శాస్త్రమైన ‘ఫెంగ్‌ షుయి’లో తాబేలుకు విశిష్టమైన స్థానం ఉంది.

‘ఫెంగ్‌ షుయి’ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుందని చైనా ప్రజలు నమ్ముతారు. ఈ నమ్మకం ఇటీవలి కాలంలో ఇతర దేశాలకూ పాకడంతో దేశదేశాల్లో ‘ఫెంగ్‌ షుయి’ బొమ్మల వ్యాపారం లాభసాటిగా సాగుతోంది. 

ఆఫ్రికా దేశాల్లోనూ తాబేలు గురించి అనేక పురాణగాథలు ఉన్నాయి. ప్రాచీన ఈజిప్టులో తాబేలును ‘షెటా’ పేరుతో ఆరాధించేవారు. తాబేలు రూపంలోని తయారుచేసిన మట్టిపలకలను ప్రాచీన ఈజిప్షియన్లు అలంకరణ రంగులు కలుపుకోవడానికి ఉపయోగించేవారు. తవ్వకాల్లో బయటపడిన ఈ తాబేలు ఆకారం పలకలను ‘జూమోఫిక్‌ ప్యాలెట్‌’గా శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. ఇవి క్రీస్తుపూర్వం నాలుగువేల ఏళ్ల నాటివని గుర్తించారు. 

మెసపటోమియా నాగరికతలో సుమేరియన్ల జలదేవత, జ్ఞానదేవత అయిన ‘ఎంకి’ ఒక సందర్భంలో భారీ తాబేలును సృష్టించిందనే పురాణగాథ ఉంది. ‘ఎంకి’కి సంబంధించిన గాథలను, శాసనాలను తాబేలు ఆకారంలోని శిలలపై లిఖించేవారు. ఈ శిలలను ‘కుందురు’ అంటారు. వీటిని ‘ఎంకి’ దేవతకు ప్రతీకగా నాటి ప్రజలు భావించేవారు.

పురాతన గ్రీకు, రోమన్‌ నాగరికతల్లోనూ తాబేలు ఆరాధన ఉండేది. తాబేలు బొమ్మలతో కూడిన ముద్రలను, నాణేలను వారు విరివిగా ఉపయోగించేవారు. ప్రాచీన గ్రీకునగరం ఏజినాకు తాబేలు సంకేతంగా ఉండేది. ప్రాచీన గ్రీకు శృంగారదేవత ‘ఏఫ్రోడైట్‌’ తన పాదాన్ని తాబేలుపై ఆనించి ఉండే శిల్పాలు కూడా బయటపడ్డాయి. 

ఇండోనేసియా, మలేసియా, వియత్నాం, తైవాన్, జపాన్‌ తదితర ఆసియన్‌ దేశాల్లోనూ పురాతన కాలం నుంచి తాబేలు ఆరాధన ఉంది. మలేసియాలో కొబ్బరాకులతో తాబేలు బొమ్మలను తయారు చేసి ఇళ్లలో వేలాడగట్టుకుంటారు. వీటిని ‘కెటుపాట్‌ పెన్యు’ అంటారు. ఇళ్లల్లో వీటిని వేలాడదీస్తే దుష్టశక్తులు ఇంట్లోకి అడుగుపెట్టవని వారు నమ్ముతారు. ఇక జపాన్‌లో ‘గెన్‌–బు’ అనే నల్లతాబేలు క్యోటో నగరాన్ని శత్రువుల నుంచి దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు.
∙∙∙
సముద్ర తీరాల్లోని జీవవైవిధ్యాన్ని మెరుగు చేయడంలోను, ఇసుక తిన్నెలను తమ గుడ్ల పెంకుల్లోని పోషకాలతో నింపడంలోను తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రంలో జెల్లీఫిష్‌ జనాభా అదుపు తప్పకుండా అరికట్టడంలోనూ తాబేళ్ల పాత్ర కీలకం.

ముఖ్యంగా ‘లెదర్‌బ్యాక్‌ సీ టర్టల్‌’ జాతికి చెందిన తాబేళ్లు జెల్లీఫిష్‌నే ప్రధాన ఆహారం చేసుకుని బతుకుతాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో తాబేళ్లు తమదైన పాత్ర పోషిస్తాయి. తాబేళ్లను కాపాడుకుంటే పర్యావరణం మరింత సురక్షితంగా ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement