మావోయిస్టులు పునరాలోచించరా? | Better Revisionist Than Dogmatic Why Maoists Need A Rethink | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు పునరాలోచించరా?

Published Fri, Apr 9 2021 12:56 AM | Last Updated on Fri, Apr 9 2021 1:09 AM

Better Revisionist Than Dogmatic Why Maoists Need A Rethink - Sakshi

హింసను ప్రేరేపించడంలో మావోయిస్టులు కూడా రాజ్య యంత్రాంగానికి ప్రతిబింబంలా మారిపోయారు. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ.. వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ  రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేకపోవడమే విషాదకరం.

ఈ వ్యాసం నేను రాస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ తమ అధీనంలోనే ఉన్నాడని, అతనికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు భారత భద్రతా బలగానికి హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌ నివాసి అయిన రాకేశ్వర్‌ సింగ్‌ ఏప్రిల్‌ 3న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత తప్పిపోయారు. ఈ ఘటనలో కనీసం 23 మంది భద్రతా బలగాలు చనిపోయారు. రాకేశ్వర్‌ తమ అధీనంలోనే ఉన్నట్లు మావోయిస్టు నాయకత్వం నుంచి వార్త అందుకున్నామని, అతడిని క్షేమంగా విడిపించడానికి ప్రయత్నిస్తున్నామని, అతడికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు హామీ ఇచ్చారని హోంశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. (గురువారం రాకేశ్వర్‌ని విడిచిపెట్టారు కూడా).  

అంటే, భద్రతా బలగాల అధికారులు మావోయిస్టులతో మాట్లాడుతున్నారనీ, ఇరువురి మధ్య చర్చ సాధ్యమేనని స్పష్టం. అంటే ఇరువర్గాలూ పరస్పరం నష్టపోయినప్పటికీ, ఒకరు మరొకరిని హంతకులు అని ఆరోపిస్తున్నప్పటికీ, అదే సమయంలో తాము చేస్తున్న హత్యలను సమర్థించుకుంటున్నప్పటికీ ఇరువురి మధ్య చర్చ అనేది సాధ్యమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వ్యూహాత్మక ఎదురుదాడి కేంపెయిన్‌ను నిర్వహిస్తున్నారని, అడవుల్లోపల తమ కేడర్లకు ఆయుధాలిచ్చి మరీ శిక్షణ ఇస్తున్నారనీ, భద్రతా బలగాలకు గరిష్టంగా నష్టం కలిగించే ఉద్దేశంతో ఉన్నారని, అందుకే ముందస్తుగా భద్రతా బలగాలు లక్ష్య ఛేదనకోసం మావోయిస్టులపై దాడికి దిగగా తమపై ఎదురుదాడి చేసి దెబ్బతీశారని సీఆర్పీఎఫ్‌ అధికారి చెప్పారు. అయితే ఆ దాడి ఘటన తర్వాత మావోయిస్టు ప్రతినిధి కూడా ఎలా మాట్లాడి ఉండేవాడో కాస్త ఊహించుకుందాం. బహుశా అతడు కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడి ఉండేవాడు. ఇంతజరిగాక కూడా అనివార్యంగా ఇరుపక్షాలూ సంప్రదింపులు జరుపుతున్నాయి. దీన్ని అందరూ ఆహ్వానించాలి. శత్రువు బలంగా ఉన్నప్పుడు, ఆధిక్యతా స్థానంలో ఉన్నప్పుడు మీరు మీ శత్రువుతో అయినా సరే మాట్లాడాల్సి ఉంది. ఈ తరుణంలో మావోయిస్టులు పైచేయి సాధించారు. వారు కూడా ఈ దాడిలో దెబ్బతిని ఉంటారు. కానీ ఎంతమందనేది మనకు తెలీదు. 

మావోయిస్టులూ, రాజ్యవ్యవస్థా..
అయితే ఎప్పటికైనా రాజ్యవ్యవస్థదే పైచేయి అని మావోయిస్టులు తెలుసుకోవాలి. ఇంతమంది బలగాలు మరణించిన తర్వాత కూడా భద్రతా బలగాల సంఖ్య తగ్గదు. గతంలో భద్రతా బలగాలు ఇదేవిధంగా ఎదురు దెబ్బతిని వెనుకంజ వేసినప్పటికీ వారి సంఖ్యాబలం కానీ ఆయుధ శక్తి కానీ క్షీణించలేదు. భారత భద్రతా బలగాల సాధన సంపత్తి ఎప్పటిలాగే ఉంటుంది. అది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. పైగా దానికి ఇతర అనుకూలతలూ ఉన్నాయి. అది బహిరంగంగానే ముందుకు నడుస్తుంది. దానికి సహాయంగా నిర్విరామంగా సరఫరాలు అందుతుంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండానే భారత భద్రతా బలగాలు చాలాకాలం మనగలుగుతాయి. కానీ మావోయిస్టుల విషయంలో అలా చెప్పలేం. కొత్తవారిని చేర్చుకోవడం వారికి చాలా కష్టమైన పని. వారు గణనీయంగా బలహీనపడతారు, వారి ఉనికి కూడా ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. వారి అధీనంలో ఉన్న ప్రాంతం వేగంగా కుదించుకుపోతోంది. వారు పోరాడుతున్న ప్రజలు కూడా పలు కారణాలతో దూరం జరుగుతున్నారు. మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణలో లేరు. మహారాష్ట్రలోనూ లేరు. ఇక బిహార్, జార్ఖండ్‌లలో వారు అదృశ్యమైపోయారు. 

మావోయిస్టు చర్యల లక్ష్యం ఏమిటి? వారు చేసే ఒక దాడికి, మరో దాడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ చర్యల వెనక ఉన్న హేతుబద్ధత విషయమై వారి మద్దతుదారులకు కూడా స్పష్టత లేదు. తమ తరపున పోరాడమని ఆదివాసీలేమైనా వారికి చెప్పారా? లేదా ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణకు మావోయిస్టులు స్వయం ప్రకటిత సంరక్షకులుగా ఉంటున్నారా? ఈ ప్రజలను విముక్తి చేయడానికే తాము వచ్చామని మావోయిస్టులు చెబుతుంటారు. కానీ ప్రజలపై తనదే యాజమాన్యమని రాజ్యం ప్రకటిస్తుంది. దీనికి మించి ఇది ఒక భూభాగం, ఒక భూమి, వనరులకు సంబంధించినది. రాజ్య వ్యవస్థ నుంచి తమను కాపాడాల్సిందిగా ఆదివాసీలు వారిని ఆహ్వానించలేదు. ప్రజలు, అడవులు వారికి రక్షణ ఛత్రంగా మాత్రమే ఉంటున్నాయి. పైగా, ఆదివాసుల పట్ల సానుభూతి కూడా వీరికి ఉండదు. అందుకనే తమకు విధేయంగా లేరనిపించినప్పుడు ఆదివాసీలను పట్టపగలే చంపడానికి కూడా మావోయిస్టులు వెనుకాడటం లేదు.

పీయూసీఎల్‌ (పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ రైట్స్‌) ఇటీవలి ప్రకటన కూడా సరిగ్గా దీన్నే చక్కగా వివరించింది. ‘నిత్యం తీవ్రవాదం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బస్తర్‌లో మళ్లీ హింస పెరుగుతున్న సమయంలో ఈ ఎన్‌ కౌంటర్‌ సంభవించింది. ఒకవైపు పారామిలటరీ బలగాల ద్వారా సామాన్యులు నిత్యం వేధింపులకు గురవుతున్న క్రమంలో ఈ ప్రాంతం మొత్తం సైనికీకరణకు గురవుతోంది. అడవుల్లో కూడా తక్కువ దూరాల్లో సైనిక క్యాంపులు నెలకొనడంతో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య స్థానిక ఆదివాసీలు పరాయీకరణకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇన్ఫార్మర్ల పేరిట చాలామంది పౌరులను మావోయిస్టులు చంపేశారు. రాజ్యవ్యవస్థ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనను ప్రశ్నించిన, నిలదీసిన వ్యక్తులపై, బృందాలపై హింసకు పాల్పడుతుండటాన్ని మేం ఎంత తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నామో.. మావోయిస్టులతో సహా ప్రభుత్వేతర శక్తులు, కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని మేం కోరుతూ వస్తున్నాం.
మావోయిస్టులూ రాజ్యవ్యవస్థకు ప్రతిబింబంగానే ఉంటున్నారు కానీ ఒకే ఒక తేడా ఉంది. రాజ్యవ్యవస్థ అవసరమైతే తన పనితీరును సవరించుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. కానీ మావోయిస్టులు మాత్రం ఆరెస్సెస్‌–బీజేపీలాగే ఒకే స్వరంతో మాట్లాడుతుంటారు. ప్రజలపై యాజమాన్యం ఎవరిది అనే అంశంపై జరుగుతున్న ఈ పోరాటంలో రాజ్యానిదే ఎప్పటికీ పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు ఎప్పటికీ ప్రభుత్వేతర శక్తులుగా, చట్టవిరుద్ధ శక్తులుగా ఉంటారు. ముఖ్యంగా మావోయిస్టులు అర్థం చేసుకోవలసింది ఇదే. 

హింస పట్ల ఈ మతిలేని ఆకర్షణ వల్ల కొన్ని తరాలు ఇప్పటికే నాశనమైపోయాయి. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని మీ సొంత తార్కికతతో హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తీవ్రవాదం అనే పదం ఒక సుందరమైన నగను ధరిస్తుంటుంది కానీ అది రాజ్యానికే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మావోయిస్టులు, రాజ్యవ్యవస్థ తమను విభేదించేవారిని పరస్పరం వధిస్తున్నాయన్నదే వాస్తవం.

తాజా ఎన్‌కౌంటర్‌ రాజ్యవ్యవస్థ పాశవిక హింసను మరింత చట్టబద్ధం చేస్తుందనడంలో సందేహమే లేదు. మానవ హక్కుల కోసం నిలబడే ఎవరినైనా, మానవ హక్కులు అనే భావనపై విశ్వాసం లేని మావోయిస్టుల హక్కుల కోసం నిలబడే వారిపై కూడా రాజ్య అణిచివేత పెరుగుతుంది. వీరిని మావోయిస్టుల తుపాకులు, రాకెట్‌ లాంచర్స్‌ కాపాడలేవు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. తమ పార్టీలోపల ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా అని వారు ప్రశ్నించుకోవాలి. నాయకత్వంతో విభేదిస్తూ కూడా గౌరవప్రదంగా మావోయిస్టులు మనగలుగుతున్నారా?

తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ... వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ  రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేదు. హింసాత్మక శక్తి పీడితులైన వీరు మానవ జీవితాలను, మానవ ప్రాణాలను వృథా చేస్తున్నారు.


వ్యాసకర్త:అపూర్వానంద్‌ 
 హిందీ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ
(ది వైర్‌ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement