అంతరిక్ష పర్యాటకం ఇటీవలి కాలంలోనే మొదలైన ధోరణి. సంపన్న పర్యాటకులను భూమికి సుదూరంగా వ్యోమసీమలో విహారయాత్రలకు తీసుకుపోయేందుకు పలు అంతరిక్ష పర్యాటక సంస్థలు పోటాపోటీగా విలాసాలను కల్పిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన అంతరిక్ష పర్యాటక సంస్థ ‘జెఫాల్టో’ అంతరిక్ష పర్యాటకుల కోసం వ్యోమసీమలో విందువిలాసాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.
‘జెఫాల్టో’ సంస్థ తన పర్యాటకులను బెలూన్ ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకుపోనుంది. ఇది భూమికి 25 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించనుంది. అంతరిక్షంలోకి చేరుకోగానే, బెలూన్‌లోనే పర్యాటకులకు విందు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులు అంతరిక్షం నుంచి భూమిని తిలకిస్తూ విందు ఆరగించవచ్చు. తొలుత ఈ యాత్రను 2025లో ప్రారంభించాలని తలపెట్టినా, పర్యాటకుల నుంచి స్పందన బాగుండటంతో 2024 చివర్లోనే ఈ యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ‘జెఫాల్టో’ తాజాగా ప్రకటించింది.
ఇందులో ఆరుగురు యాత్రికులను అంతరిక్షానికి తీసుకుపోవడానికి బుకింగ్‌లు ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టిన సంస్థలేవీ తమ యాత్రికులకు అంతరిక్షంలో విందువిలాసాలను కల్పించలేదు. ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న తొలి సంస్థగా ‘జెఫాల్టో’ రికార్డులకెక్కనుంది. ఈ యాత్రకు వెళ్లడానికి టికెట్టు ధర 1.20 లక్షల యూరోలు (రూ.1.07 కోట్లు) మాత్రమే!
(చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !)
Comments
Please login to add a commentAdd a comment