Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Mesha Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Mesha Rasi-Ugadi Rasi Phalalu 2023: ఈ రాశి వారు జీవితాశయాన్ని సాధిస్తారు

Published Mon, Mar 20 2023 11:35 AM | Last Updated on Mon, Mar 20 2023 6:34 PM

Yearly Rasi Phalalu Aries Horoscope 2023 - Sakshi

మేషం (ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1)
మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న వ్యయస్థానాల్లో గురురాహువుల సంచారం, షష్ఠమ సప్తమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, లాభస్థానంలో శనిగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబం నుంచి వేరుపడే ఆలోచనలు, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితాశయాన్ని సాధించ గలుగుతారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరిగేలా ఓ మంచి అవకాశం వస్తుంది. మీకు రావలసిన ధనం అంత సులభంగా చేతికి అందదు. లక్షల్లో ఇచ్చిన ధనాన్ని వేలల్లో వసూలు చేసుకుంటారు.

కుటుంబంలో అశాంత వాతావరణం లేకుండా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు సంభవిస్తాయి. జ్యేష్ఠ కుమార్తె లేక కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని విషయాలలో రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది. మధ్యవర్తి సంతకాలు ఎక్కడా పెట్టకండి. కొన్ని విషయాలో మొండిగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. దొంగల వల్ల ప్రమాదం పొంచి వుంది. భాగస్వాములతో వివాదాలు వస్తాయి. మోసానికి సాక్ష్యం మౌనమే అవుతుంది. భూముల వల్ల లాభం పొందుతారు. భూ వివాదాలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది.

నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. ఆరోగ్య విషయాలలో, సెల్ఫ్‌డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరీ వర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు. నూతన వ్యాపారం కలిసొస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేస్తారు. దీర్ఘాకాలిక ఋణాలు తీర్చివేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యా పరిశోధన రంగాల్లో ఉన్నవారికి, ఆహారధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారులకు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కళా, సాహితీరంగాలలో ప్రఖ్యాతి లభిస్తుంది. హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పౌల్టీఫ్రావ్‌ులు, పశువుల పెంపకం లాభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సిబ్బందికి మీ మనస్తత్వం అర్థంకాక విధిలేని పరిస్థితులలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. స్వగృహ నిర్మాణం నెరవేరుతుంది. పాత శత్రువులే కొత్తగా తారసపడతారు. వారిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్ధంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

జల, వాయు, ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఉన్నతాధికారుల వద్ద అభిమానం సంపాదించుకుంటారు. విద్యా సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రమాదకర వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి ఖర్చుపెట్టే ధనానికి తగిన విధంగా ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ ప్రయాణం రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది. ఉన్న ఆస్తులను అతికష్టం మీద అమ్మకుండా కాపాడుకుంటారు. చెప్పుడు మాటలు మీ కుటుంబసభ్యుల మీద తీవ్ర ప్రభావం చూపించడం సమస్యగా మారుతుంది. గతంలో కంటే భిన్నంగా ఉన్న మీ ప్రవర్తన, ఆలోచనా విధానం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలకు దారితీస్తుంది.

దుర్వ్యసనాల ప్రభావం, స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది. బెట్టింగులకు దూరంగా ఉండండి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు, బ్యాంక్‌ పరీక్షలు, టీచర్‌ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. మంచి సంబంధం తిరస్కరించినందుకు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. జీవితంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ప్రధానపాత్ర వహిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయాలి, చేతికి మహాపాశుపత కంకణం ధరించాలి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. చాలా సందర్భాలలో మీకు ఇష్టంలేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది. పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగడానికి మొగ్గు చూపుతారు. మీ మీద ఎటువంటి ప్రలోభాలు పనిచేయవు. జీవితాశయాన్ని సాధిస్తారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. మామూలు ప్రమిదలతో దీపారాధన చేయటం కన్నా లక్ష్మీప్రమిదలతో దీపారాధన చేయటం వల్ల్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. అయినవాళ్ళకి అరమరికలు లేకుండా సహాయం చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ కాలం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది.

వృత్తి ఉద్యోగాల్లో మీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. వెన్నుచూపి పారిపోవటం మీ చరిత్రలో లేదని నిరూపిస్తారు. దివారాత్రులు శ్రమించినా గుర్తింపు రాని ఉద్యోగాలను మానేసి, మరొక చోట ఉద్యోగం చూసుకుందామని భావిస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు, లాభాలు గడిస్తారు. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. జీవితా శయాన్ని సాధించుకోగలుగుతారు. సర్పదోషాలు, గ్రహాల వల్ల కలిగే బాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయ రాదు). విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో మంచి ఫలితాలు వచ్చినా, ఇంటర్వ్యూలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. పూజలలో, అభిషేకాలలో జవ్వాదిని ఉపయోగించండి. క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ముఖ్యంగా సంగీత నాట్యాల్లో అఖండమైన పేరుప్రఖ్యాతులు లభిస్తాయి.

సినిమారంగంలో, టీ.వీలలో అవకాశాలు వస్తాయి. కోర్టుతీర్పులు అనివార్యం అవుతాయి. ముఖ్యులతో విడిపోవలసి వస్తుంది. కీలకమైన స్థానంలో నిరాదరణ ఎదురవడంతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. భవిష్యత్తు ఫలితాలకు మంచి పునాది ఏర్పడు తుంది. అతికష్టం మీద ఉన్నత విద్యను అభ్యసిస్తారు. మీ పేరుమీద చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. క్రమశిక్షణ తప్పిన సంతానాన్ని అతికష్టం మీద దారిలో పెట్టగలుగుతారు. సంతానం ప్రయోజకులవుతారన్న నమ్మకం కుదురు తుంది. తల్లివైపు బంధువులకు కొంతకాలం అండగా నిలువవలసి వస్తుంది. మీ ఆత్మీయవర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు సహాయం చేస్తారు. చేతివృత్తులు, అలంకార కేంద్రాలు, వస్త్ర వ్యాపారం వంటి వాటిలో రాణిస్తారు. ఫైనాన్స్, చీటీల వ్యాపారాలు చెప్పదగినవి కావు. వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement