రెండేళ్ల పరిచయం.. 105 మంది పిల్లలు కావాలి! | Young Mum Has 11 kids And Wants Dozens More With Husband | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పరిచయం.. 105 మంది పిల్లలు కావాలి!

Published Fri, Feb 19 2021 12:14 PM | Last Updated on Fri, Feb 19 2021 1:48 PM

Young Mum Has 11 kids And Wants Dozens More With Husband - Sakshi

1 ప్లస్‌ 10 పిల్లలతో క్రిస్టీనా 

ఆమె వయసు 23. ఆయనకు 56. ఆమె తన ఆరేళ్ల కూతుర్ని వెంటపెట్టుకుని నల్ల సముద్ర తీర ప్రాంతంలో విహారానికి వెళ్లినప్పుడు తొలిసారి ఆయన్ని చూసింది. ఆయన తనను చూసి ‘హాయ్‌’ అన్నప్పుడు ఆ కళ్లలో తనపై కనిపించిన ప్రేమను చూసింది. ఆమె సింగిల్‌ మదర్‌. ఆయన పెళ్లయిన పెద్ద మనిషి. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ‘ఏదైనా కోరుకో హృదయేశ్వరీ..’ అని భార్యకు వరమిచ్చాడు భర్త. ఆయన బిలియనీర్‌. అందుకు వరం ఇవ్వడం కాదు. ఆమె మీద ఆయనకు ఉన్న ప్రేమ అంతకన్నా సంపన్నమైనది! ‘‘నాకు 105 మంది పిల్లలు కావాలి..’’ అందామె! దానర్థం.. ‘‘నిన్నే కోరుకున్నా.. నీ ప్రతి రూపాలే నాకు నూటా అయిదు కావాలి’’ అని. గత ఏడాదిలో వాళ్లకు పది మంది పిల్లలు పుట్టారు. మిగతా పిల్లల్ని కొంత గ్యాప్‌ తర్వాత ప్లాన్‌ చేసుకుంటుందట ఆమె. ఇక్కడ చూడండి.. పిల్లల్లో పిల్లలా కలిసిపోయి ఆ తల్లి ఎలా నవ్వులు చిందిస్తోందో!! 

ఆ ఇరవై మూడేళ్ల  అమ్మాయి పేరు క్రిస్టీనా ఆజ్టర్క్‌. ఇక నుంచి క్రిస్టీనా అందాం. రష్యన్‌ తను. మాస్కోలో ఉండేది. ఆ యాభై ఆరేళ్ల పెద్దాయన పేరు గాలిప్‌ ఆజ్టర్క్‌. ఇక నుంచి గాలిప్‌ అందాం. జార్జియా తనది. ఒకప్పుడు రష్యన్‌ భూభాగం. ఇప్పుడు ప్రత్యేక దేశం. ఆ దేశంలోని నల్ల సముద్ర తీరప్రాంతమైన బటూమీ పట్టణంలో ఉంటారు ఆయన. ట్రావెల్‌ మేగ్నెట్‌. కనుక మిలియనీర్‌. దేవుడు ఎలా కలుపుతాడో చూడండి. ఇద్దర్నీ కలిపాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు బటూమీలో ఉంటున్నారు. భర్త ఎక్కడుంటే అక్కడే కదా భార్య ఉండేది. అందుకే మాస్కో నుంచి తన  ఆరేళ్ల కూతురు వికాతో పాటు గాలిప్‌ దగ్గరికి వచ్చేసింది క్రిస్టీనా. ఇప్పటి వరకు ఇదంతా ఒక మామూలు విషయం. లోకంలో అనేకం ఉంటాయి.. ‘నువ్వాదరిని, నేనీదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనుకునే జంటలు. 

వీళ్ల స్టోరీ ప్రత్యేకమైనది. ఆసక్తి కలిగించేది. అయితే స్టోరీ మొత్తం చదివినా సమాధానం లభించని రెండు ప్రశ్నలైతే మీకు మిగిలిపోతాయి. క్రిస్టీనాకు పదిహేడేళ్ల వయసుకే పుట్టిన కూతురు ‘వికా’ కు తండ్రి ఎవరన్నది, గాలిప్‌ భార్యా బిడ్డలు ఎవరన్నది. ఈ దంపతులు ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు కనుక అడిగి బలవంత పెట్టడం మర్యాద కాదు. ప్రస్తుతం అయితే వీళ్లకు పదిమంది పిల్లలు! వికా తో కలిపి పదకొండు మంది. ఇక కథలోకి వెళ్దాం. 

పిల్లల్లో ఒకరిగా క్రిస్టీనా

క్రిస్టీనాకు, గాలిప్‌కు పరిచయం అయింది రెండేళ్ల క్రితమే. కూతుర్ని తీసుకుని మాస్కో నుంచి నల్ల సముద్రానికి విహారానికి వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న ఆ ఇసుకలో వారి చూపులు కలిశాయి. ‘నాకనిపించిందీ.. తను నా కోసమే పుట్టింది’ అని ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు గాలిప్‌. ఇక క్రిస్టీనా అయితే ‘ఆయనలో తెలియని ఆకర్షణ ఏదో నన్ను ఆయన వైపు లాగేసింది’ అంటారు. కాబట్టి.. వయసును పక్కన పెట్టి చూస్తే వీళ్లు చూడచక్కని జంట. ఆయనకు ఆస్తులు, అంతస్తులు, ఇంకా అలాంటివేవో కోట్ల కొద్దీ ఉన్నాయి. కానీ క్రిస్టీనా.. ‘నిన్నే కోరుకున్నా’ అన్నారు. ‘నన్ను సరే, ఏదైనా కోరుకో’ అన్నారు ఆయన. దేవుడు వరం ఇస్తానంటే మొహమాటపడాలి. భర్త వరం ఇస్తానంటే ఎగిరి భుజంపై కూర్చోడానికి వెనకాముందూ చూడక్కర్లేదు. ‘నీలాంటి పిల్లలు కావాలి. వంద మంది కావాలి. వంద మంది కాదు. వందా ఐదు మంది’ అంది క్రిస్టీనా.

‘ఓ బేబీ’ అని మురిసిపోయారు గాలిప్‌. ‘అదేం లెక్కా.. వన్నాట్‌ వైఫ్‌’ అని ఆయనేం ఆశ్చర్యపోలేదు. ‘ఓకే.. ప్లాన్‌ చేద్దాం’ అన్నారు. ప్లాన్‌ చేస్తే అయ్యే పనా! అయినా ప్లాన్‌ చేశారాయన. పదిమంది సరోగేట్‌ మదర్స్‌ని వెదికి రెండేళ్ల వ్యవధిలో పదిమంది బిడ్డల్ని ఆమె చేతికి అందించాడు. అండం ఆమెది. శుక్రకణం అతడిది. గర్భం వేరే స్త్రీది. ఇప్పుడా ఇల్లు క్రిస్టీనా సొంత కూతురు విగాతో, పాటు గాలిప్‌తో కలిగిన పది మంది శిశువుల కేరింతలతో బెలూన్‌లు ఎగురుతున్నట్లుగా కళకళలాడుతోంది. మొదటి బిడ్డ ముస్తాఫా 2020 మార్చి 10 పుట్టాడు. పదో బిడ్డ ఒలీవియా 2021 జనవరి 16 న పుట్టింది. మరి క్రిస్టీనా కోరుకున్న వరంలోని మిగతా 95 మంది మాటేమిటి! ‘కాస్త ఆగుతాను’ అంటోంది క్రిస్టీనా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ. మొదటైతే.. ‘ఏడాదికో బిడ్డను కంటాను..’ అని పట్టింది. క్రిస్టీనా. గాలిప్‌ ఒప్పుకోలేదు. ‘మన బిడ్డలే కదా నీకు కావలసిందీ’ అని సరోగసీ ఐడియా చెప్పారు.  

పిల్లల కోసం కొని పెట్టిన పుస్తకాలతో క్రిస్టీనా, ∙భర్తతో క్రిస్టీనా

ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయా చొప్పున పదిమంది ఆయాలు ఉన్నారు! వాళ్లందరి సంరక్షణను వారికే అప్పగించింది క్రిస్టీనా. అయితే తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. అందరికీ ఒకటే నిద్ర టైమ్‌. రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు. అలా వారికి అలవాటు చేయించింది. శిశువుల్లో కవలలు, ఒకే పోలికలు ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. ‘హూ ఈజ్‌ హూ..’ అన్నది పేర్లతో చెప్పేస్తుంది క్రిస్టీనా. ‘వంద మంది పిల్లలైనా కనిపెట్టేస్తాను’ అని నవ్వుతూ అంటోంది తను. ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటోంది. ‘పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడం తేలికైన సంగతి కాదు. ఈ పది మందీ కొంచెం పెద్దయ్యాకే మరికొంత మంది పిల్లల కోసం ప్రయత్నిస్తాను’’అంటోంది. ఆరేళ్ల కూతురుకి కూడా ఆ పిల్లల చిన్నచిన్న పనులు అప్పజెబుతోంది. ఇక పిల్లలకు ఏం చదివి వినిపించాలి, ఏ వేళకు వారికి ఏ పని చేయాలి అనేవి క్రిస్టీనానే ఆయాలకు చెబుతంటుంది.

ఏడుస్తున్న పిల్లల్ని మాత్రం ఆయాలను ఎత్తుకోనివ్వదు. తనే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. ఫుడ్డు కూడా గ్రాముల్లోనే. ఒక గ్రాము తక్కువా కాదు. ఒక గ్రాము ఎక్కువా కాదు. ఆయాలకు ఇంకొక పని కూడా ఉంది. తడిసిన డయపర్‌లను ఫొటో తీయడం. ఆ తడి కలర్‌ని బట్టి బిడ్డల ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది క్రిస్టీనా. ప్రతి శిశువుకూ ఒక డైరీ ఉంటుంది. అందులో ఆ శిశువు వివరాలన్నీ ఏ రోజుకారోజు ఆయాలు నోట్‌ చేస్తుంటారు. వాళ్లేం తిన్నారు, ఎంత తిన్నారు, ఎన్ని గంటలకు నిద్రలోకి ఒరిగిపోయారు, తిరిగి ఎన్ని గంటలకు నిద్ర లేచారు. మధ్యతో ఎన్నిసార్లు మేల్కొన్నారు.. ఇలా ప్రతి వివరమూ ఉంటుంది. 

ఇటీవల క్రిస్టీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘‘మా ఇల్లు నందనవనం, ప్రశాంత నిలయం. నేనూ నా భర్త ఇంట్లో సినిమాలు, కార్టూన్‌ షోలు చూస్తాం. పిల్లలకు పెట్టం గానీ మేమిద్దరం జంక్‌ఫుడ్‌ తింటాం.. (ఆ ఆరేళ్ల పిల్లకు కొద్దిగా పెడతారేమో!), బ్యాక్‌గామన్‌ గేమ్‌ ఆడతాం.. ఇంకా పిల్లలందరితో కలిసి వాకింగ్‌ చేస్తాం..’’ అని షేర్‌ చేసుకున్నారు. నిజంగా పంచుకుంటే పెరిగే సంతోషమే ఇది. పిల్లలు, పిల్లల్లాంటి పెద్దలు ఎక్కడున్నా వారి ప్రేమ వెలుగులు భూగోళమంతా ప్రసరిస్తూ ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement