ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగే దేశంలో ఐదేళ్లపాటు ఎక్కడో ఒక చోట ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉండటమన్నది అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్నది మాత్రమే కాదు.. దేశ అభివృద్ధి ప్రణాళికల అమలుకు అంతరాయంగా మారే ప్రమాదమూ ఉంటుంది. అలాగని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఒకేసారి ‘జమిలి’ ఎన్నికలు జరిపించాలనుకోవడంలోని హేతుబద్ధత ఏమిటి? సాధించే ప్రయోజనం ఏమిటి? ఇందులోని సాధ్యా సాధ్యాలు అటుంచితే ‘ఒక దేశం.. ఒక ఓటు’ ను ఆచరణాత్మకం చేయాలని చూస్తున్న పాలకుల ఆలోచనలోని మర్మం ఏమై ఉంటుంది? పాలనా విధా నాలు ఒంటెత్తు పోకడలయ్యేందుకు ఈ విధానం దారి తియ్యదని నమ్మకం ఏమిటి? తాజా ‘పెగసస్’ వెల్లడింపుల సాక్షిగా జవాబు లేని ప్రశ్నలెన్నో!
ఒక దేశానికి ఒక ఎన్నికే ఉండాలి. ‘వన్ నేషన్, వన్ ఓటర్’ జాబితానే ఉండాలి. ఏడాది పొడవునా ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూ ఉంటే అభి వృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ ఏర్పాటు అవసరం. అందుకు ఓటింగ్‌లో అందరూ పాల్గొనేటట్టు చేయాలి.. అని చెబుతున్న సమయంలోనే ఇజ్రాయెల్‌తో 2017లో రక్షణ ఒప్పం దంలో భాగంగా ‘పెగసస్’ గూఢచర్య సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రహస్య ఒప్పందం గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ తిరుగులేని సంచలన కథనాన్ని ప్రకటించింది. అలాంటిదేమీ లేదని దేశ ప్రజలకు ఇన్నాళ్లుగా వివరణ ఇస్తూ వచ్చిన వైనాన్ని ‘టైమ్స్’ వివరాలతో ప్రచురించడంతో ప్రభుత్వం మరింతగా జవాబు దారీ అయింది. అంతేగాదు, ఈ పరిణామం వల్ల ఇజ్రాయెల్‌తో ‘స్నేహం’ గాఢం అయిన తరువాత పశ్చిమాసియాతో, అరబ్ దేశాలతో ఉన్న భారత్ సంప్రదాయ సంబంధాలు కూడా అస్థిమితం అయ్యే పరిస్థి తులు తలెత్తాయి!
భారతదేశాన్ని, భారత ప్రయోజనాలను, రాజకీయాలను ఇజ్రా యెలీ గూఢచారి సంస్థ చేతిలో పెట్టడంతో ఇటు భారత పార్లమెంట్‌కు, అటు పశ్చిమాసియా సభ్య దేశాలకు సమాధానం చెప్పగల దశ దాటి పోయి ‘ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షి’ చందాన మన దేశ పరిస్థితి మారింది. బహుశా అందుకే అన్నాడేమో ప్రపంచ ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఐన్‌స్టీన్: ఈ ప్రపంచం చెడ్డవారివల్ల ప్రమాదకరంగా మార లేదు, జరుగుతున్న చెడును చూస్తూ కూడా సకాలంలో స్పందించలేని వారివల్లనే అలా మారింది. అది ఎంత వాస్తవమో పాలకుల విధా నాలు అక్షర సత్యాలుగా నిరూపి స్తున్నాయి. మన ఒంటెత్తు పోకడల ద్వారా మనమే గాక ‘పెగసస్’ గూఢచర్యం సహాయంతో పార్ల మెంటును, దేశ ప్రజలను పక్కతోవ పట్టించడంతో చివరికి ఇజ్రాయెలీ ప్రభుత్వం ఆడిన అబద్ధాలకు మనమే బలి కావలసిన పరిస్థితులు వచ్చాయి.
అందుకే ఒకవైపున దేశ అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన న్యాయమూర్తి – ఎప్పుడైతే ‘పెగసస్’తో రహస్య లావాదేవీల వ్యవహా రాన్ని పసిగట్టారో ఆ క్షణం నుంచీ పార్లమెంటుకు వివరించవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి, జాగ్రత్త పడవలసి వచ్చింది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి.. విచారణకు సంబంధించిన లోతు పాతుల్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొద్దీ కొత్త ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి. ‘పెగసస్’ వ్యవహారం ఆనుపానుల్ని లోతుగా లాగే ప్రయత్నంలో న్యాయమూర్తి తలమునకలై ఉన్నారు. దీంతో ప్రభుత్వం తన ఇజ్రాయెలీ గూఢచర్య సంబంధాలను దాచు కోగల పరిస్థితి లేకనే భారత పౌరహక్కుల నేతలపైన, ప్రజాస్వామ్య సంస్థల కార్యకర్తలపైన బాహాటంగానే ఎదురు దాడులు ప్రారంభించి, కొనసాగిస్తూ వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనంగా పేర్కొన్న పెగసస్ గూఢచర్యత్వం భారతీయులకు కొత్త వెల్లడి కాదు! కొత్తదన మల్లా – ‘పెగసస్’ గూఢచర్యం బట్టబయలయిన తర్వాత ఆకస్మి కంగా ఇజ్రాయెల్‌కు పరుగెత్తవలసిన అవసరం ఎందుకు వచ్చిందీ, అందువల్ల కొత్తగా ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బంది ఏమిటన్నది అసలు ప్రశ్నగా తలెత్తింది.
‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఇజ్రాయెలీ సైబర్ ఆయుధ విక్రయ సంస్థ (ఎన్‌ఎస్‌ఒ) ఒక ప్రైవేట్ సంస్థేగానీ ప్రభుత్వ సంస్థ కాదని, అందువల్ల ఇజ్రాయెలీ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకు వర్తించవనీ ఇజ్రాయెలీ పాలకులు బొంక బోవడాన్ని ‘టైమ్స్’ ఖండించాల్సి వచ్చింది. ఎప్పుడైతే పేరు పేరునా ‘పెగసస్’ గూఢ చర్యం ద్వారా ప్రజా ఉద్యమకారుల, పౌర సంస్థల, ఆందోళనాకారు లయిన కార్యకర్తలపైన నిఘాకు దిగిన ఆ మరుక్షణమే వివరాలన్నీ కేంద్రానికి అందిస్తూ రావడం గూఢచారి సంస్థ కర్తవ్యంగా మారింది. పైగా ‘పెగసస్’ గూఢచర్యంపై ఎన్నిసార్లు కేంద్ర సమాచార శాఖకు లేఖలు పంపినా సమాధానం రావడం లేదు. ప్రతిపక్ష సభ్యుల ఫోన్స్ టాపింగ్ అన్నది ఎన్ని పర్యాయాలు జరిగినా, వాటిని గూర్చిన ‘అజ–పజ’ ఇన్నాళ్లుగా తెలియరాలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ‘పెగసస్’ విషయంలో ఆడుతున్న, లేదా ఆడటానికి ప్రయ త్నిస్తున్న నాటకానికి ‘కత్తెర’ పడుతుందా లేదా అన్నది విచారణ చర్యలకు చొరవ తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి తుది తీర్పుపై ఆధారపడి ఉంది. నిజానికి తుది తీర్పు వాయిదా పడటంతో అవకా శానికి ద్వారాలన్నీ మూతపడ్డాయి. కనుకనే ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా దేశ పాలకులు ఇజ్రాయెల్‌కు పదే పదే పరుగులు తీస్తూ అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెలీ గూఢ చర్యలకు వత్తాసు పలుకుతూ కాలం గడపాల్సిన దుఃస్థితి వచ్చింది.
అంతేగాదు, ‘పేదవాడి కోపం పెదవికి చేటన్న’ మాట ఎంత నిజమో, ఇటీవల బడుగు దేశాల్ని దోపిడీ చేసి బలిసిన సంపన్న దేశాలు మురిగిపోయిన వంద మిలియన్ల కోవిడ్–19 ఇంజక్షన్ డోసుల్ని పేద దేశాలకు పంపి, సొమ్ము చేసుకున్నాయని ప్రపంచ సంస్థ ‘ఐక్యరాజ్య సమితి శిశు సంరక్షణ విభాగం’ (14.1.2022) వెల్లడించడంతో మరోసారి రుజువైంది. ప్రపంచంలోని అతి నిరుపేద దేశాలలో పెక్కుమంది ఆఫ్రికాలో ఉన్నందున సంపన్న దేశాలు ఈ దోపిడీకి వరుసకట్టాయి. ఇది ఇలా ఉండగానే, ‘రాబోయే కోవిడ్ వైరస్‌లు కొత్తగా తలెత్తిన ‘ఒమిక్రాన్’ వైరస్ కన్నా తీవ్రంగా ఉంటాయని, రానున్న మరిన్ని వైరస్ క్రిములు తక్కువ ప్రమా దకరమని భావించరాదని కోవిడ్–19 సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ హెచ్చరికలతో దాన్ని అంటి పెట్టుకొన్న ‘వ్యాపార ప్రయోజనం’ కాస్తా బయటపడింది. అమెరికాలోని ప్రభుత్వాన్ని సాకుతున్న 84 మందుల గుత్త కంపెనీలు (ఫార్మా కంపెనీలు) రాజ్యమేలుతున్నంత కాలం ఫార్మా కంపెనీలదే ‘ఆడింది ఆట, పాడింది పాట’! అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ వైద్య నిపుణులే ఆ సంగతి చెబుతూ, ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, అమె రికాలో పాలకులు డెమో క్రాట్లయినా, రిపబ్లికన్‌లు అయినా పాలనా విధానాలకు సంబంధించి ‘దొందూ దొందే’నని అమెరికా కార్మికుల అనుభవం. అందుకే రెండింటినీ కలిపి జమిలిగా ‘డెమో–పబ్లికన్స్’ (డెమోక్రాట్స్ –రిపబ్లికన్స్) అని పేరుపెట్టారు. ఇద్దరూ కలిసే ప్రపంచ సంస్థ తమ చేతుల నుంచి జారిపోకుండా నిధులతో సాకుతూంటారు. నిర్ణయాలు వారివి, అనుభవాలు, బాధలు ప్రజలవీ!
అందుకే ‘ఒమిక్రాన్’ వ్యాధి అయినా, మరొక వైరస్ క్రిమి అయినా ప్రజల ఆరోగ్యాన్ని శాసించేది ఫార్మా కంపెనీలే అవు తున్నాయి. అలాగే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నినాదం కూడా క్రమంగా ఒకే దేశం, ఒకే నాయకుడిగా; ఒకే దేశం, ఒకే పార్టీగా ఉండిపోతే సుఖంగా ఉంటుందని భావించవచ్చునా? ఆలోచించండి! ఈ సంద ర్భంలో ‘మలజుల్’ అనే కార్టూనిస్టుకు తట్టిన ఓ గొప్ప ఐడియాని మనం కూడా పంచుకుని ఆనందిద్దాం: ఆ కార్టూన్‌లో ఓ దిమ్మ మీద ఓ వ్యక్తిని పెట్టి అతని మెడలో దండ వేశారు. ఆ బొమ్మలోని వ్యక్తిని చూస్తున్న ఇద్దరు పెద్ద మనుషులకు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారో బోధపడక వాళ్లే సమాధానం కూడా చెప్పుకుంటారు– ‘అయినా గాంధీ, నెహ్రూలకు పచ్చి వ్యతిరేకని తెలిసిన తర్వాతనే మనం ఈ విగ్రహాన్ని నెలకొల్పాం’ అని! దేశంలో నేటి రాజకీయాల తీరు తెన్ను లను ఈ వ్యంగ్య రేఖా చిత్రణ ఒక చక్కటి ప్రతిఫలనం.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment