శోభిత ధూళిపాళ... తెలుగు అమ్మాయే అని చెప్పి ఆమె ప్రతిభను ప్రాంతానికి పరిమితం చేయడం కాదు.. మన శోభను ప్రపంచం గుర్తించింది అని గర్వంగా చెప్పుకోవడం. అన్నట్టు శోభితను ఆప్యాయంగా శోభా అని పిలుస్తారు. టైటిల్‌తో సంబంధం లేకుండా కాస్ట్ అండ్ క్య్రూలో ఆమె పేరు చూసి మరీ ఆ సినిమాను లేదా ఆ సిరీస్‌ను సెలెక్ట్ చేసుకుంటారు ప్రేక్షకులు, వీక్షకులు. ఆమె గురించి వివరాలు..
- పుట్టింది తెనాలిలో.. పెరిగింది విశాఖపట్టణంలో. తల్లిదండ్రులు.. శాంత రావు, వేణుగోపాల్ రావు.
- చదివింది.. ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్‌లో డిగ్రీ, పీజీ (కామర్స్). భరతనాట్యం, కూచిపూడి, గిటార్ వాద్యంలోనూ ప్రావీణ్యం.
- 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నది. సెకండ్ రన్నరప్‌గా ఎంపికైంది. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్‌తో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.
- రామన్ రాఘవ 2.0.. శోభిత ఫస్ట్ సినిమా. విక్కీ కౌశల్ పక్కన నటించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రిటిక్స్ చాయిస్ ఫర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌కూ నామినేట్ అయింది.
- మేడ్ ఇన్ హెవెన్.. శోభిత ఫస్ట్ వెబ్ సిరీస్. బ్యూటీ విత్ టాలెంట్ అని అబ్బుర పడుతూ ఆమె గురించి వీక్షకులు గూగుల్ చేసేంతగా ఇంపాక్ట్ చూపించింది.
- గూఢచారి.. తెలుగులో శోభితను చూపించిన మూవీ. అందులో ఆమె నటనను ప్రశంసిస్తూ మహేశ్‌బాబూ ట్వీట్ చేశాడు. ‘థాంక్యూ’ అని బదులు ఇచ్చిన శోభిత .. మహేశ్ అభిమానుల ట్రోలింగ్‌కి లోనైంది.. అంత పెద్ద హీరో కితాబిస్తే మర్యాద లేకుండా థాంక్యూ అనడమేంటి అని. ‘థాంక్యూ చెప్పడం మర్యాద కాదా? సిల్లీ’ అంటూ కొట్టిపారేసింది.
- ఆమె తలపుల్లో సినిమా లేదు.. ఆ మాటకొస్తే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ‘రామన్ రాఘవ 2.0’ లో నటించే వరకు ఆమె చూసిన సినిమాలు ఇరవై అయిదే. అందులో ఎనిమిది ‘హ్యారీ పాటర్’ సిరీసే. ‘ఆనంద్’ తెలుగు మూవీ కూడా ఉంది.
- సాహిత్యంతోనే చెలిమి చేసింది చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ పుస్తకాలతోనే దోస్తీ. ఎప్పటికైనా రచయిత కావాలనేదే ఆమె లక్ష్యం.
- ఆమె ఇతర చిత్రాలు.. షెఫ్, కాలకండి, మూతోన్ (మలయాళం), ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, బార్డ్ ఆఫ్ బ్లడ్ (వెబ్ సిరీస్).. ఎట్‌సెట్రా.
- ‘‘ మిస్ ఇండియా’ నా సెల్ఫ్ ఎస్టీమ్‌ను దెబ్బతీసింది. నా నుంచి నన్ను వేరుచేసింది. సినిమాల విషయానికి వస్తే.. కలలో కూడా అనుకోలేదు యాక్ట్రెస్‌నవుతానని. అనుకోనిది నేరవేరినందుకు చాలా హ్యాపీ. అనుకున్నది కూడా నెరవేర్చుకోవాలి. రైటర్‌ననిపించుకోవాలి. మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే తెలుసు’’ అంటుంది శోభిత ధూళిపాళ.
Comments
Please login to add a commentAdd a comment