(ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1)
వృషభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పంచమ షష్ఠమ స్థానాలలో కేతువు, లాభ వ్యయస్థానాలలో గురు రాహువుల సంచారం, దశమస్థానంలో శని, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సాహసోపేత నిర్ణయాలతో చేపట్టిన కార్యాలలో విజయాలు సాధిస్తారు. ప్రతిరంగంలో గట్టిపోటీని ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు.
ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ఓర్పు నేర్పులతో అందరినీ కలుపుకొనిపోయే ధోరణి అవలంబిస్తారు. ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షకపాత్ర పోషించవలసి వస్తుంది. తల్లిదండ్రులు, పెద్దల పట్ల బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. కుటుంబ విషయాలు మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఫ్యాన్సీ షాపుల వారికి, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారులకు, బ్యూటీపార్లర్స్ వారికి, చేతివృత్తుల వారికి, సుగంధద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి, హోల్‌సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా సత్ఫలితాలనిచ్చే నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు.
పరిచయాలు, స్నేహాలు ధనం ముందు పనిచేయవని తెలుసుకుంటారు. రాజకీయంగా కలసి వస్తుంది. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో, వారసత్వ ఆస్తులకు సంబంధించిన అంశాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు సమస్యలు సృష్టిస్తారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయి.
ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. సర్పదోషాలు, గ్రహ బాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. మనోనిగ్రహంతో, క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. సంతానం లేని వారికి సంతానప్రాప్తి, వివాహం కాని వారికి వివాహప్రాప్తి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు. వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది.
మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందినవాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. మీకు మేలు కలిగించే పత్రాలు ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దూరప్రాంత విద్యాసంబంధ విషయాలు కష్టంమీద ఫలిస్తాయి. ఇతరుల జీవితాలు సరిదిద్దవలసిన బాధ్యతలు మీమీద పడతాయి. గతంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. నూతన కోర్సులను అభ్యసిస్తారు. సంవత్సర మధ్యలో జీవితభాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధవహించవలసి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయినా వివాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. శత్రువర్గం బలపడి ఉండటం ఇబ్బందికరంగా మారుతుంది.
టీవీ, సినీరంగాల్లోని వారికి, కళాకారులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచటం వల్ల ఎంతగానో లాభపడతారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. విదేశీ ఉద్యోగ, విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశంసలు పొందుతాయి. మానసిక సంతోషం కోసమే ధర్మకార్యాలు చేస్తారు. ప్రచారం కోసం కాదు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కోరుకున్న ఉద్యోగం లభించడం మీకు సంతోషాన్నిస్తుంది. వైద్య విద్యలో రాణిస్తారు. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి.
లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ అనుకూలంగా మారుతాయి. దయ లేని అధికారుల వల్ల కొంతకాలం ఇబ్బందిపడతారు. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తిలో మీ వాటా దక్కుతుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. ఆవేశంలో మాట్లాడిన మాటలకు చింతించవలసి వస్తుంది. విద్యాపరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని అనుకూల ఫలితాలను సాధిస్తారు. దూరదృష్టితో చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది. మీ చెడు కోరుకునే వారు మీకు అత్యంత సమీపంలో ఉన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోండి. స్వగృహ యోగం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి.
కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంవత్సర ద్వితీయార్ధంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మీ పిల్లలపై ఇతరుల పెత్తనం మీకు నచ్చని విషయం అవుతుంది. ఒకప్పుడు మీరు గౌరవించిన వ్యక్తులే మీకు బద్ధశత్రువులు అవుతారు. మీ పేరుమీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు విషయాల్లో ఇతరులకు సలహాలు ఇవ్వవద్దు. మోసగాళ్ళకు జీవితంలో తావు ఇవ్వకండి. పెద్దల నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. ప్రేమ వివాహాలు కలిసిరావు. ఇతరులకు చేబదులుగా ధనం ఇవ్వొద్దు, తీసుకోవద్దు. డబ్బు ఇవ్వవలసి వస్తే అప్పుగా ఇవ్వొద్దు, దానంగా ఇవ్వండి. రాజకీయ వాతావరణంలోకి ప్రవేశించవలసి వస్తుంది.
రాజకీయపదవి లభిస్తుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని పాటిస్తారు. ఆత్మీయవర్గం సూటిపోటి మాటలు బాధిస్తాయి. వృద్ధులపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సంగీత, సాహిత్యరంగాలో అవార్డులు, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. పలుకుబడి, డబ్బులతో ఎంతపనైనా సులభసాధ్యం చేస్తుందని గ్రహిస్తారు. విద్య, సాంకేతిక, క్రీడారంగాలలో విశేషంగా రాణిస్తారు. మీ శక్తిసామర్థ్యాలకు గాను, ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. పోటీపరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలనే మీ పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది.
ప్రేమవివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణిస్తారు. తల్లిదండ్రులతో పెనవేసుకున్న అనుబంధాలు ఏమవుతాయోనని సందిగ్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. కొద్దికాలం గైనిక్ సమస్యలతో బాధపడతారు. అవివాహితులకు వివాహకాలం. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతలలో భాగం పంచుకుంటారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. సహోదర సహోదరీ వర్గాన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటివాళ్ళ ముందు ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి ఆరోగ్యం, నిద్ర, ఆహారాన్ని లెక్కచేయకుండా శ్రమిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. మొత్తంమీద ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment