సుమారు యాభై ఏళ్లుగా తెలుగునేలపై నక్సలిజం వేళ్లూనుకొని, దాని ఉనికిని ప్రదర్శిస్తూ, సరిహద్దు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో భూస్వాముల ఆగడాలు, వెట్టి చాకిరీలు, స్త్రీలపై అత్యాచారాలు, నిమ్నకులాలపై దౌర్జన్యం, వారి ఎదుగుదలపై కన్నెర్ర... తరాలుగా సాగిన ఉదంతాలు ఉన్నాయి. గ్రామాలకు నక్సల్స్ రాకతో ఎండుటాకులు భగ్గున మండినట్లు బాధిత వర్గాలు వారికి తోడు నిలిచాయి. అన్నం పెట్టాయి, ఆశ్రయమిచ్చాయి. వీరు ముందే వస్తే ఎంత బాగుండేది అనుకున్నాయి కానీ నక్సలిజం పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధమని, దానికి మద్దతుగా నిలవడం నేరమని తెలీని పరిస్థితి ఉండేది.
చూస్తుండగానే గ్రామాలను పోలీసులు, ఇతర భద్రతా దళాలు చుట్టుముట్టి నక్సలైట్లు ఏర్పరచిన సంఘాల్లో ఉన్నవారిని, వారి జెండా పట్టినవారిని, వారి పాటలు పాడినవారిని పట్టుకొని నానా యాతనలకు గురిచేశారు. నక్సలైట్ల రాకతో భూస్వాముల గుండెల్లో కొంత భయం పుట్టిన మాట వాస్తవమే కానీ గ్రామస్తులు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. యువత బతుకు చిన్నాభిన్నమైంది. ధైర్యమున్నవాడు నక్సల్స్ వెంట వెళ్ళాడు. తప్పించుకోవాలనుకున్నవాడు ముంబై, దుబాయ్ బాట పట్టాడు. పోలీసులు పిల్లల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులను వేధించి, వేధించి వేపుకుతిన్నారు.
నక్సలైట్లు ఆత్మరక్షణలో పడి అడవిబాట పట్టారు. ఇక ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి. తమ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పోలీసులు ఒంటరిగా కనబడితే వారిని నక్సల్స్ పట్టపగలు చంపిన ఘట నలున్నాయి. వీటికి ప్రతీకారంగా నక్సల్స్‌కి మద్దతుగా నిలిచిన విద్యార్థులను, డాక్టర్లను, అడ్వొకేట్లను, లెక్చరర్లను, ఇతర ఉద్యోగులను పోలీసులు ఆధారాలు దొరకని రీతిలో చంపేసినట్లు వార్తలున్నాయి. దీనితో భయోత్పాతంతో ఆయా పీడిత వర్గాలు నక్సల్స్‌కి దూరమయ్యాయి.
ఇక యుద్ధం పోలీసులు, నక్సలైట్ల మధ్యకు మారింది. నక్సలైట్ల ఏరివేతలో పోలీసులు ఏ హద్దులు దాటినా ప్రభుత్వం వారికి అడ్డు చెప్పలేదనవచ్చు. ఎన్నో ఎన్‌కౌటర్లు బూటకమనే ఆరోపణలున్నాయి. అటు నక్సలైట్ల పట్టపగలు హత్యలు కోర్టులో రుజువుకానట్లే పోలీసుల చిత్రహింసలకు,కాల్చివేతలకు ఆధారాల్లేవు.పోలీసులు, కేసులు, శారీరక హింస, చావులకు వెరిసి పీడిత వర్గాలు కూడా సర్దుకొని బతకడమే మేలనుకున్నాయి. నక్సల్స్ శక్తి కన్నా పోలీసు బలం, బలగం ఎంతో పెద్దది. ఎంతటి సాయుధ తిరుగుబాటునైనా అణచివేసే సామర్థ్యం దాని కుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నక్సలైట్ల సంఖ్యనే లెక్కించి వ్యూహరచన చేస్తోంది. అదే నిష్పత్తితో బలగాల మోహరింపు, నిధుల కేటాయింపు జరుగుతోంది. ఈ క్రమంలో ఇరువైపులా జరుగుతున్న దాడుల్లో ఓసారి నక్సలైట్లయితే, మరోసారి పోలీసు జవాన్లు చనిపోతున్నారు. అంతా పక్కకుపోయి ఈ తూటాలకు బడుగువర్గాల కుటుంబ సభ్యులే సమిధలవుతున్నారు.
నక్సలైటుది సింహంపై స్వారీ. అడవిలో ఎంత కాలం తిరిగినా ఏదో ఓ రోజు చివరకు పోలీసు బలగాలకు చిక్కక తప్పదు. ఇంకా విప్లవం, ఉద్యమ నిర్మాణం, ప్రజల మద్దతు కూడగట్టడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఉన్నదల్లా ఏరివేత, కాల్చివేతలే. దీనివల్ల వాస్తవ పీడిత వర్గాలకు లాభించేది శూన్యం. పోలీసు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు చాలావరకు కింది తరగతులలో ఆర్థిక బలహీనులే. వేరే గతిలేక ప్రాణాలను గాలిలో దీపంలా పెట్టి నాలుగు డబ్బుల కోసం, కుటుంబ పోషణ కోసం ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎదురెదురైనప్పుడు నక్సల్స్ వారిని కాల్చకపోతే, జవాన్లు నక్సల్స్‌ని కాల్చుతారు. ఇలా ఇరువైపులా చావులు తథ్యం, అనివార్యం అవుతున్నాయి.
ఏప్రిల్ 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ తదితర విభాగాల జవాన్లు 23 మంది నక్సల్స్ చేతిలో హతమయ్యారు. విధి నిర్వహణలో జవానుకు మిగిలింది చంపడమో, చావడమో.. జవాన్లు చనిపోతే బాధపడేవారున్నట్లే, నక్సల్స్ ప్రాణాలు కోల్పోతే దుఃఖపడేవారు ఉంటారు. ఎందుకంటే అన్నీ ప్రాణాలే.. అందరికీ కుటుంబాలు, బంధుమిత్రులు ఉన్నారు. ఇలా జవాన్లను ఘోరంగా చంపి ఏమి సాధించారు అని ప్రజలు, పత్రికలు నక్సల్స్‌ని గుండెభారంతో ప్రశ్నిస్తున్నాయి. నిజంగా అది హృదయవిదారక సంఘటన. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్క జవాను వయసు, కుటుంబం గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చుతాయి. అయితే చేటలో తవుడు పోసి కాట్లాట పెట్టిందెవరు అనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్లని ముద్రవేసి సోదాలతో బెదరగొడుతోంది. పౌర హక్కుల నేతలను, సామాజిక కార్యకర్తలను, ప్రజా రచయితలను జైళ్లలో కుక్కి హింసిస్తోంది. ఈ విషయంలో ఆలోచనాపరులు ప్రభుత్వాలను ప్రశ్నిం చాలి. విప్లవ సానుభూతిపరులని ఇబ్బందులు పెట్టినంత కాలం నక్సల్స్ చెలరేగిపోయే అవకాశముంది.
పేద కుటుంబాల పిల్లలు పోలీసు ఉద్యోగాలు చేసి ఈ ప్రభుత్వాలకు రక్షణగా నిలవవద్దని నక్సల్స్ వాదన. కానీ బ్రిటిష్ సైన్యంలోనూ భారతీయులు పనిచేశారు. అది బతుకుదెరువు సమస్య. మరోవైపు ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. మరో నాలుగు రోజుల్లో నలభై మంది నక్సల్స్ పోలీసు కాల్పుల్లో మరణించినట్లు వార్తల్లో రావచ్చు. నేటి జవాన్ల కోసం కన్నీరు కార్చినవారు రాబోయే కాలంలో నక్సల్స్ పోతే ఊరట చెందవచ్చు, కాని రెండు చావులు దిక్కు లేనివే. వీటిని చర్చలతో అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదే. ఇరువైపులా చస్తున్న బడుగు ప్రాణాలపై ప్రేముంటే శాంతి వైపు అడుగులేయాలి.
వ్యాసకర్త:బి. నర్సన్
కవి రచయిత 94401 28169
ఇరువైపులా బడుగుజీవులే బలి
Published Wed, Apr 7 2021 1:19 AM | Last Updated on Wed, Apr 7 2021 1:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment